దుష్టులకు భయంకరి.. శిష్టులకు అభయంకరి

ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు వేటికవే గొప్పవి. ఆ మూడింటి కలయిక వల్ల ఏర్పడే శక్తికి ఎదురులేదు. ఆ శక్తికి అధిదేవత జగన్మాత. అందువల్ల ఆమెను ఆరాధించేవారు ఇహ, పారలౌకిక సౌఖ్యాలు పొందుతారని దేవీభాగవతం చెబుతోంది.

Updated : 07 Oct 2021 04:58 IST

నేటి నుంచి శరన్నవరాత్రులు ఆరంభం

ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు వేటికవే గొప్పవి. ఆ మూడింటి కలయిక వల్ల ఏర్పడే శక్తికి ఎదురులేదు. ఆ శక్తికి అధిదేవత జగన్మాత. అందువల్ల ఆమెను ఆరాధించేవారు ఇహ, పారలౌకిక సౌఖ్యాలు పొందుతారని దేవీభాగవతం చెబుతోంది. ‘పరాశక్తి ర్వివిధైవ శ్రూయతే’ అంటే- ఏకరూపమైన శక్తి వివిధ రూపాలుగా అవతరించిందని శ్వేతాశ్వతరోపనిషత్తు చెబుతోంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

శరత్కాలంలో పుట్టినందున దేవికి ‘శారద’ అని పేరు. ‘నూయతే సూయతే ఇతి నవః’ తొమ్మిదిరోజులు శారదను పూజిస్తాం కనుక ‘శరన్నవరాత్రులు’. ఈ రోజుల్లో దేవిని నవదుర్గలుగా ఆరాధిస్తారు. ఏ రోజున ఏ రూపంలో కొలవాలో తెలిపే శ్లోకమిది...

ప్రథమా శైలపుత్రీ ద్వితీయా బ్రహ్మచారిణీ

తృతీయా చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకీ

పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనీతి చ

సప్తమా కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమీ

నవమా సిద్ధి ధాత్రీతి నవదుర్గాః ప్రకీర్తితాః

తొలిరోజు శైలపుత్రి హిమవంతుని కుమార్తె కనుక శైలపుత్రి. హైమవతి, పార్వతి అనే పేర్లూ ఉన్నాయి. వృషభవాహిని. కుడిచేతిలో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది. ఎడమచేతిలో కమలం ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే తల్లి కనుక తొలిరోజున ఈ దేవిని పూజిస్తారు.

రెండోరోజు బ్రహ్మచారిణి గత జన్మలో దక్షప్రజాపతి కుమార్తె అయిన ‘సతీదేవి’నని, నారదుని ద్వారా తెలుసుకుని ఆయన ఉపదేశంతో ఈ జన్మలోనూ శివుని భర్తగా పొందాలని తపస్సు చేయడానికి నిశ్చయించుకుంది. దానికి తగిన వేషమే ఈ బ్రహ్మచారిణి. కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలం. శ్వేత వస్త్రధారిణి రూపం. తపస్సు చేసింది కనుక తపశ్చారిణి. బ్రహ్మచర్యం పాటించినందున బ్రహ్మచారిణి. ఈమెను పూజిస్తే సాధు జీవనం అలవడుతుందని, అన్నింటా విజయం కలుగుతుందని అంటారు.

మూడోరోజు చంద్రఘంట పది భుజాలు, ధనుస్సు, బాణం, గద, శూలం, ఖడ్గం, పాశం లాంటి ఆయుధాలు, పద్మం, కమండలాలతో భాసించే ఈ దేవిని పూజించడం వలన శత్రువులను జయించే శక్తి కలుగుతుందని నమ్ముతారు.

నాలుగోరోజు కూష్మాండ కూష్మాండ అంటే గుమ్మడికాయ. ఇది పృథ్వికి ప్రతీక. విశ్వాన్ని సృష్టించిందని ఆ పేరొచ్చింది. ఎనిమిది చేతులు, చక్రం, గద, ధనుస్సు, బాణం, మొదలైన ఆయుధాలతోబాటు, కమండలం, అమృత కలశం, జపమాల, పద్మం ధరించిన ఈ దేవిని పూజిస్తే రోగాలు, బాధలు నశిస్తాయంటారు.

అయిదోరోజు స్కందమాత సింహవాహిని. నాలుగు చేతుల్లో ఒకచేత్తో కుమారుడైన స్కందుణ్ని, రెండు చేతుల్లో పద్మాలనీ, మరోచేయి అభయముద్ర. శాంతరూపిణి. స్కందుని తల్లి కనుక ‘స్కందమాత’. శాంతస్వరూపిణి అయిన ఈ దేవి పూజతో శాంతి, సౌఖ్యం కలుగుతాయి.

ఆరోరోజు కాత్యాయని త్రిమూర్తుల తేజంతో మహిషాసురుడ్ని సంహరించడానికి ఎత్తిన రూపం. ముందుగా కాత్యాయనుడు అనే ముని పూజించినందున ఆ పేరు వచ్చింది. నాలుగు చేతులు. సింహవాహిని. ఒకచేతిలో ఖడ్గం, రెండోచేత కమలం ధరించి మిగిలిన రెండింటిలో ఒకటి వరముద్రగా, మరొకటి అభయహస్తంగా దర్శనమిచ్చే అమ్మవారి పూజతో రోగాలు, కష్టాలు తీరతాయి.

ఏడోరోజు కాళరాత్రి విరబోసుకొన్న తల, నల్లని మేనిరూపు, నాలుగు భుజాలు, గాడిద వాహనం. నాలుగు భుజాల్లో రెండు అభయ హస్తంగా, వర ప్రసాద ముద్రగా ఉంటాయి. దుష్టులకు భయంకరి, శిష్టులకు అభయంకరి అనే భావన ఇమిడి ఉందీ రూపంలో. పాపాలు, గ్రహబాధలు తొలగిపోవడం ఈమె పూజా ఫలితం.

ఎనిమిదోరోజు మహాగౌరి వృషభవాహిని. చతుర్భుజాలు. నాలుగు చేతుల్లో త్రిశూలం, డమరుకం, అభయహస్త ముద్ర, వరప్రసాద ముద్రలు కలిగి ఉంటుంది. తెల్లని వర్ణం, శ్వేత వస్త్రధారిణి. పాపాలను హరించి శుభాలను కలిగించడం పూజా ఫలితం.

తొమ్మిదోరోజు సిద్ధిధాత్రి సర్వసిద్ధులను ప్రసాదించేది కనుక ఈమెకీ పేరు. కమలం ఆసనం. శంఖం, చక్రం, గద, పద్మాలను నాలుగు చేతుల్లో ధరించి భక్తులచే పరివేష్టితమై ఉంటుంది. ఈమెను పూజిస్తే సర్వసిద్ధులూ, సుఖసంతోషాలు కలుగుతాయి.


నవరాత్రులలో అమ్మవారి అలంకరణ

విదియనాడు బాలాత్రిపురసుందరి. తదియ- లలితా త్రిపురసుందరి. చవితి- గాయత్రీదేవి. పంచమి- అన్నపూర్ణాదేవి. షష్ఠి- సరస్వతీదేవి. సప్తమి- మహాలక్ష్మి. అష్టమి- దుర్గాదేవి. నవమి- మహిషాసుర మర్దని. దశమి- రాజరాజేశ్వరిగా అలంకరించి కొలుస్తారు.
మార్కండేయ పురాణంలో మహాకాళి, మహిషాసురమర్దని, చాముండి, నంద, రక్తదంతిక, శాకంబరి, దుర్గ, మాతంగి, భ్రామరి- అంటూ తొమ్మిది దేవీ రూపాలు చెప్పారు. ఇవేకాక ప్రాంతీయ భేదాలను బట్టి రూపాలు, నామాలు మారినా, నవమ సంఖ్య మారదు.
తొమ్మిదిరోజులకూ ప్రాధాన్యత ఉన్నా మహాష్టమి, మహర్నవమి, విజయదశమి  ఈ మూడురోజులూ పరమ పవిత్రమైనవిగా పరిగణిస్తారు. తొమ్మిది రోజులూ పూజించలేని భక్తులు ఈ మూడు రోజులు పూజించినా ఫలితం కలుగుతుంది.
చివరి మూడు రోజులైన అష్టమి, నవమి, దశమి తిథుల్లో సరస్వతిని పూజిస్తారు. చాలా ప్రాంతాల్లో మూలా నక్షత్రంతో కూడి ఉన్న సప్తమి నాడు సరస్వతీ పూజ, మహర్నవమి రోజున ఆయుధపూజ చేస్తారు. వ్యవసాయ పరికరాలు, యంత్రాలను అలంకరించి, దేవితో పాటు వాటినీ పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో విజయదశమి రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి సూచకంగా, రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలను తగలబెట్టి ఉత్సవం చేస్తారు.


శమీ పూజ

విజయదశమి రోజున శమీ పూజ చేయడం సంప్రదాయం. క్షీర సాగర మథన సమయంలో పాల సముద్రం నుంచి ఉద్భవించినవాటిలో జమ్మి (శమీ) చెట్టు ఒకటని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని ‘అగ్నిగర్భ’అంటారు. యజ్ఞయాగాల్లో వాడే అగ్ని కోసం పుట్టించే ప్రక్రియను అరణి అంటారు. అందుకోసం శమీవృక్ష కలపనే ఉపయోగిస్తారు.

శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ

కరిష్యమాణ యాత్రాయా యథాకాలం సుఖం

మయా తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ

‘ఓ శమీ వృక్షమా! పాపాలను పోగొట్టి, శత్రువులను పరాజయం పాల్చేయడం నీ విశిష్టత. అర్జునుడు ధనుస్సును నీ దగ్గరే దాచాడు! రాముడికి ప్రియం చేకూర్చిందీ నువ్వే.  నేనూ అలాగే పూజిస్తున్నాను. విఘ్నాలు లేకుండా అన్నింటా విజయం చేకూర్చు’ అని ప్రార్థిస్తారు.


- రమా శ్రీనివాస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని