అయ్యప్పదేవా..అభయస్వరూపా

కార్తికమాసం మొదలు మకర సంక్రాంతి వరకు ఎటు చూసినా అయ్యప్ప దీక్షలు.. వీనులవిందు చేసే శరణమయ్యప్పా నామస్మరణలు.. చల్లటి చలిలో చన్నీటి స్నానం, నేలమీద శయనం, నిరాడంబర జీవనం, నల్లటి వస్త్రాలతో శాంతస్వరూపంతో అయ్యప్పభక్తులు..శబరిగిరుల్లో కొలువైవున్న అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు

Updated : 23 Dec 2021 05:39 IST

కార్తికమాసం మొదలు మకర సంక్రాంతి వరకు ఎటు చూసినా అయ్యప్ప దీక్షలు.. వీనులవిందు చేసే శరణమయ్యప్పా నామస్మరణలు.. చల్లటి చలిలో చన్నీటి స్నానం, నేలమీద శయనం, నిరాడంబర జీవనం, నల్లటి వస్త్రాలతో శాంతస్వరూపంతో అయ్యప్పభక్తులు..

బరిగిరుల్లో కొలువైవున్న అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వెళ్తారు. మాల ధరించి, ఇరుముడి కట్టుకుని, నియమ నిష్ఠలతో మండలం రోజులు కఠినదీక్షకు పూనుకుంటారు. చన్నీటిస్నానం, పాదరక్షలు వదిలేయడం, ఏకభుక్తం, అస్ఖలిత బ్రహ్మచర్యం లాంటి నియమాలతో ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. తెల్లవారుజామున నిద్రలేచి సూర్యోదయానికి ముందు చన్నీటిస్నానం చేయటంవలన మనోచైతన్యం కలుగుతుంది. నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. సోమరితనం వదిలిపోతుంది. చెడు ఆలోచనలకు దూరంగా సన్మార్గానికి మళ్లించే జీవనం మొదలవుతుంది. ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతాయి. దిగుళ్లు దూరమై తేటగా, తేలికగా ఉంటుంది. రెండుపూటలా దుస్తులు మార్చడం ద్వారా పరిశుభ్రత అలవడుతుంది. నేలమీద పడుకుంటే వెన్నునొప్పికి ఉపశమనం కలుగుతుంది. రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ మెరుగవుతుంది.

సామూహికంగా పూజలు, ఆలయ సందర్శనలు, ఒకరి ఇళ్లకు ఒకరు (కనీసం ఐదుగురు) భిక్షకు (భోజనానికి) వెళ్లడం ద్వారా సమ భావన, సంఘజీవనం, క్రమశిక్షణ, సర్దుకుపోయే గుణం, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే స్వభావం వృద్ధి అవుతాయి. మితభాషణం వల్ల సమయం వృథా కాదు. వివాదాలు చోటుచేసుకోవు. ఆలోచనా సామర్థ్యం, ఏకాగ్రత మెరుగవుతాయి.

గంధం, విభూతి ఎందుకు?

మెడలో రుద్రాక్షలు రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అదుపులో ఉంచుతాయి. తులసిమాల నుంచి వచ్చే సుగంధం రోగనిరోధకశక్తిని పెంచుతుంది. స్ఫటిక, తామర, పగడాల మాలలతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విభూతితో ముఖ వర్ఛస్సు పెరగటమేగాక ధైర్యం, బలం చేకూరతాయి. కనుబొమల మధ్యనుండే సుషుమ్ననాడి జ్ఞానాన్నిస్తుంది. దానిని ఉత్తేజితం చేసేందుకే గంధం, కుంకుమ ధరిస్తారు.

నల్లటి దుస్తులెందుకు?

నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది. నరదృష్టి దోషాన్ని నివారిస్తుంది. అయ్యప్ప భక్తులు నల్లని వస్త్రాలు ధరించి, మణిమాలలు వేసుకుని దీక్ష ప్రారంభిస్తారు. శనీశ్వరుడికి నలుపు ఇష్టం. నల్లటి దుస్తులు ధరించి నిత్య పూజలో పాల్గొనేవారిపై దుష్ప్రభావాలు ఉండవంటారు. శాస్త్రీయంగా చూస్తే చలికాలంలో నల్లని దుస్తులు శరీరానికి వేడినిస్తాయి.

ఆహారనియమాల అంతరార్థం

ఏకభుక్తం, మితాహారం, శాకాహారం వలన కోరికలు అదుపులో ఉంటాయి. ఊబకాయం రాదు. గుండెజబ్బులకు రక్షణ కలుగుతుంది. శరీరం, మనసు చురుకుగా ఉంటాయి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల జేబులకు చిల్లు పడకపోవడమే కాదు, పెను రోగాల నుంచి కూడా కాపాడుకోవచ్చు.


అయ్యప్ప మాల.. శాస్త్రీయత

దీక్ష వెనుక దాగి ఉన్న శాస్త్రీయత ఏమిటంటే... ఏడాదికి సుమారుగా 360 రోజులు. దానిని తొమ్మిదితో భాగించగా వచ్చేది నలభై. ఆ మండల కాలం కఠిన నియమాలను అవలంభిస్తే, అది మిగిలిన జీవితానికి ఆదర్శవంతంగా నిలుస్తుంది. నియంత్రణ, నిగ్రహాలు అలవడతాయి. నిరాడంబర జీవితం ప్రారంభమవుతుంది. సకల జీవుల్లో దేవుడున్నాడనే భావనతో ఆధ్యాత్మిక చింతనే శాశ్వతమన్న నమ్మకంతో.. మాల ధరించిన భక్తులు అందరిలో దైవాన్నే చూస్తారు. ఆధ్యాత్మికతను పెంచి ఆరోగ్యాన్ని సంరక్షించే నియమాలను అవలంబించాక, ఇక ఆ సద్భావనలను జీవనపర్యంతం ఆచరించాలన్నదే దీక్ష ఉద్దేశం.

- ఎం.మహతీ రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని