జయ జయ జయ జయహే

జగన్మాత రణన్నినాదం చేసింది...సర్వ దుర్లక్షణాలకు ప్రతీకైన మహిషాసురుణ్ణి మట్టుబెట్టింది.. ఆ సమయంలో విశ్వాంతరాళాల్లోకి వ్యాపించిన ఆమె రూపాన్ని దర్శించిన ఆది శంకరులు అమితానందాన్ని పొందారు.అయి గిరినందిని, నందిత మేదిని అంటూ పులకించిపోయారు.

Updated : 15 Oct 2020 02:23 IST

అసురమర్దిని.. అమృతవర్షిణి

ఈ నెల 17నుంచి దేవి శరన్నవరాత్రులు

జగన్మాత రణన్నినాదం చేసింది...
సర్వ దుర్లక్షణాలకు ప్రతీకైన మహిషాసురుణ్ణి మట్టుబెట్టింది.. ఆ సమయంలో విశ్వాంతరాళాల్లోకి వ్యాపించిన ఆమె రూపాన్ని దర్శించిన ఆది శంకరులు అమితానందాన్ని పొందారు.
అయి గిరినందిని, నందిత మేదిని అంటూ పులకించిపోయారు.
అయిజగదంబ కదంబ వనప్రియా అంటూ కీర్తించారు. మధుమధురే మధుకైటభభంజనీ అంటూ ప్రార్థించారు. అది మహిషాసుర మర్దిని స్తోత్రంగా అవతరించింది. అందులోని ప్రతి అక్షరం మంత్రంగా మారింది.
ప్రతి పదం, ప్రతి పాదం భక్తుల ఇహానికి, పరానికి బాటలు వేసింది. 
 
తొమ్మిదిరోజుల పాటు భీకరయుద్ధం చేసి రాక్షస సంహారం చేసిన జగనాత్మ స్వరూపమే మహిషాసురమర్దిని. ఆ తల్లి వైభవ విశేషాలను వివరిస్తూ సాగే నామాల సమాహారం మహిషాసురమర్దినీ స్తోత్రం. మొత్తం 21 శ్లోకాలతో ఆదిశంకరులు ఆమె లీలావైభవాన్ని మనోహరంగా వర్ణించారు. అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, శతకాలు ఎన్నో ఉన్నా ఈ స్తోత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. సరళమైన పదాలు, లలితమైన భావాలు, లోతైన అంతరార్థాలు ఇందులోఉన్నాయి.
మహిషాసురమర్దినీ స్తోత్రం శబ్దోపాసనకు ప్రతీక. ఓంకారం ఈ సృష్టిలో తొలి శబ్దం. దాన్నుంచి జరిగిన మహావిస్ఫోటన ఫలితమే సకల ప్రపంచం. ప్రణవోపాసన ద్వారా కైవల్యాన్ని చేరుకున్న మహనీయులెందరో ఉన్నారు. అటువంటి సాధకులకు మహిషాసురమర్దిని స్తోత్రం మేలు మార్గం చూపుతుంది. స్తోత్రంలోని శబ్దాల ఉచ్చారణ ద్వారా మనిషిలో ఉండే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలనే పంచకోశాలు ఉత్తేజితమవుతాయి. వాక్కు శుద్ధి అవుతుంది. అప్పుడా వాక్కుకు మహత్తరమైన శక్తి కలుగుతుంది. అంటే సరస్వతీ శక్తి సాధకుడి వశమవుతుంది.
హిషాసురమర్దినీ స్తోత్రం గొప్ప ఆలంకారిక శోభతో ఉంటుంది.  పద విన్యాసాలు, అనుప్రాసలు, శబ్దాలంకారాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒకే పదాన్ని విభిన్న అర్థాల్లో, విభిన్న పదాల్ని ఒకే అర్థంలో వాడుతూ స్తోత్రానికి సొగసైన నడక చేకూర్చారు శంకరులు. సందర్భాన్ని బట్టి శ్లోక పాదాల్ని పూర్తిగా సరళాక్షరాలతో రాయడంతో స్తోత్రం గంభీరతతో పాటు, కొత్త సొబగుల్ని  సంతరించుకుంది. ఈ స్తోత్రంలో జగన్మాత విశ్వరూప విలాసం దర్శనమవుతుంది. అమ్మవారి కాలిమువ్వల సవ్వడులు, భ్రమరాల ఝంకార ధ్వనులతో పాటు రణన్నినాదాలు కనిపిస్తాయి. అనంతమైన భక్తితో పాటు అద్భుతమైన ఆయుధ సంపత్తి దర్శనమిస్తుంది. ప్రతి వర్ణనా భక్తులను ఆనందడోలికల్లో ముంచెత్తుతుంది.
అయినిజ హుంకృతి మాత్రనిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే సమరవిశోషిత శోణిత బీజసముద్భవ శోణిత బీజరతే శివ శివ శుంభ నిశుంభ మహాహవతర్పిత భూతపిశాచరతే జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
కేవలం హుంకారంతో ధూమ్రాక్షుడు, విలోచనుడు వంటి రాక్షసులను అమ్మ నిర్జించింది. శుంభ నిశుంభులను రణరంగమధ్యంలో రక్తపుటేరులో ముంచెత్తింది. మహాసమరంలో రాలిపడే ప్రతి చెమటచుక్క నుంచి, ప్రతి రక్తపు బొట్టునుంచి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ మహాశక్తి ఎదిగిపోతూ ఉంది. జగదంబ విసిరిన అర్థచంద్రాకృతి ఉన్న బాణం దెబ్బకు దుర్ధరుడు విలవిల్లాడుతూ మరణించాడు. త్రినేత్రుడనే రాక్షసుడు గదతో అమ్మను అడ్డుకోబేతే త్రిశూలంతో అతణ్ణి సంహరించింది. అంధకాసురుణ్ణి ఆమె సింహమే మింగేసింది.
అమ్మ కదిలె...
అమ్మ సమర భూమికి కదలినప్పుడు ఆమె వెనుక దేవతలంతా చతురంగ బలాలుగా బారులు తీరిఉన్నారు. మెరిసే కత్తి, ఇత్తడిమొన కలిగిన బంగారు బాణాలతో కూడిన ధనుస్సును ధరించిందామె.  శత్రువుపై ఉరకడానికి సిద్ధపడుతున్న సమయంలో ఆమె దేహంతో పాటు యుద్ధ పరికరాలు, ధరించిన స్వర్ణాభరణాలు చిత్రంగా ఊగుతూ విశేష ప్రతిభ కలిగిన కళాకారిణి చేస్తున్న నాట్యవిన్యాసంలా కనిపిస్తున్నాయి.
జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే భణ భణ భింజిమి భింకృతనూపుర సింజితమోహిత భూతపతే నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే...
అసురుల్ని సంహరించే క్రమంలో జగన్మాత చేస్తున్న వీరవిహారానికి యావత్ప్రపంచం విస్తుపోతోంది. ఆ తల్లి విజయవిహారానికి జయజయధ్వానాలు పలుకుతోంది.  దేవతలు నాట్యం చేస్తున్నారు. సురకాంతలు తతథై తథై తతథై అంటూ నట్టువాంగం మొదలుపెట్టారు. హాసవిలాసాలతో దేవి చూపు ప్రసరించింది. నమస్కరిస్తున్న భక్తులందరినీ ఒకసారి ప్రేమగా వీక్షించిందామె. ధిమికిట ధిక్కిట ధిక్కిట ధిమి ధిమి అంటూ మృదంగనాదం ప్రారంభమైంది. జయజయ జయజగదంబ అంటూ జయధ్వానాలు మిన్నుముట్టాయి.  
అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్తవ్రృతే సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే...
పరాశక్తి ధరించిన కాలి మువ్వల నుంచి వస్తున్న సవ్వడితో పాటు విస్తరిస్తున్న కాంతి పుంజాలు బాలభానుడి కిరణాలను అధిగమిస్తున్నాయి. అమ్మవారి నేత్ర సౌందర్యం ముందు భ్రమరాలు చిన్నబోతున్నాయి. ఆ నేత్రాలు పద్మాలని భావిస్తున్న తుమ్మెదలు మకరందం గ్రహించాలని అటుగా వచ్చాయి. హేలా నృత్యవేళ అంబ వేగంగా పదం కదుపుతుంటే ఏ దిక్కున చూసినా చందమామ అప్పుడే ఉదయించినట్లు ఆమె ముఖబింబమే కనిపించింది. అన్ని దిక్కులా సుమనోహర కాంతిపుంజాలు దర్శనమిస్తుంటే జగత్తు పావనమవుతోంది.
‘కరమురళీరవవీజితకూజిత లజ్జితకోకిల మంజుమతే’...
అమ్మచేస్తున్న మురళీరవం ముందు కోకిలగానం చిన్నదైపోతోంది.

త్రిభువన పోషిణి శంకర తోషిణి కిల్బిష మోషిణి ఘోషరతే త్రిభువనాలను పోషించే శక్తి, శంకరుడి పాపాలను కూడా పొగొట్టగలిగిన సర్వోన్నత శక్తి కలిగిన పరాశక్తి... అంటూ అమ్మ వైభవాన్ని అనేకవిధాలుగా వర్ణిస్తూ సాగుతుందీ అద్భుత స్తోత్రం.
మహిషాసుర మర్దిని స్తోత్రంలో ప్రతి నామం ఓ తారక మంత్రం. ప్రతి పదం ఓ బీజాక్షరం. అ కారం నుంచి క్ష కారం వరకు ఉన్న అన్ని వర్ణాలు అమ్మ స్వరూపమేనని శాస్త్ర వచనం. అలాంటి బీజాక్షరాల మేలు కలయిక ఈ స్తోత్రానికి మహత్తరమైన శక్తి తీసుకువచ్చింది.

- కప్పగంతు రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని