కొండపై నిండుగా కొలువున్న మాతల్లి!

వందల ఏళ్లనాటి సంగతి... ఇప్పుడున్న విజయవాడ... అప్పటి విజయవాటిక. ఇంద్రకీలాద్రిపై జగన్మాత సన్నిధి వామాచారానికి నిలయంగా ఉండేది. జంతు బలులు విచ్చలవిడిగా జరిగేవి. అప్పుడొచ్చాడా మహానుభావుడు. అమ్మను ప్రసన్నం చేసుకుని ఈ క్షేత్రాన్ని సుసంపన్నం చేశాడు...

Updated : 22 Oct 2020 01:09 IST

ఈ నెల 25 దసరా

వందల ఏళ్లనాటి సంగతి... ఇప్పుడున్న విజయవాడ... అప్పటి విజయవాటిక. ఇంద్రకీలాద్రిపై జగన్మాత సన్నిధి వామాచారానికి నిలయంగా ఉండేది. జంతు బలులు విచ్చలవిడిగా జరిగేవి. అప్పుడొచ్చాడా మహానుభావుడు. అమ్మను ప్రసన్నం చేసుకుని ఈ క్షేత్రాన్ని సుసంపన్నం చేశాడు...

క్కడున్నవాళ్లంతా నిశ్చేష్టులై చూస్తున్నారు.
కాంతిగోళం భూమిపై దిగిందా అన్నట్టు ఉన్నారాయన..
ముట్టుకుంటే చాలు కందిపోతారేమోనన్నంత సున్నితత్వం
నేలపై రాలిన పూలు ఆయన కాలికి అంటుకుని తరించాలని ఆరాటపడుతున్నాయి.
కాషాయ దుస్తులతో, ప్రశాంత వదనంతో ఆయన నడుస్తుంటే దైవత్వం తొణికిసలాడుతోందక్కడ.
అదిగో... ఆయనే వేదాంత భేరి మోగించింది. ఆ స్వామే సనాతన ధర్మాన్ని కొత్తపుంతలు తొక్కించింది.
ఆయన ఆదిశంకరులు...అఖండ భారతాన్ని చుట్టి, పూరీ క్షేత్ర మహిమను వెయ్యింతలు చేసి ఇప్పుడు విజయవాటిక చేరుకున్నాడు.
ఆయన పాదాలు కడగాలనేమో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది...
ఇంద్రకీలాద్రి పాదభాగం...
తెలతెలవారుతున్న ఆవేళ.. పచ్చటి పర్వతాగ్రంపై నుంచి చల్లటిగాలి వీస్తోంది. నిండా మారేడు చెట్లు. సంపెంగ మొగ్గలు, దిరిసెన పువ్వులు, కొండగోగు పూల చెట్లు... ఎంత అందమైన ప్రకృతి.
అనుష్ఠాన విధులన్నీ పూర్తి చేసుకుని ధ్యానానికి ఉపక్రమించారు జగద్గురువులు.
మనోవీధిలో ఏదో తెలియని ఆనందం. దివ్య కాంతి పరివేషం ఆయన్ను చుట్టుముడుతోంది.
తాదాత్మ్యభావనలు ఆయన అంతరంగాన్ని కమ్ముకున్నాయి.  

దశవక్త్రా దశభుజా దశపాదాంజనప్రభా!
విశాలయా రాజమానా త్రింశల్లోచనమాలయా!!

...ఆయన జగన్మాతను స్తుతిస్తున్నారు.  
ఆయనకు తెలుస్తోంది. అది మామూలు పర్వతం కాదు. అది సాధారణ స్థలం కాదు. కన్నుల వెంట ఆనందాశ్రువులు రాలుతుండగా

దుర్గమాసుర హంత్రీ దుర్గమాయుధ ధారిణీ ।
దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ ।।

అంటూ అమ్మ నామాన్ని స్తోత్రం చేస్తూ ఆనందపారవశ్యంలో మునిగిపోతున్నారు.
అక్కడి నుంచే తలపైకెత్తి ఇంద్రకీల పర్వతశిఖరానికి చేతులెత్తి నమస్కరించారు.
ఉషోదయ వేళ ప్రభాత కిరణాలు నేరుగా పడుతుండటంతో మరింతగా వెలిగిపోతోందా పర్వతశ్రేణి.
శంకరులు పర్వతాన్ని అధిరోహించడం ప్రారంభించారు. ఆయన వెనకే శిష్యులు కూడా ......
ఇంతలో కొంతమంది జానపదుల గుంపు కూడా అటుగా వచ్చింది. డప్పువాద్యాల ఘోషతో సందడి చేస్తున్నారు.
అమ్మోరు తల్లీ! కాపాడమ్మా! అంటూ మొక్కారు. అంతే... ఒక్కవేటుకు జంతువుల తలలు తెగిపడ్డాయి. బలి కార్యక్రమం పూర్తయింది.
మళ్లీ అమ్మకు మొక్కుతూ వెళ్లిపోయిందా బృందం.

అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ,
చాల బెద్దమ్మ, సురారులమ్మ
కడుపారడి వుచ్చినయమ్మ, దన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత
మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్‌

-బమ్మెర పోతన
 

శంకరుల మనస్సులో ఒక్కసారిగా విచారం... జంతుబలి జరిగిన ప్రాంతాన్ని చేరుకున్నారు. జగన్మాత విగ్రహం మహోగ్రరూపంలో దర్శనమిచ్చింది. శంకరులు సాగిలపడ్డారు. అమ్మా! లోకంలోని ప్రాణులన్నీ నీ బిడ్డలే కదా. ఎందుకీ హింస. చంద్రరేఖల్ని పోలిన నీ దరహాసం, శరజ్జోత్స్నలు కురిసే నీ వదనం, కమాలలనుకుని భ్రమరాలు కూడా భ్రమించే నీ నేత్రద్వయం, సూర్యచంద్రుల వెలుగుల్ని పంచే నీ వైభవం, దయాసాగరానికి నెలవైన నీ హృదయ మందిరం మాకు ప్రసాదించమ్మా... అంటూ ప్రార్థించారు.
అమ్మ ఆజ్ఞ అయ్యిందేమో... వెంటనే శిష్యబృందాన్ని ఆదేశించారు.
సమంత్రకంగా శ్రీవిద్యాపద్ధతిలో శ్రీచక్రాన్ని అమ్మ సమీపంలో ప్రతిష్ఠించారు. షోడశ కళాన్యాసం నిర్వహించారు. పవిత్ర కృష్ణానదీ జలాలతో అమ్మకు అభిషేకం నిర్వహించారు. ఖడ్గమాల, త్రిశతీ విధానాలతో అమ్మకు అర్చనలు చేశారు.
ఆది శంకరుల వంటి బిడ్డ పిలిస్తే అమ్మ రాకుండా ఉంటుందా. పరిపూర్ణమైన మాతృమూర్తి ఆమె. పరమశాంత స్వరూపిణిగా శాశ్వతంగా ఇంద్రకీల పర్వతం మీద కొలువై ఉండాలన్న తన భక్తుడి ప్రార్థనను మన్నించింది. అప్పటిదాకా ప్రకటించిన మహోగ్రరూపాన్ని విడిచిపెట్టి దయాస్వరూపిణిగా, కనకదుర్గగా దర్శనమిచ్చింది.
దుర్గే దేవీ నమోస్తుతే! అంటూ శంకరులు అనేకవిధాలుగా అమ్మను స్తుతించారు. ఇంద్రకీల పర్వతం మీద జంతుబలలు జరగకూడదని, తాంత్రిక పద్ధతుల్లో అమ్మను అర్చించకూడదని నియమం విధించారు. సనాతన వైదిక పద్ధతుల్లో అమ్మను త్రికాలాల్లో ఎలా అర్చించాలో నిర్దేశించారు.
అప్పటి దాకా ఉన్న ఇంద్రకీలాద్రి  వేరు. క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దంలో శంకరుల పాదధూళి సోకిన తర్వాత వేరు. ఆయన సందర్శన తర్వాత అదో మహోన్నత క్షేత్రంగా మారింది. పరమ శాంతమూర్తిగా, అమ్మలగన్నయమ్మగా,  కనకదుర్గగా భక్తకోటి నీరాజనాలందుకోవడం మొదలైంది.

* ప్రధాన ఆలయంలో అమ్మవారు అసురుణ్ణి సంహరిస్తున్న భంగిమలో కనిపిస్తారు. కనకదుర్గాదేవిమూర్తి ఇంద్రకీలాద్రి మీదనే మరొక చోట అవ్యక్త రూపంలో ఉందని, మహర్షులు, సిద్ధులు, యోగులు, కిన్నరులు నిత్యం ఆ దేవిని దర్శించి ఆరాధనలు చేస్తారని, ఈమెను చింతామణి దుర్గ అంటారని వివరిస్తారు.


* ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గాదేవి మూర్తిలో ఓ ప్రత్యేక లక్షణం కనిపిస్తుంది. అమ్మవారి చూపు ఈశాన్య దిక్కుకు తిరిగి ఉంటుంది. ఇది అత్యంత శుభసూచకం, భక్తుల ప్రార్థనలను అమ్మ ఆలకిస్తుందనడానికి ఇదే నిదర్శనం.


* దుర్గాదేవి ఇంద్రకీల పర్వతం మీద బంగారు వర్ణంతో అత్యద్భుతంగా ప్రకాశిస్తుంటుంది. అందుకే ఈ పర్వతానికి కనకాచలమనే పేరు కూడా ఏర్పడింది. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఈ పర్వతం మీద శత అశ్వమేథ యాగం చేశాడని స్థలపురాణం చెబుతోంది.

- కప్పగంతు రామకృష్ణ, ఐ.ఎల్‌ఎన్‌.చంద్రశేఖరరావు, యల్లాప్రగడ మల్లికార్జునరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని