Updated : 18 Nov 2021 05:16 IST

ఇహ పరాల సమన్వయం కార్తికం

కార్తికమంటేనే దీపాల దీప్తులు. అందునా కార్తిక పౌర్ణమినాడు నేతి దీపాలు, ఉసిరి దీపాలు భాసిస్తాయి. నదులు, కొలనుల్లో అరటిదోనెలపై దివ్వెలు ఓలలాడతాయి. 365 ఒత్తుల దివ్య జ్యోతులతో ఆలయాలు వెలుగులు చిందిస్తే సామూహిక దీపోత్సవాలతో వీధులు మహోజ్జలంగా ప్రకాశిస్తాయి.

కార్తికమాసం ప్రత్యేకమైంది. ఈ నెలలో పూర్ణిమ మరింత విశిష్టం. ‘అగ్ని నః పాతు కృత్తికా’ అంటుంది వేదం చెబుతోంది. కృత్తికా నక్షత్రం అగ్నిసంబంధమైంది. చలికాలంలో వచ్చే ఈ మాసం అగ్ని తత్త్వాన్ని కలిగి, ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అంతే కాదు, అగ్ని పవిత్రతకు మారు పేరు. పూర్వం శీలనిరూపణకు  అగ్నిపరీక్షలుండేవని పురాణాల్లో చూస్తున్నాం. ఈ మాసం శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాక, మానసిక పవిత్రతను సైతం పెంపొందిస్తుంది.

కాలుష్యాన్ని నివారించి, పవిత్రతను చేకూర్చేవి నీరు, అగ్ని. మురికిని వదిలించుకుని శరీరాన్ని, పరిసరాలను పరిశుభ్రం చేసుకోవటానికి నీరు సహకరిస్తుంది. ఇక, అగ్ని దహనంతో పరిశుద్ధి చేస్తుంది. వీటితో మనం పవిత్రులం కావటానికి తగిన విధానాలను దృష్టిలో పెట్టుకుని కార్తిక మాసంలో ప్రభాత వేళ స్నానం, ప్రదోష వేళ దీపం అనే రెండు ఆచారాలను పెద్దలు మనకు ప్రసాదించారు. ఈ రెండూ కార్తిక మాసం అంతటా ప్రతినిత్యమూ పాటించేవే అయినా, పూర్ణిమనాడు వాటికి మరింత ప్రాధాన్యం కనిపిస్తుంది.
కార్తిక పూర్ణిమనాడు సూర్యోదయవేళ స్నానం చేయటం సంప్రదాయం. ఈ స్నానం నదీ స్నానమో లేక సముద్ర స్నానమో అయితే మరింత శ్రేష్ఠం, శ్రేయోదాయకం. నిలువ ఉండి తుప్పుపట్టిన గొట్టాలలో వచ్చే నీటికంటే ప్రవహించే నీటిలో చేసే స్నానం ఎన్నో రుగ్మతలను పరిహరిస్తుందని ఆయుర్వేదం వివరిస్తోంది. ప్రాణ శక్తికీ నీటికీ విడదీయరాని అనుబంధం ఉంది.

మాతృగర్భంలో శిశువు నీటిలోనే ఉంటాడు. నీటిశాతం ఎక్కువగా ఉన్న చనుబాలు పుట్టిన బిడ్డకు మొదటి ఆహారం అవుతోంది. బిడ్డ పెద్దయ్యాక ఆహారానికి అవసరమైన పంటకు వర్షపు నీరే ఆధారం. ఇలా నీటితో మనకున్న అనుబంధం అసాధారణమైంది. అందుకే ‘వాడికి ఆ నీళ్లు ఒంట పట్టాయి’ అనే మాట వాడుకలోకి వచ్చింది.

చన్నీళ్ల స్నానం శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసి, ఆకలి కలిగిస్తుంది. అందుకే స్నానం చేసిన తర్వాతే భోజనం అనే మంచి విధానం అలవర్చుకున్నాం. మాసం పొడవునా చేసే అవకాశం లేకపోతే, కనీసం పూర్ణిమ నాడైనా ఈ స్నాన విధిని పాటించి ప్రయోజనం పొందవచ్చు.

భారతంలో ధర్మరాజు ‘స్నానం మనోమల త్యాగం’ అంటాడు. శరీర మాలిన్యాన్ని ప్రక్షాళనం చేయటంతోపాటు మనసులోని మాలిన్యాన్ని కూడా తొలగించి, ఆధ్యాత్మిక చింతనకు కావలసిన నేపథ్యాన్ని సిద్ధం చేస్తుంది కార్తిక పౌర్ణమి స్నానం.
దీపం అంటేనే దైవం. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఒక సందర్భంలో బ్రహ్మ విష్ణువుల మధ్య జ్యోతిర్లింగ రూపంలో పరమ శివుడు ఆవిర్భవించాడని శివపురాణ గాథ. శివారాధన విశేషంగా జరిగే కార్తిక మాసంలో పౌర్ణమినాడు దీపారాధనకు విశేష ప్రాధాన్యం కనిపిస్తుంది. దీపం పరమేశ్వర స్వరూపానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రదోష వేళ అంటే సాయంసంధ్యలో దీపం వెలిగించటం మంచి సంప్రదాయం. ఇంట్లో ఇష్టదైవం ఎదుట వెలిగించిన దీపాలను వాకిలిముందు అలంకరించుకోవటం ఆనవాయితీ. అలా ప్రమిదలను వీధి అరుగులమీద అమర్చుకోవటం సంప్రదాయమే కాదు, సామాజిక ప్రయోజనం కూడా. విద్యుద్దీపాలు లేని కాలంలో వీధి అరుగులమీద వెలిగే దీపాల కాంతులు బాటసారులకు దారిచూపేవి.

ఆకాశదీపం

కార్తిక పూర్ణిమ నాడు శివాలయంలో ఆకాశదీపం వెలిగించటం ఆచారం. దీపాన్ని, చిల్లుల పాత్రలో పెట్టి, ధ్వజ స్తంభానికి కట్టి కప్పీల సాయంతో పైకి లాగుతారు. చిల్లుల పాత్రలోంచి దీపపు వెలుగులు ప్రసరిస్తాయి. చిల్లుల పాత్ర ఇంద్రియ సముదాయమైన మానవ దేహం. శివుడనే ప్రాణశక్తి మనలో వెలిగే దీపం. మనలోని ప్రాణశక్తి- కన్ను, చెవి, ముక్కు తదితర ఇంద్రియాల ద్వారా వ్యక్తమై, జీవ యాత్రకు ఆధారమవుతోందన్న సత్యాన్ని మనకు తెలియజేసేది ఆకాశదీపం.

జ్వాలాతోరణం

కార్తిక పూర్ణిమనాడు శివాలయంలో రెండు స్తంభాల మధ్య దూలం అమర్చి దీపాలు వెలిగించడమే జ్వాలా తోరణం. భక్తులు దాని కిందినుంచి వెళ్తూ, ప్రదక్షిణం చేస్తారు. ఈ అగ్నిజ్వాల జ్ఞానానికి సంకేతం. ఇలా చేసే ప్రదక్షిణం కర్మాచరణం. ఈ భక్తి కలాపాలు జ్ఞానపూర్వకం కావాలన్నదే ఉత్సవ పరమార్థం.

సామూహిక దీపోత్సవాలు

కార్తికంలో, ముఖ్యంగా పూర్ణిమనాడు ఆలయ ప్రాంగణాల్లో, పుణ్యక్షేత్రాల్లో, బహిరంగ ప్రదేశాల్లో పరమేశ్వర ప్రీతిగా అసంఖ్యాకంగా దీపాలు వెలిగించే ఒక వేడుక వాడుకలోకి వచ్చింది. అన్ని ప్రమిదల్లో వెలిగేది ఒకే ఒక్క దీపం. ప్రాణులందరిలో ప్రకాశించేది ఒకే ఒక్క ఆత్మదీపం- అని గుర్తించాలన్నదే సామూహిక దీపోత్సవాల ఆంతర్యం.

అర్చనలు, దానాలు

శివ కేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైంది కార్తిక మాసం. ఇంద్రసావర్ణి మన్వంతరం ఈ పూర్ణిమ నాడు ప్రారంభమవుతుందంటారు. కార్తిక దామోదరుడు అనే పేరుతో విష్ణువును పూజించటం, సత్యనారాయణస్వామి వ్రతం, దామోదర వ్రతం, కేదారేశ్వర వ్రతం మొదలైనవి ఈ పూర్ణిమ నాడు చేస్తారు. పరమ శివుడు త్రిపురాసుర సంహారం చేసిన పర్వదినం ఈ పూర్ణిమేనని పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ పర్వదినాన పరమేశ్వరుడికి బిల్వార్చనలు, అభిషేకాలు ఆచరిస్తారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా వ్రతాలు, పూజలు, అభిషేకాలతోబాటు శివకేశవులకు ప్రీతి కలిగించేలా రకరకాల దానాలు చేయటం సంప్రదాయం. సంపన్నులు తమ అహంకారాన్ని వదిలి, సామాన్యులకు చేయూత అందించటమే వీటికి లక్ష్యమని గుర్తించాలి. ఇలా ఇహపరాల సమన్వయంతో మనకు శ్రేయస్సునూ అభ్యుదయాన్నీ ప్రసాదించే పర్వదినం కార్తిక పూర్ణిమ.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని