ఆవేశమే అవతారమై!

పరశురాముడు... ప్రజాకంటక పాలకుల పాలిట ప్రళయ భీకరుడు. ఆవేశంలో దావానల సదృశుడు... అంతేనా.. అవసరమైతే సర్వస్వాన్ని దానం చేయగల త్యాగశీలి కూడా. ఇంకా.. పితృవాక్య పాలకుడు, కర్తవ్య నిబద్ధుడు, దుష్టశిక్షకుడు,  శిష్యవత్సలుడు, కార్యసాధకుడు కూడా. దశావతారాల్లో ఆవేశానికి ప్రతిరూపమైన ఆయన జీవితంలో ఆది నుంచి ఎన్నో మలుపులు. మరెన్నో విశేషాలు...

Updated : 13 May 2021 00:42 IST

మే 14 పరశురామ జయంతి

పరశురాముడు... ప్రజాకంటక పాలకుల పాలిట ప్రళయ భీకరుడు. ఆవేశంలో దావానల సదృశుడు... అంతేనా.. అవసరమైతే సర్వస్వాన్ని దానం చేయగల త్యాగశీలి కూడా. ఇంకా.. పితృవాక్య పాలకుడు, కర్తవ్య నిబద్ధుడు, దుష్టశిక్షకుడు,  శిష్యవత్సలుడు, కార్యసాధకుడు కూడా. దశావతారాల్లో ఆవేశానికి ప్రతిరూపమైన ఆయన జీవితంలో ఆది నుంచి ఎన్నో మలుపులు. మరెన్నో విశేషాలు...
అగ్రతః చతురో వేదా: పృష్టతః సశరమ్‌ ధనుః।
ఇదమ్‌ బ్రాహ్మ్య మిదమ్‌ క్షాత్రమ్‌ శాపాదపి శరాదపి।।

ఎదుట (ముఖంలో) నాలుగు వేదాలు, వీపున బాణాలతో కూడిన ధనుస్సు, బ్రహ్మ తేజస్సూ ఉంది. క్షాత్ర పరాక్రమమూ ఉంది. శాపం చేతనైనా, శరం ద్వారానైనా సాధిస్తాడు. పరశురాముడి గురించి చెప్పే శ్లోకమిది. లోకకల్యాణం కోసం విష్ణువు ఎత్తిన దశావతారాల్లో పరశురామావతారం ఆరోది. ఇది ఆవేశావతారం. ఈ ఉద్భవం వెనుక పెద్ద కథే ఉంది.

అటు ఇటై..
* భృగువంశంలో రుచీకుడనే మునికుమారుడు తన తపశ్శక్తితో వెయ్యి విచిత్ర గుర్రాల్ని వరుణదేవుడి నుంచి పొందాడు. వాటిని గాది రాజుకు సమర్పించి ఆయన కుమార్తె సత్యవతిని వివాహమాడాడు. సత్యవతి తనకు బ్రహ్మతేజస్సు కలిగిన సంతానం కావాలని భర్తను కోరింది. అలాగే పుత్ర సంతానం లేని తన తల్లిదండ్రులకు క్షత్రియ తేజస్సు కలిగిన పుత్రుణ్ని కూడా ప్రసాదించమని వేడుకుంది.
* రుచీకుడు యజ్ఞం చేసి బ్రహ్మ, క్షత్రియ తేజస్సులు కలిగిన రెండు ప్రసాదాల్ని భార్యకిచ్చాడు. అవి తారుమారయ్యాయి. సత్యవతి రుచీకుణ్ని వేడుకోగా, యజ్ఞ ప్రసాదానికి తన తపశ్శక్తి కూడా తోడైన కారణంగా ఆమె తల్లికి క్షత్రియ తేజస్సు కలిగిన పిల్లాడే పుట్టి కాలక్రమంలో బ్రహ్మ తేజస్సు కలిగిన వాడిగా మారతాడని చెబుతాడు. అలాగే సత్యవతికి బ్రహ్మతేజస్సు కలిగినవాడు జన్మించి కాలక్రమంలో ఉగ్రస్వభావం కలిగి ఉంటాడని అంటాడు. సత్యవతి తీవ్ర దుఃఖంతో అర్థిస్తుంది. ఆ ఉగ్రస్వభావం పుత్రుడికి కాకుండా మనవడికి వచ్చేట్లు దీవిస్తాడు. అలా సత్యవతికి జమదగ్ని జన్మిస్తాడు. జమదగ్ని, రేణుకలకు వైశాఖ శుక్లపక్ష తదియనాడు విష్ణ్వంశతో జన్మించిన కుమారుడే పరశురాముడని స్కాందపురాణం పేర్కొంటుంది.

పరశురాముడిగా...
* బాల్యంలోనే తపోదీక్షతో విష్ణువును మెప్పించి ధనుర్బాణాల్ని సాధించాడు పరశురాముడు. దత్తాత్రేయుడి అనుగ్రహం పొంది అస్త్రవిద్యల్ని ఆపోశన పట్టాడు. తపోనిష్ఠతో పరమేశ్వరుని మెప్పించి పరశువు (గండ్రగొడ్డలి) బహుమతిగా పొంది పరశురాముడు అయ్యాడు. అసలైతే తండ్రి పెట్టిన పేరు రాముడు. భృగువంశంలో పుట్టిన కారణంగా భార్గవ రాముడయ్యాడు.
* చిత్రరథుడనే గంధర్వుడి భోగాల్ని చూసి మనసులో చాంచల్యాన్ని పొందిందన్న కారణంతో తల్లిని చంపమని తండ్రి ఆదేశిస్తాడు. ఆయనకి ఎదురు చెప్పకుండా తల్లిని సంహరించి, వెంటనే తండ్రి వరంతో బతికించుకున్నాడు పరశురాముడు.

అరాచకంపై గండ్రగొడ్డలి
* ప్రజల రక్షణ బాధ్యత వహించాల్సిన రాజులు నిరంకుశంగా ప్రవర్తించటాన్ని నిరసిస్తూ మొదటిసారి పరశువు ఎత్తిన విష్ణుమూర్తి అవతారం పరశురాముడు. తమ ఇంటికి అతిథిగా వచ్చిన కార్తవీర్యార్జునుడు బలవంతంగా కామధేనువును అపహరిస్తే ఆగ్రహోదగ్రుడై అతడి వెయ్యి చేతులు, తల ఖండించాడు. దానికి పరిహారంగా తండ్రి ఆజ్ఞ మేరకు పుణ్యతీర్థ సందర్శన చేశాడు. కార్తవీర్యార్జునుడి కుమారులు తన తండ్రిని సంహరించినప్పుడు ఆవేశం తారస్థాయికి చేరి 21 సార్లు దండెత్తి కనిపించిన ప్రతి క్షత్రియుణ్నీ ఊచకోత కోశాడు.

సత్యం గ్రహించి...
* తన గురువైన శివుడి ధనుస్సును విరిచిన రామచంద్రుడి మీద ఆగ్రహించి, తన దగ్గరున్న విష్ణు ధనుస్సును ఎక్కుపెట్టమంటాడు. రాముడు ధనుస్సు ఎక్కుపెట్టగానే దాశరథిలోని విష్ణు అంశను గుర్తించి తన అవతార పరమార్థం పూర్తయిందని గ్రహిస్తాడు. రాముడి బాణానికి తన తపశ్శక్తిని లక్ష్యంగా చూపిస్తాడు.
* రాజుల్ని జయించి గెలిచిన భూమిని కశ్యపుడికి దానమిచ్చి, ఆయన ఆజ్ఞ మేరకు చిరునవ్వుతో భూమిని వదిలి మహేంద్రగిరికి వెళ్లిపోతాడు.
* రామాయణ, మహాభారతాలు రెండింట్లో పరశురాముడు కనిపిస్తాడు. మహాభారతంలో ముగ్గురు మహావీరులు... భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడికి గురువుగా కనిపిస్తాడు. అబద్ధం చెప్పి అస్త్రవిద్యలు నేర్చుకున్న కర్ణుణ్ని శపిస్తాడు. అంబ విషయంలో తన శిష్యుడైన భీష్ముడితో పోరుకి దిగుతాడు. ఇలా రౌద్రం, త్యాగం, కార్యసాధన కలగలిసిన మూర్తి పరశురాముడు.

కార్యరంగంలోకి దిగితే పట్టిన పట్టు విడవ కూడదు. అవసరమైతే సాధించినదాన్ని తృణప్రాయంగా త్యాగం చెయ్యగలగాలి... పరశురామ అవతారం ఇచ్చే సందేశం ఇదే. కోపం విషయానికొస్తే ఆయనకి వచ్చింది అనవసరపు ఆవేశం కాదు. దాని వెనుక తీవ్రమైన కారణం ఉంది. అందరిలా పుట్టి భగవంతుడి ఆవేశం ద్వారా అనితరసాధ్య కార్యాలు నిర్వహించి, చివరికి ప్రశాంత చిత్తుడు కావటమే పరశురామ అవతార లక్ష్యం.

* ‘మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధ మౌళిం..’ శివాష్టోత్తర శత నామస్తోత్రమ్‌లో కనిపించే వర్ణన ఇది. ఒక చేతిలో మృగాన్ని, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని ఉంటాడు శివుడు. గుడిమల్లంలోని ప్రాచీన పరశురామేశ్వర ఆలయంలోని శివుడి చేతిలో గొడ్డలి కనిపిస్తుంది.  ఈ ఆయుధాన్నే దేవదేవుడు పరశురాముడికి ఇచ్చి అన్యాయం మీద ఎత్తమన్నాడు.

అంతరార్థం అదే

ఆధునిక విజ్ఞానశాస్త్రంలోని జీవపరిణామ సిద్ధాంతానికి మూలరూపమే దశావతారాలు. పూర్తిగా జలచరమైన మత్స్యం మొదటి అవతారమైతే, తర్వాత వరుసగా ఉభయచరమైన కూర్మం, పూర్తిగా భూచరమైన వరాహం, మనిషిగా పరిణామం చెందుతున్న తొలిదశ నారసింహావతారం, పూర్తి మనిషిగా పరిణామం చెందని మరుగుజ్జు రూపంగా వామనావతారం, పూర్తి మనిషిగా పరిణామం చెందినా నాజూకుతనం నేర్వని దశగా పరశురామావతారాన్ని చెప్పవచ్చు. పరశురామ అవతారాన్ని అవతార శేషంగానే భావిస్తారు. అందుకే ఆయనకి ఎక్కువగా ఆలయాలు కనిపించవు.

ఆరు విధాలు...
అంశావతారం, అంశాంశావతారం, ఆవేశావతారం, కలావతారం, పూర్ణావతారం, పరిపూర్ణావతారం.. అని అవతారాల్ని సూక్ష్మంగా ఆరు రకాలుగా విభజించారు. భగవంతుడి శక్తిని ఆవహింపజేసి జీవుడి ద్వారా కార్యాన్ని నెరవేర్చటం ఆవేశావతారం. దుష్ట క్షత్రియులను తునుమాడటానికి అలా వచ్చిన అవతారమే పరశురాముడు.

తల మీద జటాజూటాలతో, కైలాస పర్వతంలా, దుస్సహమైన కాలాగ్నిలా ప్రకాశిస్తున్నాడు. భుజం మీద గొడ్డలి, మెరుపు లాంటి ధనుస్సు, బాణాలతో త్రిపురాసుర సంహారానికి వెళుతున్న ముక్కంటిలా ఉన్నాడు. వాల్మీకి రామాయణంలో కనిపించే పరశురాముడి వర్ణన ఇది.

అశ్వత్థామ బలిర్వ్యాసో హనూమశ్చ విభీషణః।
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః।।

పురాణాల్లో కనిపిస్తున్న ఏడుగురు చిరంజీవుల్లో పరశురాముడు ఒకరు. త్రేతా ద్వాపర యుగాల్లో దర్శనమిచ్చే పరశురాముడు చిరంజీవిగా కలియుగంలో కల్కికి విద్యలు నేర్పిస్తాడనీ, తర్వాతి మన్వంతరంలో సప్తర్షుల్లో ఒకడవుతాడనీ ఐతిహ్యం.

సుదర్శనుడే అలా...

పరశురామావతారానికి సంబంధించిన మరొక ఐతిహ్యం కూడా కనిపిస్తుంది. మత్స్యావతారంలో ముట్టెగా, వరాహావతారంలో కోరలుగా, నారసింహావతారంలో గోళ్లుగా మారిన సుదర్శనుడికి (సుదర్శన చక్రం) స్వామి తనవల్లనే విజయాలు సాధిస్తున్నాడన్న గర్వం కలిగింది. స్వామితో వాగ్వాదానికీ దిగాడు. దాంతో వెయ్యి అంచులు కలిగిన సుదర్శనుడు వెయ్యి చేతులు కలిగిన కార్తవీర్యార్జునుడిగా, స్వామి పరశురాముడిగా అవతరించారు. ఈ అవతారంలో స్వామి సుదర్శనుడి సహాయం లేకుండానే ఈశ్వర ప్రసాద లబ్ధమైన పరశువుతో కార్తవీర్యుని రూపంలో ఉన్న సుదర్శనుడి అహంకారాన్ని తుంచివేసినట్టు పురాణాలు చెబుతాయి.

సముద్రాన్ని చీల్చి

కేరళలోని కరమణ నదీతీరంలో ఉన్న తిరువళ్లం రెండువేల ఏళ్లనాటి పరశురామ క్షేత్రం. కాశ్యపుడికి భూమిని దానమిచ్చిన తర్వాత గొడ్డలితో సముద్రాన్ని చీల్చి పరశురాముడు ఏర్పరచుకున్న ప్రదేశంగా దీన్ని చెబుతారు. కడప జిల్లాలోని అత్తిరాల, మధ్యప్రదేశ్‌లోని జానాపావ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో కొన్ని పరశురామ ఆలయాలు కనిపిస్తాయి. ఉడుపి, కొల్లూరు, గోకర్ణ, కుక్కే సుబ్రహ్మణ్య, శంకరనారాయణ, కుంభాసి, కోటేశ్వర ప్రదేశాలను పరశురామ క్షేత్రాలంటారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో పరశురామ కుండం ఉంది.

- డా।। ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వర రావు, త్రిపురాంతకం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని