పావన శ్రావణం

చంద్రుడు శ్రవణా నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసం శ్రావణం. గ్రహ గమనంలో కొన్నిసార్లు పౌర్ణమినాడు ఈ నక్షత్రం చంద్రునితో కూడి ఉంటుంది. ఈ నెలలో విష్ణుమూర్తి నక్షత్ర మండలంలో కొలువుతీరి ఉండటాన నభోమాసం అంటారు. శివుడు, విష్ణువు,  గౌరి, లక్ష్మి, చంద్రుడు, శని- ఇలా సర్వ దేవతలు శుభాన్ని చేకూరుస్తారని  ఈ మాసాన్ని శుభమాసం  అని కూడా అంటారు. నెలలో అన్ని రోజులూ పూజలూ వ్రతాలే కనుక ఇది భక్తిమాసం!

Updated : 05 Aug 2021 04:54 IST

ఆగస్టు 9 శ్రావణమాసం ఆరంభం

చంద్రుడు శ్రవణా నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసం శ్రావణం. గ్రహ గమనంలో కొన్నిసార్లు పౌర్ణమినాడు ఈ నక్షత్రం చంద్రునితో కూడి ఉంటుంది. ఈ నెలలో విష్ణుమూర్తి నక్షత్ర మండలంలో కొలువుతీరి ఉండటాన నభోమాసం అంటారు. శివుడు, విష్ణువు,  గౌరి, లక్ష్మి, చంద్రుడు, శని- ఇలా సర్వ దేవతలు శుభాన్ని చేకూరుస్తారని  ఈ మాసాన్ని శుభమాసం  అని కూడా అంటారు. నెలలో అన్ని రోజులూ పూజలూ వ్రతాలే కనుక ఇది భక్తిమాసం!

శ్రావణే మాసి పంచమ్యాం శుక్లపక్షే

పూజయంతీహ నాగాన్భక్తి పురస్సరాః

నతేషాం సర్పతోవీర

భయంభవతి కర్హిచిత్‌

- భవిష్యపురాణం

శ్రావణ శుద్ధ పంచమే నాగపంచమి. ఆరోజు సర్పదేవతలను పూజించినవారికి సర్పభీతి కలగదని ఈ శ్లోకానికి అర్థం. శ్రావణ శుద్ధ షష్టినాడు సూర్యారాధన చేసినవారికి ఆయురారోగ్య ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ పూర్ణిమను మించిన పూర్ణిమ లేదంటారు. ఆ రోజున చంద్రదర్శనం చేసుకుంటే కళ్లకు ఆరోగ్యం చేకూరుతుంది. అంతేకాదు, చల్లదనానికి ప్రతీక అయిన చంద్రుడు మనసులు కలుషితం కాకుండా, నిరంతరం మంచి ఆలోచనలు కలిగేట్లు అనుగ్రహిస్తాడు. శ్రీమన్నారాయణుని నక్షత్రమైన శ్రవణంతో కూడిన ఈ నెల ఎంతో శ్రేష్ఠ్ఠమైంది.


గనాంగణ సందీప

దుగ్ధాబ్ధి మథనోద్భవ

భాభాసితరిగా భోగ

రమానుజ నమోస్తుతే

- అగ్నిపురాణం

ఈ శ్లోకం ‘ఓ చంద్రదేవా! గగన ప్రాంగణంలో వెలుగు నింపి, క్షీరసాగరం నుంచి ఆవిర్భవించి, సకల దిక్కులను శాంతి కిరణాలతో ప్రకాశింపచేసిన లక్ష్మీదేవి సోదరా! నీకిదే నమస్కారం’ అంటూ చంద్రుని స్తుతిస్తోంది. మనసు నిర్మలంగా ఉంటే ప్రశాంతత దొరుకుతుందనేది పరోక్ష సందేశం. శ్రావణ పూర్ణిమ అన్నచెల్లెళ్లకు ప్రీతిపాత్రమైంది. స్త్రీలు తమ సోదరులకు రక్షాబంధనం కట్టడం తెలిసిందే. సర్వమత సామరస్యం ఉన్న మనదేశంలో హిందువులతోబాటు ఇతర మతస్తులు కూడా రాఖీ కట్టడం చూస్తుంటాం. శ్రావణ పూర్ణిమకు మరో విశేషముంది. శ్రీమహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు ఈ రోజునే ఉద్భవించాడు. బహుళ అష్టమినాడు గీతాకారుడు శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ మాసం పారలౌకికంగా, పారమార్థికంగా మహోన్నతమైంది. కన్నతల్లి దాస్యాన్ని పోగొట్టడానికి గరుత్మంతుడు అమృతాన్ని సాధించింది ఈ మాసంలోనే. అందుకే దీనికి అమృతమాసమని ఇంకో పేరుంది. మహాశివునికి సోమవార వ్రతాలు, గౌరీదేవికి మంగళవార వ్రతాలు, లక్ష్మీదేవికి శుక్రవార వ్రతాలు, శ్రీమన్నారాయణుడికి శనివార వ్రతాలు- అన్నీ ఈ మాసానివే. విశేషించి శనిదేవునికి పరమ ప్రీతికరమైంది శ్రావణ శనివారం. శ్రావణ ఏకాదశి- పుత్రదా ఏకాదశి. సంతాన భాగ్యం కలిగిస్తుందని నమ్ముతారు. శ్రావణ బహుళ విదియ- అశూన్య శయన వ్రతదినం. గృహప్రవేశ, ఉపనయన, వివాహాది శుభకార్యాలకు ఈ నెల ఉత్తమం. శ్రావణ ద్వాదశి- దామోదర ద్వాదశి. ఈ నెలలో లలితా సహస్ర నామ పారాయణం వేయింతల పుణ్యఫలం. శ్రావణ అమావాస్య- పోలాల అమావాస్య. నిజానికిది పొలాల అమావాస్య. కాలక్రమంలో పోలాలగా మారింది. ఫలసాయాన్ని అందించి, కడుపు నింపిన సస్యదేవిని కొలిచే రోజిది. సస్యలక్ష్మిగా, సస్యగౌరిగా పూజిస్తారు. జగన్మాతకు గాజుల మాల వేసి, ఆవుపేడతో దీపం పెట్టి, పొలంలో ఊరేగించి గోవులను, ఎడ్లను పూజిస్తారు. ఈరోజు చేసే దానాలకు ఫలితం అనంతం.


ప్రతి రోజూ పండగే!

అమాయాం రవి సంక్రాంత్యాం

ఫలం శతగుణం భవేత్‌

చాతుర్మాస్యాం పౌర్ణమాస్యా

మనంతం ఫలమేవచ
చాతుర్మాస్య వ్రతం చేసుకునేవారికి శ్రావణమాసం ఉత్తమం అని శ్రీదేవీ భాగవతంలో చెప్పారు. ఈ మాసం వ్రతదీక్షలు, అర్చనాది దైవ కార్యాలకు పెట్టింది పేరు. ఈ నెలలో ప్రతి రోజూ పర్వదినమే. కార్తీకమాసం హరిహరులకు ప్రధానమంటారు. కానీ అంతకు ముందే వచ్చే శ్రావణ మాసం కూడా శివకేశవులకు, అలాగే గౌరీలక్ష్ములకు మహా ప్రీతికరమైంది.


మూర్తి భౌదేన సాదుర్గా

మూలప్రకృతిరీశ్వరీ

కృపారూపాతి ప్రత్యక్షా

యోషితామిష్టదేవతా

మూల ప్రకృతి రూపమే మంగళగౌరి. దయామూర్తి, సౌభాగ్యప్రదాయిని. స్త్రీల పాలిట కల్పతరువు.


మంగళే మంగళార్హేచ

సర్వ మంగళ మంగళే

పూజ్యే మంగళవారే

మంగళాభీష్ట దేవతా

శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం గౌరీదేవిని, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం చేసి తరిస్తారు.


శుద్ధలక్ష్మీః మోక్షలక్ష్మీః

జయలక్ష్మీః సరస్వతీ 

శ్రీర్లక్ష్మీః వరలక్ష్మీశ్చ

ప్రసన్నా మమ సర్వదా

వర్షాన్నే గాక హర్షాన్ని కూడా తెచ్చే శ్రావణమాసం సకల జనావళికి సర్వ శుభదాయిని. ఆరోగ్యప్రదాయిని, అమృతదాయిని. ఆధ్యాత్మిక తత్త్వ ప్రదాయిని. ఇన్ని విశేషాలున్న శ్రావణం ప్రతి నిత్యం భక్తిముక్తి ప్రదాయకం.


- డాక్టర్‌ పులిగడ్డ లలితవాణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని