లోకానికి దీపధారులు!

ధర్మాన్ని ప్రవచించి ప్రభువు లోకానికి వెలుగయ్యారు. ఆయన సాహచర్యంలో శిష్యులూ ప్రకాశించారు. నీతి, ప్రేమ, కరుణతో ప్రపంచానికి  కొత్త మార్గాన్ని చూపారు. ప్రభువు సువార్తను ప్రపంచవ్యాప్తంగా

Updated : 24 Dec 2020 01:55 IST

రేపు క్రిస్మస్‌

ధర్మాన్ని ప్రవచించి ప్రభువు లోకానికి వెలుగయ్యారు. ఆయన సాహచర్యంలో శిష్యులూ ప్రకాశించారు. నీతి, ప్రేమ, కరుణతో ప్రపంచానికి  కొత్త మార్గాన్ని చూపారు. ప్రభువు సువార్తను ప్రపంచవ్యాప్తంగా చాటారు.. ఈ క్రమంలో వారు ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. వారి త్యాగాల వల్లనే క్రీస్తు బోధనలు ప్రపంచవ్యాప్తమయ్యాయి అవే పవిత్ర బైబిల్‌గా మారాయి. శాంతిని వెదజల్లుతున్నాయి... క్రిస్మస్‌ సందర్భంగా వీరిని స్మరించుకుందాం...
పేతురు: ఈయన వృత్తి రీత్యా జాలరి. క్రీస్తుకు అత్యంత సన్నిహితుడు. ప్రభువు మరణించే ముందు పేతురుతో ‘కోడి రెండుసార్లు కూయకముందే, నేనెవరో తెలియదని చెబుతావు’ అన్న మాటలు నిజమయ్యాయి. తరువాత పేతురు అంతులేని దుఃఖాన్ని అనుభవించాడు. క్రీస్తు పునరుత్థానమైన తరువాత ఉపదేశాలను బోధిస్తున్న పేతురును నాటి పాలకులు బంధించి నేలపై పడుకోడానికి వీలుకాని స్థలంలో తొమ్మిది నెలలు బంధించి ఉంచారు. తల్లకిందులుగా శిలువ వేశారు. ఆయనను శిలువ వేసిన కొండపేరు వాటికన్‌.
ఆంద్రెయ: ఇతను పేతురు సహోదరుడు. క్రీస్తు పునరుత్థానం తర్వాత సిద్కియ అనే ప్రాంతంలో క్రీస్తు బోధనలను ప్రచారం చేస్తుండేవారు. ఆ ప్రాంత గవర్నర్‌ భార్య ఆ బోధనలకు ఆకర్షితురాలు కావడంతో కోపంతో ఆ గవర్నర్‌ ఆంద్రెయను రాళ్లతో కొట్టి, శిలువ వేసి చంపించాడు.
యోహాను: గలిలయ సముద్ర ప్రాంతంలో ఉండే చేపల వ్యాపారి. క్రీస్తు శిష్యులలో సంపన్నుడు. ప్రభువు పిలుపుతో సమస్తం వదిలిపెట్టి ఆయనను అనుసరించారు. క్రీస్తును సిలువ వేస్తున్నప్పుడు అందరూ పారిపోయినా యోహాను మాత్రం ప్రభువు చెంతనే ఉన్నాడు. క్రీస్తు తన తదనంతరం తల్లి మరియ బాధ్యతను అతనికే అప్పగించాడు. 98 ఏళ్ల వయసులో మరణించారు
ఫిలిప్‌: క్రీస్తు ప్రభువు ప్రసంగాల సమయంలో భక్తులకు, శిష్యులకు భోజన బాధ్యతలు చూసేవారు. క్రీస్తు బోధనలు ప్రచారం చేస్తున్న సమయంలో ఆనాటి మత పెద్దలు ఫిలిప్‌ను కొరడాలతో కొట్టి, సిలువ వేసి చంపారు. మూడో పోప్‌ జాన్‌పాల్‌ ఫిలిప్‌ దేహ అవశేషాలను తెప్పించి రోమ్‌లో పాలరాతి సమాధిలో పదిలపరిచారు. అది ప్రస్తుతం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉంది.
బర్తొలొమయి: ఆయన పూర్తిపేరు నతానియేలు బర్తొలొమయి. క్రీస్తు సందేశాన్ని భారతదేశానికి చేరవేసింది ఈయనే. ఆసియా, ఆఫ్రికాల్లో ప్రచారం చేసిన ఇతన్ని క్రీ.శ.60లో ఆర్మేనియాలో సైనికులు బంధించి చిత్రహింసలు పెట్టి చంపారు.
తోమా: ఈయన్నే థామస్‌ అంటారు. బాబిలోనియా, పారసీ ప్రాంతాల్లో క్రీస్తు సందేశాన్ని వినిపించి క్రీ.శ49లో భారతదేశం వచ్చారు. కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో సువార్తను ప్రకటించారు.
యూదా తద్దయి: పెద్ద యాకోబు కుమారుడు. తండ్రి బాటలో పయనించారు. బైబిల్‌లో యూదా లేఖనం రాశారు. తర్వాత సిరియా రాజైన అడ్గర్‌ బహుకు ఆప్తుడయ్యారు.
మత్తయి: రోమా ప్రభుత్వం తరఫున పన్నులు వసూలు చేసే ఉద్యోగి. ఈ క్రమంలో కఠినంగా ఉన్న ఇతన్ని ప్రభువు శిష్యుడిగా ఎన్నుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘నీ సమస్తాన్ని విడిచి నన్ను అనుసరించు’ అన్న ప్రభువు మాటకు మారు మాట్లాడలేదు మత్తయి. ఇతను నూతన నిబంధనలోని 23 అధ్యాయాలు రాశారు. ఆయనకు హెబ్రూ, అరబ్బీ, లాటిన్‌ భాషలు తెలుసు. పర్షియా, ఇథియోపియాల్లో క్రీస్తు బోధనలను ప్రచారం చేశారు.
యాకోబు: ఏసు సిలువ మరణం ముందు ఒలీవల కొండపై క్రీస్తు పునరుత్థాన సంగతులు విని, ప్రపంచానికి చాటిన నలుగురిలో యాకోబు ఒకరు. క్రీస్తు పునరుత్థానం తర్వాత ఇతను స్పెయిన్‌ దేశం వెళ్లి బోధించారు. హేరోదు రాజు శిరచ్ఛేదం చేయించినప్పుడు మరణాన్ని దుఃఖంతో, భయంతో కాకుండా ధైర్యంతో ఎదుర్కొన్న యాకోబుకు శిక్ష అమలు చేసిన సైనికాధికారి కూడా శిష్యుడయ్యాడు.
చిన్న యాకోబు: ఈయన క్రీస్తుకు శిస్యుడు కాకముందుహేరోదు, రోమన్లకు వ్యతిరేకంగా పనిచేసిన విప్లవకారుడు. ప్రభువు పునరుత్థానం తర్వాత పాలస్తీనాలో బోధనలను ప్రచారం చేశారు. హేరోదు ఆయనను యెరూషలేం దేవాలయ శిఖరం పై నుంచి కింద పడవేసి చంపించాడు.
సీమోను: పాలస్తీనాలో రోమన్ల పాలనను వ్యతిరేకించిన జెలోతీయులు అనే వర్గానికి చెందిన వారీయన. తొలుత విప్లవకారుడిగా ఉన్నా క్రీస్తు పిలుపుతో ప్రేమతో సమస్తం సాధించగలమని నమ్మారు. ఈజిప్టు, ఉత్తర అమెరికా, ఇంగ్లండు ప్రాంతాల్లో వెళ్లి ప్రభువు బోధనలు ప్రచారం చేశారు.
ఇస్తరియోతు యూదా: 30 వెండి నాణేల కోసం క్రీస్తు ప్రభువును పట్టించాడు. జీసస్‌ సిలువపై మరణించడం చూసి పశ్చాత్తాపంతో ఇస్కరియోతు యూదా కూడా ఉరివేసుకుని చనిపోయినట్లు లేఖనాల కథనం.

-ఎం.సుగుణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని