ఉత్తుంగ తరంగ!

భాగీరాధ్యాం వర్షమేకం  ప్రాతస్నానేన యత్ఫలం, తుంగభద్ర జలం స్పృశ్యాలభేత్‌ మకరగతేగురౌఏడాది పాటు రోజూ గంగా నదిలో స్నానం చేసిన ఫలితం, పుష్కర దినాల్లో తుంగభద్ర నదీ జలాన్ని తాకినంతనే లభిస్తుంది.పశ్చిమ కనుమల నుంచి జాలువారే ఓ రెండు ప్రవాహాలు ఏకమై.. జన జీవనంతో మమేకమై తాను నడిచిన నేలంతా పచ్చదనాన్ని అద్దుతూ పవిత్రతను దిద్దుతూ పరుగులు

Published : 19 Nov 2020 00:41 IST

ఈ నెల 20న తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

భాగీరాధ్యాం వర్షమేకం  ప్రాతస్నానేన యత్ఫలం, తుంగభద్ర జలం స్పృశ్యాలభేత్‌ మకరగతేగురౌ
ఏడాది పాటు రోజూ గంగా నదిలో స్నానం చేసిన ఫలితం, పుష్కర దినాల్లో తుంగభద్ర నదీ జలాన్ని తాకినంతనే లభిస్తుంది.
పశ్చిమ కనుమల నుంచి జాలువారే ఓ రెండు ప్రవాహాలు ఏకమై.. జన జీవనంతో మమేకమై తాను నడిచిన నేలంతా పచ్చదనాన్ని అద్దుతూ పవిత్రతను దిద్దుతూ పరుగులు తీసింది. శృంగేరీ శారదాదేవి  వైభవాన్ని... హంపి విరూపాక్షుడి రాజసాన్ని... మంత్రాలయ రాఘవేంద్రుడి మహిమల్నీ... చూస్తూ.. తరిస్తూ... తరింపజేస్తూ ముందుకు సాగే జీవనవాహిని  తుంగభద్ర... అది నది కాదు... ఓ భక్త్తి నిధి.
‘మకరే తుంగభద్రా చ’...
బృహస్పతి మకర రాశిలో ప్రవేశించిన శుభ తరుణం..  తుంగభద్రా నది పుష్కరోత్సవం ప్రారంభం

సనాతన సంప్రదాయం తుంగభద్రను పంచ గంగలలో ఒకటని చెప్పింది. గంగ, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి నదులను పంచగంగలని పిలుస్తారు. వీటిలో తుంగభద్రకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి.  వాస్తవానికి ఇది ఒక నది కాదు. తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక. తుంగభద్ర నది పుట్టుకలోనే ఓ విశిష్టత ఉంది. దాని ఆవిర్భావం వెనక ఓ దైవ సంకల్పం ఉంది. లోక రక్షణ విధి ఉంది. ఈ నది అణువణువూ ఓ భక్తనిధిని తలపిస్తుంది.  
శ్రీ మహావిష్ణువు లోకాలను రక్షించడం కోసం వరాహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుడిని సంహరించే సమయంలో ఆ స్వామి ముఖంపై చెమట పట్టింది. ఓ చెమట బిందువు స్వామి కుడి కోర నుంచి కిందికి జారి తుంగ అనే నదిగా మారింది. సంస్కృతంలో తుంగ అంటే ఎత్తయింది అని అర్థం. మరో చెమట బిందువు స్వామి ఎడమ కోరపై నుంచి పడి భద్ర నదిగా మారింది. భద్ర అంటే క్షేమం, నిశ్చలం అనే అర్థాలున్నాయి.
పశ్చిమ కనుమల్లో వరాహ పర్వత పంక్తిని ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. ఆ పర్వత సానువుల్లో గంగామూలం అనే చోటు తుంగా నది జన్మస్థానం. ఈ పరిసరాల్లోనే భద్రానది కూడా పుట్టింది. గంగామూలంలో పుట్టిన తుంగా నది వాయువ్య దిశగా పరుగులు తీస్తూ తీర్థహళ్లి అనే ప్రదేశానికి చేరుతుంది. ఈ స్థలం అనేక తీర్థాల నిలయం. తీర్థహళ్లి దాటిన తర్వాత తుంగ శృంగేరిని తాకుతుంది. జగద్గురువు ఆది శంకరులు స్థాపించిన నాలుగు పీఠాల్లో ఒకటి ఇది. మరోవైపు భద్రానది కూడా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పరుగులు తీస్తూ కూడ్లీ అనే ప్రాంతానికి చేరి పైనుంచి ఇటుగా వస్తున్న తుంగా నదిలో కలిసి తుంగభద్రగా మారుతుంది. అక్కడి నుంచి ఈశాన్య దిశగా ముందుకు సాగుతూ కొంతదూరం వెళ్లేక ఉత్తరంగా ప్రవహిస్తుంది. కుముద్వతి అనే నదిని తనలో కలుపుకుని హరిహరపట్నం చేరుతుంది. ఆ తర్వాత గురునాథ దగ్గర వరదా నదిని తనలో విలీనం చేసుకుంటుంది. అక్కడి నుంచి హంపీ విజయనగరం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ ముందుకు సాగుతుంది. రామాయణ కాలంలో పంపా సరోవరం ఇదేనని చెబుతారు. హంపి విజయనగరం దాటాక ఆంధ్రదేశంలో రాఘవేంద్రస్వామి కొలువైన మంత్రాలయంలోకి అడుగిడుతుంది. అక్కడి నుంచి ముందుకు సాగి సంగమేశ్వరం దగ్గర కృష్ణా నదిలో విలీనమవుతుంది. పుట్టిన దగ్గర నుంచి కృష్ణా నదిలో కలిసేంత వరకు తుంగభద్రా నదీ తీరమంతా పరమ పవిత్ర స్థలంగా భాసిల్లుతోంది.


ఎవరీ పుష్కరుడు?

పుష్కరుడి అసలు పేరు తుంబిలుడు. లోక కల్యాణ సంకల్పంతో ఆయన చేసిన తపస్సుకు సంతోషించి శివుడు తన అష్ట మూర్తుల్లో ఒకటైన జల మూర్తిలో అతనికి స్థానం కల్పించాడు. అప్పటి నుంచి తుంబిలుడికి పుష్కరుడు అనే పేరొచ్చింది. మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు ఆధిపత్యాన్ని కూడా పుష్కరుడికే కట్టబెట్టాడు పరమేశ్వరుడు. పుష్కరాలకు కారణంగా చెప్పే కథ ఒకటి మనకు పురాణాల్లో కనిపిస్తుంది. బ్రహ్మ కమండలంలో స్థానం పొందిన పుష్కరుడిని ప్రాణుల రక్షణ కోసం  తనకు ఇవ్వమని బృహస్పతి కోరాడు. దానికి పుష్కరుడు సమ్మతించలేదు. దీంతో బ్రహ్మ ఒక ఏర్పాటుచేశాడు. దాని ప్రకారం గ్రహ స్థితిలోని బృహస్పతి మేషం నుంచి మీనం వరకు ఉండే పన్నెండు రాశుల్లో ప్రవేశించే తొలి పన్నెండు రోజులు, చివరి పన్నెండు రోజులు పుష్కరుడు గురువుతో కలిసి ఉండాలి. అలా గురువుతో పుష్కరుడు కలిసి ఉండే తొలి పన్నెండు రోజులు ఆది పుష్కరాలు అంటారు. చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలు అంటారు. పుష్కర సమయంలో ముక్కోటి దేవతలు, మునులు, రుషి గణాలు అంతా పుష్కరాలొచ్చిన నదిలో ఉంటారు.


అడుగడుగున అద్భుత క్షేత్రాలు...

శృంగేరి

తుంగ-భద్ర నదుల సంగమ ప్రాంతానికి చేరువలో.. తుంగా తీరంలో వెలసిన మహోన్నత ఆధ్యాత్మిక కేంద్రం శృంగేరి.  కర్ణాటకలో ఉందీ క్షేత్రం.ఎనిమిదో శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరులు ఇక్కడ తుంగా నదీ తీరంలో శారదా పీఠాన్ని నెలకొల్పారు. గంగమూలం దగ్గర జన్మించిన తుంగ పడమటి కనుమల్ని తాకుతూ ఈ క్షేత్రం మీదుగా ముందుకెళ్తుంది. కర్ణాటకతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనే శృంగేరి పీఠానికి ప్రత్యేకత ఉంది. మఠంలో నిత్యం అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది. శృంగేరి క్షేత్రం ఆధ్యాత్మికతకే కాదు అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయం. శారదా పీఠాన్ని దర్శించుకోవడానికి నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.


హరిహర

కర్ణాటకలోని బేలూరును రాజధానిగా చేసుకుని పాలించిన హొయసళ రాజులు హరిహరలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. 1223లో హొయసళ రాజుల వద్ద సేనానిగా పనిచేసిన పోలల్వ హరిహర ఈ ఆలయ నిర్మాణం వెనుక ప్రధాన భూమిక పోషించినట్లు చెబుతారు. శివకేశవులు ఒక్కటే అని చాటుతుందీ క్షేత్రం. శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడి మూల విరాట్టు కుడివైపు విష్ణువు, ఎడమ వైపు శివుడి రూపాల్లో దర్శనమిస్తారు. గుహాసురుడనే రాక్షసుడిని సంహరించేందుకు శివకేశవులు ఒకే రూపాన్ని దాల్చారని.. అసురుణ్ణి తుంగ, భద్ర కూడలి వద్ద సంహరించారని చెబుతారు.


హంపీ

భారతీయ చరిత్రలో స్వర్ణ యుగానికి కారణమైన విజయనగర రాజుల రాజధాని నగరం హంపీ. ఈ క్షేత్రాధిపతి విరూపాక్షుడు. విజయనగర ప్రజల ఇలవేల్పు ఆయన. తుంగభధ్ర తీరంలోని ప్రధాన ఆలయాల్లో విరూపాక్షేశ్వరానిది ప్రముఖ స్థానం. హనుమంతుడు జన్మించినట్లుగా చెప్పే అంజనాద్రి కూడా ఇక్కడే ఉంది. రామాయణ కాలం నాటి కిష్కింధ ఈ ప్రాంతమేనని చెబుతారు. విరూపాక్షుడికి నిత్య పూజలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో రథోత్సవాల్ని నిర్వహిస్తుంటారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించడంతో హంపీ అంతర్జాతీయంగా కూడా పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంటుంది. విరూపాక్ష ఆలయంలో గోపురం నీడ ఆలయం లోపల గవాక్షంలో తలకిందులుగా కనిపించడం అప్పటి వాస్తు ఘనతకు నిదర్శనం.


మంత్రాలయం

పార్వతీ దేవి మంచాలమ్మగా వెలసిన మంచాల క్షేత్రమే తర్వాత మంత్రాలయంగా పేరొందిందని చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదీ తీరంలో ఈ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ఉంది.  మధ్వ గురు పరంపరలోని రాఘవేంద్ర తీర్థులు సశరీరంగా బృందావన ప్రవేశం చేసిన పుణ్యస్థలి ఇది. బ్రహ్మదేవునికి పరిచారకుడిగా ఉండే శంఖుకర్ణుడే కృతయుగంలో విష్ణు భక్తుడైన ప్రహ్లాదునిగా, ద్వాపరయుగంలో బాహ్లికునిగా, కలియుగంలో వ్యాస రాయలుగా అవతరించినట్లు....ఆ వ్యాసరాయులే తరువాతి జన్మలో రాఘవేంద్రులుగా వచ్చారంటారు. ఏటా  ఆగస్టులో స్వామి ఆరాధానోత్సవాలు వైభవంగా జరుగుతాయి. మల్లప్ప సింధి అనే భక్తుడు ప్రాంగణాలు, మండపాలు నిర్మించారు.


సంగమేశ్వరం

దేశంలోని ప్రాచీన క్షేత్రాల్లో కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం ఒకటి. ఇక్కడ ధర్మరాజు ప్రతిష్టించిన నింబలింగం ఉంది. వేప చెక్కతో చేసిన శివలింగం మరెక్కడా కనిపించదు. కృష్ణ, వేణి, మాలపహారి, భీమరది, తుంగభద్ర, భవనాశి అనే ఏడు పుణ్య నదుల కలయిక ఈ క్షేత్రంలో జరుగుతుంది. శ్రీశైలం వెనక జలాల్లో ఉండే ఈ ఆలయం ఏడాదిలో నాలుగు నెలలు భక్తులకు దర్శనానికి అందుబాటులో ఉంటుంది. కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలంలోని నల్లమల అరణ్య ప్రాంతంలో కపిలేశ్వరం సమీపంలో ఉందీక్షేత్రం. ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక సరస్వతి ఆలయం కొలను భారతి ఇక్కడికి సమీపంలోనే ఉంది.


అలంపురం

తుంగభద్ర నదీ తీరంలోని ఈ విశిష్ఠ క్షేత్రాన్ని దక్షిణ కాశిగా, పరశురామ, భాస్కర క్షేత్రంగా చెబుతారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని ఈ పుణ్యస్థలిని శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భావిస్తారు. నాగర-ద్రావిడ వాస్తు సమ్మేళనంతో నిర్మించిన ఈ ఆలయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడి నవ బ్రహ్మాలయాలు ప్రసిద్ధమైనవి. చాళుక్యుల కాలంలో నిర్మించిన తొమ్మిది శివాలయాలే నవ బ్రహ్మ ఆలయాలుగా పిలవబడుతున్నాయి. బ్రహ్మదేవుడు ఈ క్షేత్రంలో తపస్సు చేసి ప్రతిష్టించిన శివలింగమే బ్రహ్మేశ్వరలింగమని స్థల పురాణం చెబుతోంది. జోగుళాంబ దేవి క్షేత్రాధిదేవత.

-యడ్లపాటి బసవ సురేంద్ర, చౌండ్రాజు జగన్మోహన్‌, యల్లాప్రగడ మల్లికార్జునరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని