పురుషోత్తముడికి పుష్పాభిషేకం!

శరదృతువు... తెల్లటి ఆకాశం... చల్లటి వెన్నెల... కొమ్మలన్నీ పూలతో గుబాళిస్తాయి.   ఆ పూలన్నీ శ్రీనివాసుని పాదారవిందాలను చేరి తరించాలని ఆరాటపడతాయి. అందుకే ఆ స్వామికి ఎన్నో పూలసేవలు, పుష్పయాగాలు... ఏ పూలు?: తులసి, చామంతి, జాజి, మల్లె, గన్నేరు, తామర, కలువ, గులాబీ, సంపంగి, కనకాంబరం, మొగలి,దవనం,

Published : 03 Dec 2020 01:05 IST

శరదృతువు... తెల్లటి ఆకాశం... చల్లటి వెన్నెల... కొమ్మలన్నీ పూలతో గుబాళిస్తాయి.   ఆ పూలన్నీ శ్రీనివాసుని పాదారవిందాలను చేరి తరించాలని ఆరాటపడతాయి. అందుకే ఆ స్వామికి ఎన్నో పూలసేవలు, పుష్పయాగాలు...
ఏ పూలు?: తులసి, చామంతి, జాజి, మల్లె, గన్నేరు, తామర, కలువ, గులాబీ, సంపంగి, కనకాంబరం, మొగలి,దవనం, మరువం, బిల్వం, తులసి తమలపాకులు,పచ్చి పసుపు చెట్లు  వంటి పుష్పాలు పత్రాలను స్వామివారి అలంకారానికి తయారు చేసే మాలలకు ఉపయోగిస్తారు.

-ఐ.ఎల్‌.ఎన్‌. చంద్రశేఖరరావు 

‘అలంకార ప్రియో విష్ణుః’ అని శాస్త్రవచనం.
శ్రీ వేంకటేశ్వరుడు అలంకార ప్రియుడు. శ్రీనివాసునికి ఆభరణాలు అన్నా, పుష్పాలంకరణ అన్నా ఎంతో ప్రీతి. స్వామివారి ఆపాదమస్తకం పూలమాలలే దర్శనమిస్తాయి. నిజానికి తిరుమల క్షేత్రమే ఓ పుష్పవనం.పూలంగిసేవతో పాటు సంవత్సరంలో కొన్ని ప్రత్యేక ఉత్సవాల సందర్భంలో పుష్పాలను ఉపయోగించే మరికొన్ని సేవలను కూడా స్వామివారికి చేస్తారు.

తోమాల సేవ

తిరుమల వేంకటేశ్వర స్వామికి పుష్పాలను అలంకరించే సేవే తోమాలసేవ. ఈ సేవ స్వామివారికి రోజూ రెండుసార్లు జరుగుతుంది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు,  తిరిగి సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుంది. వేంకటేశ్వర స్వామి మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తులు, ఆలయ ప్రాంగణంలోని ఇతర మూర్తులకు పూలమాలలను అలంకరిస్తారు. తోమాల అనేది తోళ్‌ మాల అనే తమిళ పదం నుంచి వచ్చింది. తోళ్‌ అంటే భుజం అని అర్థం. స్వామివారి భుజాల మీదుగా వేలాడేటట్లుగా పుష్పాలంకరణలు చేసే సేవ కనుక దీనికి తోమాల సేవ అని పేరు. స్వామివారి పాదాలతో ప్రారంభించి మూలమూర్తికి మొత్తం ఆయా స్థానాల్లో ఆగమోక్తంగా పుష్పమాలలు సమర్పిస్తారు.

పుష్ప పల్లకి

ఏటా దక్షిణాయనం ప్రారంభంలో ఆణివార ఆస్థానం జరుగుతుంది. ఆనాటి సాయంత్రం పూల పల్లకిలో స్వామివారిని తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. పుష్ప ప్రియుడైన స్వామివారు మనోహర సుందర వదనంతో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే చాంద్రమానం ప్రకారం అధిక మాసం వచ్చిన ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రెండోసారి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు సాయంత్రం స్వామివారు పుష్పపల్లకిలో ఊరేగుతారు.

పూలంగి సేవ

స్వామివారికి నిత్యం రెండు పూటలా తోమాలసేవ జరిగినా గురువారం నాడు స్వామివారికి ప్రత్యేకంగా పూలంగిసేవ జరుగుతుంది. ‘అంగీ’ అంటే శరీరంపైన ధరించే వస్త్రం. స్వామివారికి అంగీలా పూలమాలలను ధరింపచేసే సేవ కాబట్టి దీనికి పూలంగిసేవ అని పేరు. ఈ సేవ వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. ప్రతి గురువారం స్వామివారి నేత్ర దర్శనం ఉంటుంది. తిరునామం తగ్గించి నేత్రాలు కనిపించేలా స్వామివారిని అలంకరిస్తారు. గురువారంనాడు ఈ విధంగా నేత్రాలను తెరిచి సూర్యకటారి అనే ఖడ్గాన్ని ధరించి స్వామి రౌద్రంగా వుంటాడని, ఆ రౌద్రాన్ని తగ్గించడం కోసమే పూలంగిసేవ ఏర్పాటైందని చెబుతారు. ఈ సేవను వ్యాసరాయలవారు ప్రవేశపెట్టినట్టు ప్రచారంలో ఉంది. ఈ సేవ జరిగే సమయంలో ముందుగా స్వామివారికి అలంకరించిన ఆభరణాలు తొలగిస్తారు. బంగారు తీగలతో చేసిన మఖమల్‌ గౌనును స్వామివారికి ధరింపచేస్తారు. శిరస్సుపై కిరీటంలా పట్టు వస్త్రాన్ని చుడతారు. అనంతరం జియంగార్లు దివ్య ప్రబంధాన్ని గానం చేస్తుండగా స్వామివారికి పూలంగి సేవ చేస్తారు. రంగురంగుల పూలమాలలు కిరీటంగా, శంఖు చక్రాలుగా, నాగాభరణాలుగా, వస్తాల్రుగా, ఆభరణాలుగా స్వామివారి శిరస్సు నుంచి పాదాలవరకు అలంకరిస్తారు. అలాగే స్వామివారి ఖడ్గమైన సూర్యకటారిని ఎడమచేతిలో ధరించినట్లు అలంకరింపచేస్తారు. ఈ విధంగా స్వామి వారు పూలతో చేసిన వస్తాన్న్రి ధరించిన రూపంలో మహా తేజంతో భక్తులకు దర్శనం ఇస్తారు. పూలంగిసేవ పూర్తయిన అనంతరం రాత్రి ఏకాంత సేవ జరిగేంత వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తారు.

పుష్ప యాగం

ఏటా కార్తికమాసంలో స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రంనాడు పుష్పయాగం జరుగుతుంది. పుష్పయాగం నాటి ఉదయం గర్భాలయంలో కైంకర్యాలు పూర్తయ్యాక శ్రీదేవిభూదేవి సమేత మలయప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపానికి చేరుకుంటారు. ముందుగా స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత ఆయనను శేషవాహనంపై కొలువుదీరుస్తారు. పండితులు నాలుగు వేదాలను పారాయణం చేస్తూ ఉండగా.శేష వాహనాన్ని అధిరోహించిన స్వామివారి పాదాల నుంచి హృదయం వరకు పూలలో మునిగేలా  పుష్పాలను సమర్పిస్తారు. తర్వాత ధూప దీప నీరాజనాలను ఇచ్చి... ఆ పుష్పాలను పాదాల వరకు సవరిస్తారు. మళ్లీ హృదయం వరకు పుష్పాలను సమర్పిస్తారు.ఇలా ఇరవై ఒక్కసార్లు చేస్తారు.  రంగురంగుల సుంగంధ పరిమళాలు వెదజల్లే పూలతో నిండిన స్వామివారు దివ్య తేజో రూపంతో దర్శనమిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని