తమసోమా జ్యోతిర్గమయ!

దీపావళి అంటే దీపాల వరుస. ప్రపంచాన్ని జ్ఞాన జ్యోతులతో వెలిగించలన్నది దీని అంతరార్థం. రాత్రిపూట ఆకాశంలోని తారలు మనకు ఎలా చిన్న దీపాల్లా కనిపిస్తాయో, వినువీధుల్లో నుంచి చూస్తే భూమిపై ఉండే జ్యోతులు కూడా ఆకాశంలోని చుక్కల్లా కనిపిస్తాయి. ఇందులో వైజ్ఞానిక సత్యంతో పాటు ఓ ఆధ్యాత్మిక సందేశం ఉంది. విశ్వంలో ఉంది మనలో, మనలో ఉంది విశ్వంలో ఉందని ఈ దివ్వెలు చాటుతాయి....

Published : 12 Nov 2020 01:07 IST

ఈనెల 14 దీపావళి

మనం చేసుకునే ప్రతి పండగలోని పరమార్థం మన దేహంతో, అందులోని ఆత్మతోముడిపడి ఉంది. నిజానికి ప్రతి పర్వదినం ఓ యజ్ఞం.. ఓ ఆత్మ విజ్ఞానం. దీన్ని తెలుసుకుని ఆ పండగ చేసుకుంటే అది సంపూర్ణమైన ఫలితాన్నిస్తుంది. దీపావళి పండగలో కూడా ఎన్నో భౌతిక, ఆధ్యాత్మిక  పరమార్థాలున్నాయి...

దీపావళి అంటే దీపాల వరుస. ప్రపంచాన్ని జ్ఞాన జ్యోతులతో వెలిగించలన్నది దీని అంతరార్థం. రాత్రిపూట ఆకాశంలోని తారలు మనకు ఎలా చిన్న దీపాల్లా కనిపిస్తాయో, వినువీధుల్లో నుంచి చూస్తే భూమిపై ఉండే జ్యోతులు కూడా ఆకాశంలోని చుక్కల్లా కనిపిస్తాయి. ఇందులో వైజ్ఞానిక సత్యంతో పాటు ఓ ఆధ్యాత్మిక సందేశం ఉంది. విశ్వంలో ఉంది మనలో, మనలో ఉంది విశ్వంలో ఉందని ఈ దివ్వెలు చాటుతాయి. దీన్నే అండంలో పిండం, పిండంలో అండం అన్నారు వేదాంతులు. ఉపనిషత్తులు ‘పద్మకోశప్రతీకాశం’ అని అన్నాయి. శంకరభాష్యంలో దీనికి వివరణ ఉంది... ప్రతి జీవి గుండెలోనూ ఓ దీపం తలకిందులుగా వేలాడే తామర మొగ్గలా ఉంటుంది. అలాంటి దీపాలే ఈ మొగ్గలోని ప్రతి రేకులో ఒకటి వంతున సూక్ష్మరూపంలో ఉన్నాయి పద్మం మధ్యభాగంలో మూల దీపం ఉంది. ‘తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్థ్వా వ్యవస్థితా’ అని వేదాలు చెబుతున్నాయి. ఈ దీపం దేహానికి అవసరమైన వేడిని, రక్తానికి సారాన్ని ఇస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తోంది. అదే మన జీవన దీపం.


నరకుడెవరు?

న పురాణాల ప్రకారం నరకాసుర వధ జరిగిన రోజున దీపావళి అని చెబుతారు. హిరణ్యాక్షుడి బారి నుంచి భూమిని రక్షించడానికి విష్ణువు వరాహవాతారంలో వచ్చినప్పుడు పుట్టినవాడు నరకాసురుడు. అతను సత్య, త్రేత, ద్వాపర అనే మూడు యుగాల్లోనూ ఉన్నట్లు చెబుతారు. మరి ఇంత కాలం అతనెందుకు ఉన్నాడు.. అతన్ని చంపడం కోసం కృష్ణుడెందుకు వేచి ఉండాల్సివచ్చిందనే దానికి సమాధానం కాల మహిమ అని చెబుతారు. కర్మ పక్వానికి వస్తేనే ఏదీ జరగదనేది శాస్త్రవచనం. కాల పురుష కుండలిలో తులను అస్తమయరాశి అంటారు. అస్తమయంలో చీకటిది పై చేయి. ఆ చీకటికి తమోగుణంతో నిండిన నరకుడు ప్రతీక. అస్తమయం తర్వాత ఉదయం వస్తుంది. కొత్త వెలుగులతో రోజు ప్రారంభమవుతుంది. నరకవధ ఈ విషయాన్ని చాటుతుంది.


మరి మనలో ఆ జ్ఞాన దీపాలు వెలిగించుకునేదెలా?గుండెల్లో దీపావళి ఎప్పుడు?
దీనికి సమాధానం ఆదిశంకరులు చెప్పారు. భగవద్గీత దశమాధ్యాయం పదకొండో శ్లోకాన్ని ఆయన ఉదహరిస్తూ ఈ విషయాలను వివరించారు.

‘తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతః

సర్వేశ్వరుడు తనను ప్రార్థించే ప్రతి భక్తుడి మదిలో జ్ఞానదీపం వెలిగించి, అజ్ఞానపు చీకట్లను పోగొడతాడని దీని భావం.
దీపం పెట్టాలంటే వత్తి, చమురు, ప్రమిద, ఆరిపోకుండా ఓ పారదర్శక రక్షణ కవచం అవసరం. అలాగే మనలో జ్ఞానజ్యోతి వెలగాలంటే చమురు మన భక్తి. అది జ్వలించడానికి అవసరమైన వాయువు భగవంతుడి కోసం మనం పడే తపన. ఆశ, ద్వేషాలనే పొగ, మసి మనస్సుకు పట్టకుండా చేసే రక్షణ కవచం మన ఏకాగ్రత. బ్రహ్మచర్యం, వైరాగ్యం, ఆత్మ సంయమనం, సాధారణ జీవనం అనేవి దీపంలో వేసే వత్తులు. ఈ ఉపకరణాల సాయంతో వచ్చే వెలుగులో మనస్సు స్థిరమైన ధ్యానంలో కుదురుకుంటుంది. అనంతానందదాన్ని పొందుతుంది. అలా జ్ఞాన జ్యోతులను ప్రజ్వలింపజేయడమే దీపావళి.

నరక చతుర్దశి రోజు పితృలోకాల్లోని పెద్దల్ని తలుచుకుని వారి పేరిట ఒక్కో దీపాన్ని వెలిగించి వారిని స్వర్గానికి తీసుకెళ్లమని ప్రార్థిస్తారు. ఆ వెలుగులే వారి పరమ పథానికి దారి దీపాలవుతాయని చెబుతారు.

ఇప్పటికీ పల్లెల్లో జొన్న చొప్పను, నువ్వుల కట్టెను కాల్చి జనాన్ని మధ్యలో నిలబెట్టి వారి చుట్టూ తిప్పుతారు. ఇందులో ఓ అగ్ని సంస్కారం ఉంది. వర్షాకాలంలో వచ్చే అనేక సూక్ష్మక్రిముల నిర్మూలనం దీనివల్ల జరుగుతుందని నమ్ముతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని