ఇరవై ఆరు... ఆరు... మనలోనే ఆ పోరు!

కారం ఉంటేనే తీపి రుచి తెలుస్తుంది... కష్టం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది... మనిషిలోని రాక్షస లక్షణాల గురించి తెలిస్తే... సద్గుణాల విలువ అర్థమవుతుంది. భగవద్గీతలోని పదహారో అధ్యాయం దీన్ని గురించే చర్చిస్తుంది. మనిషిలోనే నిబిడీకృతమైన ఈ వైరుధ్య గుణాలు అతనిలో సంఘర్షణకు కారణమవుతాయి.

Updated : 21 Feb 2021 21:01 IST

కారం ఉంటేనే తీపి రుచి తెలుస్తుంది... కష్టం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది... మనిషిలోని రాక్షస లక్షణాల గురించి తెలిస్తే... సద్గుణాల విలువ అర్థమవుతుంది. భగవద్గీతలోని పదహారో అధ్యాయం దీన్ని గురించే చర్చిస్తుంది. మనిషిలోనే నిబిడీకృతమైన ఈ వైరుధ్య గుణాలు అతనిలో సంఘర్షణకు కారణమవుతాయి. ఆరు అసుర గుణాలను, ఇరవై ఆరు దైవ గుణాల సాయంతో అణచివేసినప్పుడు హృదయం నిష్కల్మషమవుతుంది. మానవుడు మాధవుడవుతాడు... ఇదే దైవాసుర సంపద్విభాగ యోగ సారాంశం... ఏ గుణాల్ని ఆర్జించుకుంటే బతుకు సుసంపన్నమవుతుందో ఇందులో బోధిస్తాడు పరమాత్మ.

పనిషత్తుల సారంగా, యోగశాస్త్రంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించిన భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాల్లో దైవాసుర సంపద్విభాగ యోగం ఒకటి. ఇందులోని ఇరవై నాలుగు శ్లోకాలు విశేషమైనవి. మనిషిలోని దైవీ, అసుర లక్షణాల మధ్య సంఘర్షణను పరమాత్మ అద్భుతంగా వివరిస్తాడు. ఈ సందర్భంగా ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా దర్శనమిస్తాడాయన. జీవితంలో జ్ఞానంతో పాటు, శాంతిని ఎలా సిద్ధింపజేసుకోవాలో ఈ అధ్యాయం చదివి నేర్చుకోవచ్చు.

ఆ శక్తుల మధ్య...
మనిషి మనోక్షేత్రంలో రెండు వర్గాల మధ్య అవిశ్రాంత సంగ్రామం జరుగుతుంటుంది. అవి దైవ, అసుర వర్గాలు. ఇరు వర్గాలకూ సరిసమానమైన శక్తి, సంపత్తులు ఉంటాయి. విచక్షణ ఉన్న జీవి అయిన మానవుడు దైవీ లక్షణాలతో, అసుర గుణాలను అదుపులో పెట్టాలి. మానవుడు సహజంగానే సుగుణశోభితుడు అని శ్రీకృష్ణుడు దైవాసుర సంపద్విభాగ యోగంలో పదేపదే గుర్తు చేస్తుంటాడు. మనిషి నిజతత్వం దివ్యమైంది. కానీ మనిషి దీన్ని గుర్తించలేకపోవడం వల్ల రాక్షస గుణాలబారిన పడతాడు.

భగవానుడు ముందు ఇరవై ఆరు దైవిక గుణాల సంపదను అభివర్ణించాడు.

అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః!
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తవ ఆర్జనమ్‌!!

అహింసా సత్య మక్రోథః త్యాగ శ్శాంతి రఫైశునమ్‌!
దయా భూతేష్వలోలు ప్త్వం మార్దవం హ్రీ రచాపల్‌!!

తేజః క్షమా ధృతి శ్శౌచమ్‌ అద్రోహౌ నాతి మానితా
భవంతి సంపదం దైవీమ్‌ అభిజాతస్య భారతః!!

నిర్భయం, పవిత్ర హృదయం, జ్ఞానదృష్టి, దాన గుణం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞభావంతో స్వధర్మాన్ని చిత్త శుద్ధితో నిర్వర్తించడం, శాస్త్ర అధ్యయనం, అహింస, సత్యం, అక్రోధం, చిత్తశాంతి, ఇతరుల దోషాలను ఎంచని లక్షణం, అన్ని జీవులపై దయ, విషయ వాసనలు లేకపోవడం, మృదుత్వం, అణకువ, కాపట్యం లేకపోవడం, చిత్త స్థైర్యం, తేజస్సు, క్షమ, ధైర్యం, బాహ్యంతర శుచి, ద్రోహ గుణ లేకపోవడం, దురభిమానానికి దూరంగా ఉండడం... ఈ ఇరవై ఆరూ దైవికంగా వస్తాయి. వీటితో మనిషికి నిర్మలమైన మనస్సు కలుగుతుంది.

వాటికి వ్యతిరేకమైన అసుర లక్షణాలు ఆరు....

దంభో దర్పో భిమానశ్చ క్రోధః పారుష్య మేవ చ!
అజ్ఞానం చాభిజాతస్య పార్థ! సంపద మాసురీమ్‌!!

దంభం, దర్పం, అహంకారం, దురభిమానం, కోపం, పరుష వచనం...
దంభంతో మనిషి కపటిగా మారతాడు. దర్పం అతనిలో గర్వాన్ని తెచ్చి ఆత్మస్తుతి, పరనింద చేయిస్తుంది. దురభిమానం తాను తప్ప ఇంకెవరూ గొప్పకాదనే భావాన్ని ప్రేరేపిస్తుంది. క్రోథంతో మనిషి తనపై తాను నిగ్రహాన్ని కోల్పోతాడు. పారుష్యం అంటే కఠినమైన మాటల వల్ల అందరికీ దూరమవుతాడు.

త్రివిధమ్‌ నరక స్యేదం
ద్వారం నాశన మాత్మనః!
కామః క్రోధ స్తథా లోభః
తస్మా దేత త్త్రయం త్యజేత్‌!!

-కామ, క్రోధ, లోభాలు అత్మవినాశక హేతువులు. ఈ మూడూ నరక ద్వారాలు. కాబట్టి వీటిని వదిలిపెట్టు. ఇదే విషయాన్ని ఆది శంకరులు భగవద్గీత భాష్యంలో వివరించారు.


ఒకసారి పరమహంస యోగానంద వద్ద శిష్యులు  దైవాసుర సంపద్విభాగ యోగం ప్రస్తావన తెస్తారు. గురువుగారూ! ఆ భగవంతుడు మనలో ఎందుకు ఈ రెండు విరుద్ధ గుణాలను పెట్టాడు... అన్నీ మంచి గుణాలే పెట్టొచ్చు కదా. ఎందుకీ సంఘర్షణ? అని... అప్పుడు పరమహంస యోగానంద ఇలా సమాధానమిచ్చాడు. రాపిడితోనే అగ్ని జ్వలిస్తుంది. కొలిమిలో మరిగితేనే బంగారం మెరుస్తుంది. మానవుడి దివ్యత్వాన్ని ఆవిష్కరించడానికి రెండు గుణాలనూ భగవంతుడు పెట్టాడు. తనలోని దివ్య గుణాలను ఆవిష్కృతం చేసుకోవడం మనిషి కర్తవ్యం.


ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదు రాసురా
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్వతే!!

భగవంతుడి నుంచి దూరం చేసి పూర్తిగా లోక వ్యవహారంలో మునిగేట్లు చేసేది ప్రవృత్తి. బాహ్య ప్రపంచంపై ఆసక్తిని వదిలేసుకుని ఆత్మానందం వైపు, ఆత్మావలోకనం వైపు మరలే స్వభావం నివృత్తి. ప్రవృత్తి లక్షణం మనిషిలో రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది.. ప్రపంచం వైపు పరుగులు తీయిస్తుంది. నివృత్తి మనిషిని అంతర్ముఖుణ్ణి చేస్తుంది. నీలోని ఆత్మానుభూతిని ఆవిష్కరింపజేసుకోమని హితవు పలుకుతుంది.

-సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని