రాముని సన్నిధే సుఖమన్న రాగబ్రహ్మ

సుమధుర కీర్తనలతో శ్రీరామచంద్రుని చరణాలను అర్చించి తరించిన భాగవతోత్తముడు సద్గురు త్యాగరాజు. తన స్వరవిన్యాసంతో కర్ణాటక సంగీతానికే సొబగులద్దిన నాదబ్రహ్మ ఆ రాగాల రారాజు. తాను సిసలైన మహానుభావుడు అయినా

Updated : 20 Jan 2022 04:19 IST

(త్యాగరాజస్వామి 175వ ఆరాధన ఉత్సవాలు.. జనవరి 18 నుంచి 22 వరకు)

సుమధుర కీర్తనలతో శ్రీరామచంద్రుని చరణాలను అర్చించి తరించిన భాగవతోత్తముడు సద్గురు త్యాగరాజు. తన స్వరవిన్యాసంతో కర్ణాటక సంగీతానికే సొబగులద్దిన నాదబ్రహ్మ ఆ రాగాల రారాజు. తాను సిసలైన మహానుభావుడు అయినా ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు’ అనగలిగిన వినమ్రత ఆయనది. పారమార్థిక ఆనందాన్ని మించి మరే ప్రాపంచిక ఆడంబరాలనూ ఆశించని ధన్యజీవి ఆ ‘త్యాగ’ధనుడు. అందుకే శతాబ్దాలు గడిచినా ఆ సంగీతసామ్రాట్టు సంకీర్తనలు నేటికీ వసివాడని స్వర పారిజాతాలై పరిమళిస్తున్నాయి.

రమపదమైన రామపాదం ఎదుట ప్రాపంచిక సంపదలన్నీ తృణప్రాయమని భావించి ‘నిధి చాల సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా?’ అంటూ ఆలపించిన నిరాడంబరత ఆ వాగ్గేయకారుడి పెన్నిధి. భక్తరామదాసు, పురందరదాసు, నారాయణ తీర్థుల కీర్తనలు, జయదేవుని అష్టపదులు, తల్లి జోలపాటలుగా పాడుతుంటే, బాలత్యాగరాజు పొత్తిళ్ల నుంచే ఆలకించి తనలో స్వరజ్ఞానాన్ని మేలుకొలిపారు. చిన్నతనంలోనే ‘నమో నమో రాఘవాయ’ అనే కీర్తనతో శ్రీరాముని స్వరార్చనకు శ్రీకారం చుట్టారు.

తల్లి సీతమ్మ నుంచి స్వరజ్ఞానాన్ని పుణికి పుచ్చుకున్న త్యాగరాజు తండ్రి రామబ్రహ్మం నుంచి సారస్వత అభిరుచిని అలవరచు కున్నారు. నాన్న నిత్యం పారాయణం చేసే రామాయణ, భాగవతాలకు ఆకర్షితుడైన త్యాగబ్రహ్మం భక్తిగ్రంథాలను ఔపోసన పట్టారు. పోతన తెలుగు భాగవతాన్ని ఆ భక్తాగ్రేసరుడు రోజూ పఠించి పరవశించి పోయేవాడట. అలా భగవద్భక్తికి తోడు ఆ నాదబ్రహ్మ భావనాశక్తి తోడై కాలాంతరంలో మధుర వాగ్గేయకారుడుగా ప్రసిద్ధుడయ్యారు.

సంగీతమూర్తిత్రయంలో ఒకరై శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితుల సరసన ఆసీనుడయ్యాడు. నాటికీ, నేటికీ ఆ నాదోపాసకుడి స్వరరాగ గంగాప్రవాహంలో ఓలలాడని సంగీతాభిమానులు, సాహిత్యాభిమానులు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే ‘త్యాగరాజ స్వామి అతి నిరాడంబరుడు, నిగర్వి. ఆయన భగవద్గీత, ఉపనిషత్తుల్లో ఉన్న సత్యాలను సరళమైన భాషలో శక్తిమంతంగా తెలియజెప్పారు. భక్తి ద్వారా భగవంతునికి చేరువకావటం ఎంత సులువో నిరూపించారు’ అన్నారు ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్‌.

తారకమంత్రంతో తాదాత్మ్యం

త్యాగరాజస్వామి తొలినాళ్ల నుంచి పూర్తిగా రామచంద్ర ప్రభువుకు దాసానుదాసుడు. రామనామమే మధుర సుధారసంగా భావించే త్యాగయ్య, అనన్య సామాన్యమైన రీతిలో ఆ తారకమంత్రాన్ని జపించారు. ఒక సిద్ధుని ఆదేశం మేరకు తొంభై ఆరు కోట్లసార్లు రామమంత్రాన్ని జపించారు. ఆ భక్తశిఖామణి తిరువాయూరులోని పంచనదీశ్వర దేవాలయ మండపంలో గంటల తరబడి తారకమంత్రాన్ని జపించే వారట. తన బలము, బలగమూ కూడా ఆ రామచంద్రమూర్తే అనుకున్నారు. ‘గ్రహబలమేమి, శ్రీరామానుగ్రహబలమే బలము’ అనటమే కాదు, ‘తేజోమయ విగ్రహమును ధ్యానించే వారికి నవగ్రహ బలమేమి’ అన్న ధీమా వ్యక్తం చేశారు. కష్టాలైనా, సుఖాలైనా ఆ కోదండరాముడి మహాప్రసాదాలే అనుకునేవారు.

మధురకీర్తనల్లో మనోనిగ్రహం

త్యాగరాజస్వామి తన కీర్తనల్లో మనసుకు ఎన్నో సుద్దులు కూడా నేర్పారు. మనోనిగ్రహం లేకుండా చేసే పూజలు, వ్రతాల వల్ల ఎలాంటి ఫలితం ఉండదని ఉద్ఘాటించారు. మనసు శుద్ధమైనప్పుడే ఆధ్యాత్మిక సాధనలు ఫలిస్తాయని తన కీర్తనల ద్వారా ప్రబోధించారు. ఆ భావనతోనే ‘మనసు నిల్ప శక్తిలేకపోతే, మధుర ఘంట విరుల పూజేమి జేయును?’ అని ఎద్దేవా చేశారు. మనసును తన అధీనంలో పెట్టుకున్నవారికి ఎలాంటి మంత్రాలతోనూ, మహిమలతోనూ పనిలేదని విస్పష్టం చేశారు. అందుకే ‘మనసు స్వాధీనమైన ఆ ఘనునికి, మరి మంత్ర తంత్రము లేల?’ అని నిర్మొహమాటంగా ప్రశ్నించారు. అలాగే భగవంతుని నామసంకీర్తనంతో ఇహపర శుభాలన్నీ కలుగుతాయని మనసుకు హితవు చెబుతూ ‘రాగసుధారసపానము జేసి రాజిల్లవె ఓ మనసా! యాగయోగ త్యాగభోగ ఫలమొసంగె..’ అంటూ ఆలపించారు ఆ సద్గురువు!

మహర్షి మెచ్చిన మహానుభావుడు

ఓ సారి ప్రసిద్ధ సంగీత కళాకారిణి రమణ మహర్షి వద్దకు వచ్చారు. సందర్భవశాత్తూ ‘అయ్యా! త్యాగరాజస్వామి సంగీతసాధన ద్వారా భగవంతుణ్ణి చేరుకున్నారు కదా! నేను కూడా వారిని అనుసరించవచ్చా? వారికి లాగానే నాకు కూడా పరమ పురుషార్థ సిద్ధి అవుతుందా?’ అనడిగారు. అప్పుడు రమణులు ‘త్యాగరాజు వంటి మహానుభావులు పాటలుపాడి పొందలేదు. పొందిన దానిని పాడారు. అందువల్లనే ఆ సంగీతం సజీవంగా ఉంది, శాశ్వతత్వాన్ని ఆపాదించుకుంది’ అన్నారు. అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితికి చేరుకొని, సిద్ధించిన ఆ అనుభూతిని కీర్తనలుగా ఆలపించారని మహర్షి మనోభావన.

పంచరత్నాలు.. ప్రాధాన్యం...

భారతీయ భక్తి సంప్రదాయంలో తమ ఆరాధ్య దేవతామూర్తులను స్తుతిస్తూ అయిదు కీర్తనల్ని కానీ, అయిదు శ్లోకాలని కానీ రచించటం ఆనవాయితీ. ముఖ్యంగా త్యాగరాజ స్వామి కాలంలో ఇటువంటి ‘పంచ రత్నాలు’ విశేషంగా ప్రచారంలో ఉండేవి. జనప్రియమైన ఈ సంప్రదాయాన్ని అనుసరించి త్యాగరాజు కూడా పంచరత్న కీర్తనల్ని రచించారు. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో పాడే ప్రసిద్ధ ఘనరాగ పంచరత్న కీర్తనలు ఇవే!

* జగదానంద కారక, జయజానకీ ప్రాణ నాయక...

* దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచునో...

* సాధించెనే ఓ మనసా...

* కన కన రుచిరా కనక వసన నిన్ను...

* ఎందరో మహానుభావులు అందరికీ వందనములు... త్యాగరాజస్వామి మహాసమాధి చెందిన పుష్య బహుళ పంచమి నాడు ఏటా ఘనంగా వారికి ఆరాధన ఉత్సవాలు జరగటం విశేషం.

- బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని