గురుస్సాక్షాత్‌ పరఃబ్రహ్మ

తల్లిదండ్రులు జన్మనిస్తే, దాన్ని సార్థకం చేసేది గురువులు. విద్యార్థిలో అజ్ఞానమనే చీకట్లను పారదోలి విజ్ఞానం నింపి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దుతారు గురువులు. అందుకే, ఆచార్యులకు అత్యున్నత స్థానం కల్పించారు పెద్దలు. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాసపూర్ణిమ లేదా గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాం. ప్రాచీన కాలం నుంచి సమాజాన్ని ధర్మ, జ్ఞాన సంపదలతో నింపిన ఆచార్యులెందరో!

Updated : 22 Jul 2021 03:55 IST

జులై 24 గురుపూర్ణిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే, దాన్ని సార్థకం చేసేది గురువులు. విద్యార్థిలో అజ్ఞానమనే చీకట్లను పారదోలి విజ్ఞానం నింపి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దుతారు గురువులు. అందుకే, ఆచార్యులకు అత్యున్నత స్థానం కల్పించారు పెద్దలు.
ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాసపూర్ణిమ లేదా గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాం. ప్రాచీన కాలం నుంచి సమాజాన్ని ధర్మ, జ్ఞాన సంపదలతో నింపిన ఆచార్యులెందరో! ముఖ్యంగా ‘మునీనామ్యహం వ్యాసః’ అంటూ, మునుల్లో తాను వ్యాసమహర్షినని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. లోకంలో ‘ఏకాయనం’ పేరుతో ఒక్కటిగా ఉన్న అనంత వేదరాశిని రుగ్‌, యజుర్‌, సామ, అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా ప్రసిద్ధి చెందాడు కృష్ణద్వైపాయనుడు. బదరికాశ్రమంలో దీర్ఘకాలం తపస్సు చేసినందున బాదరాయణుడయ్యాడు.

అ చతుర్వదనో బ్రహ్మ, ద్విబాహురపరో హరిః
అఫాలలోచనశ్శంభుః భగవాన్‌ బాదరాయణః

వ్యాసుడు నాలుగు ముఖాలు లేని బ్రహ్మ. రెండు చేతులే ఉన్న శ్రీహరి. మూడో నేత్రం లేని శివుడు. ఈ త్రిమూర్తుల కార్యకలాపాలను వ్యాసుడు నిర్వర్తించాడు అని గురుస్తుతి. ఆచార్యుడు సృష్టికర్త బ్రహ్మలా విజ్ఞానాన్ని సృజించాడు. పాలన, పోషణ చేసే విష్ణువులా జగత్తును దివ్యగుణాలతో నడిపించాడు. లయకారుడైన శివుడిలా కల్మషాలను, సంకుచిత భావాలను నశింపజేశాడు. అందుకే వ్యాసుడు త్రిమూర్తి స్వరూపుడు.
వ్యాసుడే మూలం
ఇంటి గుమ్మంలో పెట్టిన దీపం లోపలా, బయటా కాంతిని ప్రసరింపజేస్తుంది (గేహళీదీపన్యాయం). అలాగే వ్యాసుడు తనకు ముందున్న గురువులు, తన కాలంనాటి గురువులు, తన తరవాతి గురువులకు తనలోని దైవశక్తితో స్ఫూర్తినిస్తున్నాడు. మన ప్రాచీన విజ్ఞానమంతా వ్యాసుని నుంచే వెలువడింది. అందుకే ‘వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం’ అన్నారు. వ్యాసుని ముఖ కమలం నుంచి జాలువారిన జ్ఞానామృతాన్ని జగత్తంతా ఆస్వాదిస్తోంది.
విద్యార్థిలో నిద్రాణమై ఉన్న శక్తులను మేల్కొలిపి, జ్ఞానం, ఆనందాన్ని నింపేది గురువులే. ‘ఆచార్య దేవో భవ’ అని వేదం ఉపదేశించింది. దాచి ఉంచిన ధనాన్ని గురించి ఒక వ్యక్తి అవసాన దశలో ఆత్మీయులకు తెలియజేసే విధంగా ఆచార్యుడు పెద్దల నుంచి తెలుసుకున్న జ్ఞానాన్ని శిష్యులకు ఉపదేశిస్తాడు. ‘ఆచార్య స్తుతే గతిం వక్తా’ అంటూ, ఆచార్యుడే శిష్యుడికి మోక్షమార్గాన్ని తెలుపుతాడని ఛాందోగ్యోపనిషత్తు కీర్తిస్తోంది.

ఆ తలంపు వద్దు
ఆచార్యః స హరిః సాక్షాత్‌ చరరూపీ న సంశయః
మగ్నానుద్ధరతే లోకాన్‌ కారుణ్యాత్‌ శాస్త్రపాణినా

ఆచార్యుడు ప్రత్యక్ష నారాయణుడే! సంసార సాగరంలో మునిగి ఉన్న వారిని శాస్త్రమనే చేతితో ఉద్ధరిస్తాడు. మంత్రం, మంత్రాన్ని ఇచ్చే గురువు, మంత్రాన్ని ప్రతిపాదించే దైవం అనుగ్రహానికి పాత్రులైనవాళ్లు దుఃఖం బారిన పడరని, మోక్షం పొందుతారని పెద్దలు చెబుతారు. అందుబాటులో ఉన్న గురువుని వదిలిపెట్టి భగవంతుని ఆశ్రయించటం చేతిలో ఉన్న నీటిని పారబోసి, వర్షం కోసం ఎదురుచూడటం లాంటిదని నానుడి.
విష్ణోరర్చావతారేషు లోహభావం కరోతి యః
యో గురౌ మానుషభావం ఉభౌ నరకపాతినౌ

ఆరాధించే విగ్రహాల్ని కేవలం లోహంతో తయారు చేసినవని, గురువులను తనలాంటి సాధారణ మనుషులని తలచే వ్యక్తులు నరకాన్ని పొందుతారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఏ లోహంతో తయారుచేసినవైనా విగ్రహాలను భగవత్‌ స్వరూపంగానే భావిస్తూ అర్చించాలి. శారీరక లోపాలు, కులమతాది లౌకిక విషయాలు, గుణగణాలను గణించకుండా గురువుల పట్ల భక్తిశ్రద్ధలతో మెలగాలి.

వారి విధేయత ఆదర్శం

లోకమంతా ఆరాధించే శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించి శిష్యరికం చేశాడు. ‘పుట్టింది మొదలు ఆలమందలతో తిరుగుతూ పెరిగాం. ఇప్పటికైనా ఒక మంచి గురువు వద్ద విద్యాభ్యాసం చేయాలి’ అనుకున్న శ్రీకృష్ణ బలరాములు అవంతిపురంలో సాందీపుని వద్దకు వెళ్లి తమకు విద్యాబుద్ధులు నేర్పాలని ప్రార్థించారు. అందుకు అంగీకరించిన గురువు వారికి సమస్త విద్యలూ     నేర్పించాడు. వారిద్దరూ వేదవేదాంగాలను కేవలం అరవైనాలుగు రోజుల్లో, ధర్మ, తర్క, న్యాయ, గణిత, చిత్రలేఖన, అశ్వ, గజశాస్త్రాలను పన్నెండు వారాల్లో అభ్యసించారు. అస్త్రవిద్యను యాభై రోజుల్లో సొంతం చేసుకున్న మీదట గురువుకి భక్తిపూర్వకంగా పాదాభివందనం చేశారు.

గురువులతో సమానం!

యేనైవ గురుణా యస్య న్యాసవిద్యా ప్రదీయతే।
తస్య వైకుంఠ దుగ్ధాబ్ధిః ద్వారకా స్సర్వ ఏవ సః।।

వేంకటాద్రి మొదలుకొని ద్వారక వంటి సమస్త తీర్థ క్షేత్రాలు జ్ఞానమనే చూపును ఇచ్చి అజ్ఞానమనే చీకటిని పారదోలతాయి. కాబట్టి ఆ దివ్య ప్రదేశాలు కూడా రక్షించే గురువులతో సమానమే. ఆయా పుణ్యక్షేత్రాల విషయంలో ఎలా భక్తిభావంతో ఉంటామో, గురువుల విషయంలో కూడా అలాగే మెలగాలని దీని అంతరార్థం.

నిర్లక్ష్యం పెను శాపం

నారాయణోపి వికృతిం యాతి గురోః ప్రచ్యుతస్య దుర్బుద్ధేః
కమలం జలాదపేతం శోషయతి, రవి ర్న పోషయతి

సహజంగా సూర్యుడు తామరపువ్వును వికసింపజేస్తాడు. ఆ పువ్వు నీటిలో ఉన్నంతవరకే ఆ వికాసం. అదే పువ్వు నీటిని వదలి నేలపైకి వచ్చిన మరుక్షణమే దాన్ని అదే సూర్యుడు మాడ్చి, నశింపజేస్తాడు. అలాగే గురువు విషయంలో కూడా భక్తితో ఉంటూ, ఆయన బోధలను శ్రద్ధతో అనుసరించే వారిని శ్రీమన్నారాయణుడు రక్షించి ఉన్నతిని కల్పిస్తాడు. గురు బోధలను పెడచెవిన పెట్టి, ఆయన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని నారాయణుడు శిక్షిస్తాడన్నది ఈ శ్లోక భావం.

ధన్యులమైతిమి మీ కృప
మాన్యగుణోదార! నీవు మమునొక యర్థం
బన్యూనంబుగ నడుగుమ
నన్యసులభమైన దెద్దియైనను వేడ్కన్‌!

‘మాన్యుడా! ఉదారుడా! నీ దయవల్ల మేము ధన్యులం అయ్యాం. కృతజ్ఞతగా గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాం. ఇతరులకు సులభం కానిది ఏదైనా అడగండి’ అన్నారు బలరామకృష్ణులు హరివంశంలో. గురువు పట్ల వారి విధేయత అందరికీ ఆదర్శం.

గురువే దైవం

గురురేవ పరంబ్రహ్మ, గురురేవ పరాగతిః
గురురేవ పరావిద్యా, గురురేవ పరంధనమ్‌
గురురేవ పరఃకామో గురురేవ పరాయణమ్‌
యస్మాత్తదుపదేష్టాసౌ తస్మాద్గురుతరోగురుః

సకల విద్యలను ఉపదేశించే గురువే దైవం. గురువే ఆశ్రయింపదగినవాడు. గురువే ఉత్తమ విద్య. గురువే శ్రేష్ఠమైన ధనం- అని శాస్త్రం చెబుతోంది. ప్రతిభాసంపన్నమైన గురువు సన్నిధిలో జ్ఞాన దీపాలుగా వెలగడమే ప్రతి ఒక్కరి లక్ష్యమూ కావాలి.

- ఎస్‌.ఎన్‌.సి.తిరుమలాచార్యులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు