సేవకుడివా..నాయకుడివా?

1892 డిసెంబరు 24... కన్యాకుమారి తీరం. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందుమహా సముద్రం సంగమించే పుణ్యస్థలి. ముఫ్పై ఏళ్లయినా నిండని వివేకానంద ఆ సమీపంలోని ఆలయంలో కన్యాకుమారి దేవిని ఆరాధించి అక్కడకు చేరుకున్నారు. ఆయన మనసులో అనుపమానమైన అన్వేషణ. ఏ లక్ష్యం కోసం భగవంతుడు తనకు ఈ శరీరాన్ని ప్రసాదించాడో తెలుసుకోవాలన్న బలమైన కోరిక....

Updated : 07 Jan 2021 04:21 IST

ఈనెల 12 స్వామి వివేకానంద జయంతి

‘నా ఆశలన్నీ యువతరం పైనే! సింహ సదృశులై వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలరు...’
ఇది స్వామి వివేకానంద  ఆకాంక్ష.

మిత్రమా!
నీవు ఆరడుగుల మనిషివి కాదు.
భూనభోంతరాళాలు పరివేష్టించిన విశ్వవ్యాపివి.
ప్రకృతిని శాసించే పరమాత్మవు.
నీవు మృత్యురూపుడవు కాదు.
మృత్యుంజయుడవు.
భృత్యుడవు కాదు. రాజాధిరాజువు.
సాక్షాత్తు పరమశివుడవు...
ఇది స్వామి వివేకానంద నినాదం.

 

1892 డిసెంబరు 24... కన్యాకుమారి తీరం. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందుమహా సముద్రం సంగమించే పుణ్యస్థలి. ముఫ్పై ఏళ్లయినా నిండని వివేకానంద ఆ సమీపంలోని ఆలయంలో కన్యాకుమారి దేవిని ఆరాధించి అక్కడకు చేరుకున్నారు. ఆయన మనసులో అనుపమానమైన అన్వేషణ. ఏ లక్ష్యం కోసం భగవంతుడు తనకు ఈ శరీరాన్ని ప్రసాదించాడో తెలుసుకోవాలన్న బలమైన కోరిక. అప్పుడాయన దృష్టి సముద్రంలోని ఓ శిలపై ఉంది. అక్కడ ఏకాంతంగా అంతరంగ అన్వేషణతో తన గమ్యం నిర్దేశించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవు... ఒక్కసారే కడలిలో దూకారు. రెండు కిలోమీటర్లు ఈదుకుంటూ శిలపైకి చేరుకున్నారు. దాదాపు మూడు రోజుల పాటు నిరాటంకంగా ధ్యానస్థితిలో నిమగ్నమయ్యారు. భారతదేశ దుస్థితికి కారణాలు తెలుసుకున్నారు. భారతావనికి వైభవం తెచ్చేందుకు ప్రణాళికలు రచించుకున్నారు.  ఆకలి కడుపులకు కావాల్సింది మత బోధనలు కాదు. దీన భారతాన్ని దివ్య భారతంగా మార్చడమే కర్తవ్యమని గుర్తించారు. ఆ ఆంతరంగిక అన్వేషణ ఫలం జగద్విదితమే. ఈ క్రమంలో ఆయన జీవితంలోని ప్రతి ఘట్టం దివ్యత్వాన్ని చాటింది. మానవాళికి సందేశమై నిలిచింది.

భగవంతుడిపై నమ్మకం ఉన్నవాడిని ఆస్తికుడని, నమ్మనివాడిని నాస్తికుడని అనడం ఆనాటి మాట. కానీ తనపై తనకు నమ్మకం ఉన్నవాడిని ఆస్తికుడని, తనపై తనకు నమ్మకం లేనివాడిని నాస్తికుడని నేనంటాను. ఆత్మ విశ్వాసం ఉన్నవాడికే ఆ సర్వేశ్వరుడి సహకారం అందుతుంది.

1897, మే నెలలో రామకృష్ణ మిషన్‌ స్థాపించారు వివేకానంద. సంఘస్థాపన, నియమావళి, దార్శనికత అన్నీ వివేకానందవే అయినా, అధ్యక్షుడిగా ఆయన ఉండలేదు. సోదర సన్యాసి అయిన బ్రహ్మానందను ఉంచారు. తాను సంఘ సేవకుడిగా ఉండడానికే ఆసక్తి చూపారు. తరచూ వివేకానంద నవతరాన్ని ఉత్తేజపరుస్తూ ‘ముందు సేవకుడిగా ఉండడానికి సిద్ధపడండి. నాయకత్వం దానంతట అదే వస్తుంది. వెనకుండి శ్రమించడానికి ఇష్టపడేవాడే, నాయకుడిగా  నడిపించడానికి అర్హుడు. అని ఘోషించారు.

భద్రమైన జీవితాన్ని కోరుకునే వారు భవ్యమైన చరిత్రను మిగల్చలేరు. బతుకు సఫలం, సార్థకం కావాలంటే సవాళ్లకు సిద్ధమై ఉండాలి. ఓసారి స్వామి వివేకానంద బేలూరు మఠంలో తన గదిలో నిలబడి దూరంగా గంగానదిని చూస్తూ దీర్ఘాలోచనలో ఉన్నారు. ఇంతలో ఓ యువకుడు ఆ గదిలోకి వచ్చాడు. ‘స్వామీ! ఈ లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి?’ అని ప్రశ్నించాడు. అప్పుడు వివేకానంద ‘ఈ మాయా ప్రపంచంలో సుఖదుఖాలు అలల మాదిరిగా ఒకదానివెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి.కేవలం సుఖం మాత్రమే కోరుకోవడం అవివేకం. సుఖదుఃఖాల మధ్య జీవిత సాఫల్యత ఉందని  గ్రహించాలి’ అని బోధించారు.

తనపై తనకి ఆధిపత్యం ఉన్నవారిని ఉపనిషత్తులు ‘స్వరాట్‌’ అనే పదంతో నిర్వచించాయి. ప్రతి చర్యకు పూనుకొమ్మని ప్రకృతి మనల్ని ప్రేరేపిస్తుంది. దెబ్బకు దెబ్బ తీయమని ప్రోత్సహిస్తుంది. ఈ  వాంఛను అదుపు చేసి నిగ్రహాన్ని కనపరచడానికి గొప్ప శక్తికావాలి. ఆ శక్తే మనిషి ఉన్నతికి మూలకారణం.

ఓసారి స్వామి భారతదేశమంతా పర్యటిస్తూ మహాబలేశ్వరం వెళ్లారు. అక్కడ ఓ న్యాయవాది ఇంట్లో అతిధిగా ఉన్నారు. ఆ ఇంట్లో ఓ శిశువు రాత్రంతా ఏకధాటిగా రోదిస్తోంది. ఆ రోదన స్వామిని కదిలించింది. ఆయన ‘ఈరాత్రికి ఆ పసి బిడ్డను నా దగ్గర ఉండనివ్వండి’ అన్నారు. అప్పుడా బిడ్డ తల్లి ‘నేనే సముదాయించలేకపోతున్నాను స్వామీ! . మీ వల్ల అవుతుందా’ అంటూనే స్వామి చేతికి శిశువునిచ్చారు. అప్పుడు వివేకానంద రాత్రంతా ఆ పసిబిడ్డను తన ఒళ్లో పడుకోబెట్టుకుని ధ్యానమగ్నులయ్యారు. బిడ్డ ఒక్కసారి కూడా ఏడవకుండా రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయింది. ధ్యాన మహిమను ఆయన ఇలా ప్రపంచానికి చాటారు.

-సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని