కృషి  చేస్తే  రుషులు!

పున్నములు ఎన్నో వస్తాయి...కానీ ఇది మాత్రం ఎంతో ప్రత్యేకం.భూమిని, పంటను, పశువును మొక్కడం భారతీయ సంప్రదాయం...తనలోని సారాన్ని అన్నంగా మార్చి భూమాత అందిస్తుంటే...సారాన్ని ఆహారంగా మార్చేందుకు మనిషి చేసే పవిత్ర యజ్ఞం వ్యవసాయం...అలాంటి యజ్ఞానికి శ్రీకారం చుట్టే రోజు ఏరువాక పున్నమి.సాగుబాట పట్టే ప్రతి కర్షకుడూ ఓ మహర్షే! వ్యవసాయం ప్రారంభించటానికి ముందుగా భూమి పూజ తప్పనిసరిగా చేసే ఆచారం కూడా వ్యాప్తిలో ఉంది...

Updated : 28 May 2020 00:32 IST

జూన్‌ 5 ఏరువాక పౌర్ణమి

పున్నములు ఎన్నో వస్తాయి...

కానీ ఇది మాత్రం ఎంతో ప్రత్యేకం.

భూమిని, పంటను, పశువును మొక్కడం భారతీయ సంప్రదాయం...

తనలోని సారాన్ని అన్నంగా మార్చి భూమాత అందిస్తుంటే...

సారాన్ని ఆహారంగా మార్చేందుకు మనిషి చేసే పవిత్ర యజ్ఞం వ్యవసాయం...

అలాంటి యజ్ఞానికి శ్రీకారం చుట్టే రోజు ఏరువాక పున్నమి.

సాగుబాట పట్టే ప్రతి కర్షకుడూ ఓ మహర్షే!

వ్యవసాయం ప్రారంభించటానికి ముందుగా భూమి పూజ తప్పనిసరిగా చేసే ఆచారం కూడా వ్యాప్తిలో ఉంది. ఇలా పొలాల్లో దుక్కిదున్ని వ్యవసాయ యజ్ఞాన్ని ప్రారంభించే పండగే ఏరువాక పున్నమి. జ్యోతిష శాస్త్రం ప్రకారం పంటలకు అధిపతి చంద్రుడు. ఇతడు జ్యేష్ట నక్షత్రానికి చేరువలో ఉన్న సమయంలో పొలం పనులు ప్రారంభిస్తే మంచి దిగుబడులు వస్తాయి. ఈ విధంగా జ్యేష్ఠ పూర్ణిమ రోజున వ్యవసాయ పనులు ప్రారంభించి ఏరువాక పూర్ణిమ జరుపుకోవటం వ్యాప్తిలోకి వచ్చింది.●

భూమి అనంత పోషకాల గని. అందులో లేనిది లేదు. బతకడానికి కావాల్సిన ప్రతి మూలకాన్నీ అందించి జీవుల్ని పోషిస్తున్న ఆ తల్లి గర్భంలో మనిషి చేసే మహా యజ్ఞమే వ్యవసాయం. వేదాలు సైతం సాగుబడికి ఎంతో ప్రాధాన్యతనిచ్చాయి. వందలాది మంత్రాలతో వ్యవసాయ యజ్ఞ విధానాన్ని అందించాయి.

అతి ప్రాచీనమైన రుగ్వేదంలోని అక్ష సూక్తంలో ప్రత్యేకంగా వ్యవసాయ స్తుతి ఉంది. అదే వేదంలోని కృషిసూక్తంలో ‘సునాసీర’ అనేపదం వాడారు. ఇక్కడ సునా అంటే సంతోషం, సీర అంటే నాగలి అర్థం. రుగ్వేద కాలంలో నాగలి ప్రాధాన్యాన్ని వివరించే సందర్భమది. మంచి పంటల కోసం భూమిని ఒకటికి పదిసార్లు దున్నాలని కూడా రుగ్వేదం చెప్పింది. నాగలిని, ఎద్దుల మూపుల మీద కాడిని ఎంతో నేర్పుగా తాళ్ళతో కట్టాలని కూడా ఈ సూక్తంలో చెప్పారు. రుగ్వేదం పదో మండలంలో కోతలకు ఉపయోగించే కొడవలి గురించిన వివరాలున్నాయి. పొలంలో కళ్లంలో నిల్వచేసిన ధాన్యాన్ని తూర్పారపట్టడం, ఆ ధాన్యాన్ని ఎడ్లబండి మీద ఇంటికి చేరవేసే విధానాలు, పంట కొలిచే పద్ధతులను కూడా ఈ వేదంలో రుషులు వివరించారు.

యజుర్వేదం వ్యవసాయ విజ్ఞానంలో మరింత మేలైన సమాచారాన్ని అందించింది. పంటలను వ్యవసాయాధార, వర్షాధారాలుగా విభజించింది. తైత్తిరీయ సంహిత చమకాధ్యాయంలోని ఓ మంత్రంలో ‘ఓషధయ శ్చ మే కృష్ణపచ్యం చ మే అకృష్ణపచ్యం చమే...’ నాకు దున్నిన పొలాల నుంచి పండిన ఓషధులు, దున్నకపోయినా వర్షాధారంగా పండిన ఓషధులు లభించుగాక... అని ప్రార్థించినట్లు ఉంది. వివిధరకాల పంటలు, ధాన్యాల పేర్లు కూడా ఈ అధ్యాయంలో ఉన్నాయి. ‘వ్రీహయ శ్చ మే యవాశ్చ మే మాషాశ్చ మే తిలాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే మసురాశ్చ మే ప్రియంగవశ్చ మే...’ అంటూ సాగే మంత్రంలో వరి, యవలు, మినుములు, నువ్వులు, పెసలు, గోధుమలు, శెనగలు మొదలైన ధాన్యాల గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇదే వేదంలోని రుద్రాధ్యాయంలోని ‘నమస్తక్షభ్యో రథకారేభ్య’ అనే మంత్రంలో వడ్రంగులు, రథం, బళ్లు తయారుచేసే కార్మికులకు నమస్కారం అంటూ వ్యవసాయదారులు, సంబంధిత పనులు చేసే కార్మికుల గురించి, వారిని గౌరవించాల్సిన అవసరం గురించి ఉంది. యజుర్వేదంలోని మైత్రాయణీ సంహితలో నెయ్యి, తేనెలను నాగేటిచాలులో కుమ్మరించే ప్రక్రియ గురించి వివరంగా ఉంది. నాగలి కట్టాల్సిన ఎద్దుల సంఖ్య, వాటి నిర్వహణ కూడా ఇందులో ఉంది.

ఆపస్తంబ శ్రౌత సూత్రం, స్వాధ్యాయ బ్రాహ్మణం, తైత్తిరీయ సంహితల్లో వ్యవసాయానికి సంబంధించి భూమిని ఎన్నుకోవటం మొదలు, భూమిని ఎలా దున్నాలి, దున్నేందుకు ఎన్ని జతల ఎడ్లు ఉపయోగించాలి, ఎంత లోతు దున్నాలి మొదలైన విషయాలు అత్యంత వివరంగా ఉన్నాయి.

శుక్ల యజుర్వేదం లో ఎత్తుపల్లాలు లేకుండా భూమిని చదును చేయడం, బంజరు భూములను సాగులోకి తీసుకురావడం మొదలైన విషయాల వివరణ ఉంది.

అధర్వణ వేదంలో నాగలి కర్ర, చెర్నాకోల వంటి వ్యవసాయ పనిముట్ల తయారీ, వాటి నిర్వహణ విధానం ఉంది. ఇదే వేదంలోని 12.1.1 సూక్తాల్లో సుమారు 63 మంత్రాలు వివిధ రంగుల నేలలు, దున్నిన నేలలు, నివాసయోగ్యమైన నేలలు మొదలైన వ్యవసాయ అనుబంధ విషయాల గురించి వివరించారు. ఈ మంత్రాలు భూమిని ఓషధులకు తల్లిగా, ఆహారాన్నిచ్చేదిగా, ప్రాణులందరికీ శక్తినిచ్చేదిగా వర్ణించాయి.

‘యునక్త సీరా వియుగా తనోతకృతే |

యోనౌ వపతేహ బీజం విరాజ: సృష్టి: సభరా

ఆసన్నో నేదీయ ఇత్‌ స్మృణ్య: పక్వయా యవన్‌...’ నాగళ్ళు కట్టండి. విత్తనాలు వెదజల్లండి. కంకులు బరువెక్కుగాక. కొడవళ్ళు పండిన యవలను కోసి మా సమీపానికి తీసుకువచ్చు గాక అంటూ నాగలి కట్టే సమయం నుంచి పంటను ఇంటి తీసుకువచ్చే వరకు జరిగే మొత్తం వ్యవసాయ ప్రక్రియను ఈ మంత్రం వర్ణిస్తుంది.. ఇది అధర్వ సంహితలో ఉంది.

కౌటిల్యుడి ‘అర్ధశాస్త్రం’, వరాహమిహిరుడి ‘బృహత్సంహిత’ ‘శతపథ బ్రాహ్మణం’, కాశ్యపుడు రాసిన ‘కృషి సూక్తి’, సురపాలుడి ‘వృక్షాయుర్వేదం’, చక్రపాణి రచించిన ‘విశ్వవల్లభం’ గ్రంథాల్లోనూ వ్యవసాయానికి సంబంధించిన వందలాది ప్రస్తావనలు ఉన్నాయి. కేవలం వ్యవసాయం మాత్రమే కాకుండా అందుకు అనుబంధమైన వివిధ వృత్తులు, ఆ వృత్తుల ద్వారా వ్యవసాయాన్ని నేర్పుగా ఎలా నిర్వహించాలో కూడా ఈ గ్రంథాల్లో ఉంది.

ఇవన్నీ ఒక ఎత్తయితే పరాశర మహర్షి రాసిన కృషి పరాశరం ఒక్కటీ ఒక ఎత్తు. వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఇదే తొలి పూర్తిస్థాయి గ్రంథమని పరిశోధకులు చెబుతారు. క్రీ.పూ.4వ శతాబ్ధంనాటి ఈ గ్రంథంలో చెప్పని వ్యవసాయ విధానం లేదు. ఈ గ్రంథం వెలుగు చూడటం వెనుక ఆసక్తి కరమైన పురాణగాథ ఉంది. ఓసారి విశ్వామిత్ర మహర్షి తన శిష్యులు, ఇతర మంది మార్బలంతో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. ముందస్తు సమాచారం లేకపోయినా అందరికీ క్షణకాలంలోనే కమ్మటి పిండివంటలతో భోజనం ఏర్పాటుచేస్తాడు వశిష్ఠుడు. ఇదెలా సాధ్యమైందంటూ విస్తుపోతాడు విశ్వామిత్రుడు. కామధేనువు వల్లే ఈ శక్తి వశిష్ఠుడికి వచ్చిందని తెలుసుకుని ఆ ధేనువును తనకు ఇవ్వాలని వశిష్ఠుని అడుగుతాడు. అతడు ఒప్పుకోడు. కొంతకాలం తర్వాత వశిష్ఠుడు ఇంట్లో లేని సమయం కనిపెట్టి అతని ఆశ్రమం మీద దాడి చేసి, వశిష్టుడి 100 మంది పుత్రుల్ని చంపేస్తాడు విశ్వామిత్రుడు. ఆ సమయంలో వశిష్టుడి కుమారుల్లో ఒకరి భార్య అయిన శక్తి గర్భవతిగా ఉంటుంది. కొంతకాలానికి ఆమెకు పరాశరుడు జన్మిస్తాడు. తన వంశాంకురమైన పరాశరుడికి వశిష్ఠుడు సకల విద్యలు పాటు వ్యవసాయ విజ్ఞానాన్ని కూడా బోధిస్తాడు. ఈ విజ్ఞానాన్ని అందరికీ చేరువ చెయ్యాలనే సంకల్పంతో పరాశరుడు దీన్ని గ్రంథస్తం చేస్తాడు. ఇదే కృషి పరాశర గ్రంథంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది.

- కప్పగంతు రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని