అర్ధాంగిని అమ్మవారిగా ఆరాధించి...

అది 1873వ సంవత్సరం. మే 25వ తేది. అమావాస్య. ఫలహారిణీ కాళికాదేవి పూజ నిర్వహించే రోజు. కోల్‌కతా దక్షిణేశ్వర కాళికాలయంలో విశేషపూజలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాక, రామకృష్ణ పరమహంస అర్ధాంగి శారదాదేవికి కబురుపంపారు. అందంగా తీర్చిదిద్దిన పీఠాన్ని ఆసనంగా అమర్చి, శారదాదేవికి సంజ్ఞ చేశారు. ఆమె పీఠంపై కూర్చొని పారవశ్య స్థితిలోకి వెళ్లారు. శాస్త్రోక్తంగా శారదాదేవిపై గంగాజలాన్ని చల్లి ‘సర్వశక్త్యాధీశ్వరీ, మాతా త్రిపుర సుందరీ’ తదితర నామాలతో స్తుతించారు. షోడశోపచారాలతో పూజించారు.  

Updated : 17 Feb 2022 00:47 IST

ఫిబ్రవరి 18 రామకృష్ణ పరమహంస జయంతి

ప్రచారం కోసం ఎన్నడూ ఆరాటపడకూడదు. పూవు అడవిలో వికసించినా తేనెటీగలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. అలాగే మన సౌశీల్యానికీ, ప్రతిభాపాటవాలకూ ప్రచారం అవసరంలేదు- అనేవారు రామకృష్ణ పరమహంస. అర్ధాంగి శారదాదేవిని సాక్షాత్తూ అమ్మవారిలా పూజించారు.

అది 1873వ సంవత్సరం. మే 25వ తేది. అమావాస్య. ఫలహారిణీ కాళికాదేవి పూజ నిర్వహించే రోజు. కోల్‌కతా దక్షిణేశ్వర కాళికాలయంలో విశేషపూజలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాక, రామకృష్ణ పరమహంస అర్ధాంగి శారదాదేవికి కబురుపంపారు. అందంగా తీర్చిదిద్దిన పీఠాన్ని ఆసనంగా అమర్చి, శారదాదేవికి సంజ్ఞ చేశారు. ఆమె పీఠంపై కూర్చొని పారవశ్య స్థితిలోకి వెళ్లారు. శాస్త్రోక్తంగా శారదాదేవిపై గంగాజలాన్ని చల్లి ‘సర్వశక్త్యాధీశ్వరీ, మాతా త్రిపుర సుందరీ’ తదితర నామాలతో స్తుతించారు. షోడశోపచారాలతో పూజించారు.  

రామకృష్ణుల జీవితం ఓ దివ్యజ్యోతి. ఆ తేజంలో సనాతన ధర్మ యథార్థ రూపం దర్శనమవుతుంది. ఆధ్యాత్మిక గ్రంథాలలో ప్రతిపాదించిన పారమార్థిక జ్ఞానానికి ఆయన ప్రత్యక్ష నిదర్శనం. తాత్త్వికులు, జగద్గురువుల బోధనలకు ఆచరణరూపం. అర్ధాంగిని అమ్మవారిగా ఆరాధించటం మొదలు అనన్య ఆధ్యాత్మిక సాధనల వరకు ఆయనది ప్రత్యేక స్థానం.

సన్యాసులకే కాదు సంసారులకూ మార్గదర్శి

ధనికులూ పేదలూ, పండితులూ పామరులూ- అందరికీ ఆచరణ యోగ్యమైన మార్గాలను సూచించారు పరమహంస. సర్వసంగ పరిత్యాగులకే కాదు సంసారులకూ మార్గదర్శిగా నిలిచారు. ప్రతి ఒక్కరిపైనా అపరిమిత వాత్సల్యాన్ని కురిపించేవారు. వారు దక్షిణేశ్వరంలో కాళికాలయ పూజారిగా ఉన్నప్పుడు భక్తులు తండోపతండాలుగా వచ్చేవారు. రోజంతా సందర్శకుల సందేహాలను నివృత్తి చేసేవారు. అలా విరామం లేని ప్రబోధాలతో ఆరోగ్యం శిథిలమైంది. గొంతులో వ్రణం ఏర్పడి క్యాన్సర్‌గా పరిణమించినా లక్ష్యపెట్టలేదు. వైద్యులు, అభిమానుల ఆందోళన చూసి ‘ఇతరులకు సహాయం చేయటానికి ఇలాంటి వేల శరీరాలనైనా తృణప్రాయంగా అర్పిస్తాను’ అనేవారు.

పారమార్థిక ప్రయాణంలో ప్రయోగాలు

రామకృష్ణులు మొదట మానవతామూర్తిగా ప్రేమను పంచేవారు.  ఆసక్తిని, ప్రగతిని అనుసరించి అంచెలంచెలుగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేవారు. అదే ఆయన విశిష్టత. ప్రతి ఒక్కరూ తమలోని దివ్యత్వాన్ని ఆవిష్కరించుకునేలా పరోక్షంగా ప్రేరణనిచ్చారు. ‘ఎవరూ పాపులు కారు, అందరూ ఉత్తములే. ప్రయత్నిస్తే దివ్యత్వం భాసిస్తుంది. మట్టిలో పాతుకుపోయినంత మాత్రాన రత్నం రత్నం కాకుండా పోదు. వెలికితీయగానే కాంతులీనుతుంది’ అనేవారు. వారి జీవన ప్రయాణంలోని సంఘటనలు, సంభాషణల వెనక నిగూఢ పరమార్థం ఇమిడి ఉంటుంది. అందుకే మతాలతో ప్రమేయం లేకుండా ఎందరో పరమహంస ఆరాధకులయ్యారు!

సమత్వానికి సాకారం

‘గురుదేవులు రామకృష్ణ పరమహంస ప్రబోధాలతో కులమతాలు, స్త్రీ పురుషులు.. లాంటి తారతమ్యాలు అంతరించడం మొదలైంది’ అన్నారు స్వామి వివేకానంద. రామకృష్ణులు బాల్యం నుంచే అందరిపైనా అంతస్తులకు అతీతమైన ప్రేమను కనబరచేవారు. ప్రతి ఒక్కరూ భగవంతుని స్వరూపమే అనేవారు. తన ఉపనయన సమయంలో కుమ్మరి స్త్రీ నుంచి భిక్ష స్వీకరించారు. తను పసివాడుగా ఉన్నప్పుడు ఆమె కురిపించిన వాత్సల్యానికి అలా కృతజ్ఞత చూపారు. ఎలాంటి స్థాయీ భేదాలు లేకుండా అందరి ఇళ్లకూ వెళ్లేవారు. ప్రేమగా కలిసి తినేవారు. ‘భగవంతుణ్ణి విగ్రహంలో చూసి పూజించగా లేనిది, మనుషుల్లో దర్శించి గౌరవించటంలో తప్పేంటి?’ అనేవారు.

ప్రథమ పారమార్థిక అనుభూతి

ఏడేళ్ల వయసులో పరమహంస పశ్చిమ బెంగాల్‌లోని తన స్వగ్రామం కామార్పుకూర్‌లో వరిపొలాల గుండా ఒంటరిగా వెళ్తున్నారు. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. అప్పుడే కొంగల బారులు పోతున్నాయి. ఆ దృశ్యం చూసిన బాల పరమహంస భావపారవశ్యులై బాహ్యస్మృతి కోల్పోయారు. అదే తన తొలి అలౌకిక అనుభూతి అనేవారు.

తల్లి చాటు తనయుడిగానే

కాళికాలయంలో అమ్మవారిపై ఎంత ప్రేమ కనబరచేవారో, అమ్మ చంద్రమణీదేవిపై కూడా రామకృష్ణులు అంతే ప్రేమ చూపేవారు. దక్షిణేశ్వరంలో తనతో పాటే తల్లి ఉండేలా ఏర్పాటుచేశారు. చివరివరకూ ఆమెని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఒకసారి ఆయన తీర్థయాత్రలకు బృందావనం వెళ్లి, అక్కడే ఉండిపోదామనుకున్నారు. వెంటనే తల్లి గుర్తొచ్చి ‘అమ్మో! అమ్మను చూసుకోకపోతే! ఎలా?’ అనుకుని వచ్చేశారు. ఆమెకు చిన్న అనారోగ్యం చేసినా తల్లడిల్లేవారు. కన్నవాళ్లు గనుక బాధపడితే మనకు పురోగమనం ఉండదనేవారు.

ప్రబోధాల్లోనూ ప్రత్యేకత

దేవుడు ఎందుకు కనిపించడని ఓ శిష్యుడు అడగ్గా ‘అహంకారమే మనిషికీ భగవంతుడికీ మధ్య అడ్డంకి’ అన్నారు పరమహంస. పక్కనున్న వస్త్రాన్ని తనకూ అతడికీ మధ్య అడ్డుగా కట్టి ‘చూశావా! ఇద్దరం ఎదురుగానే ఉన్నా, ఈ తెర వల్ల ఒకర్నొకరు చూసుకోలేం. అలాగే అహంకారమనే అడ్డుతెర ఉంటే దేవుణ్ణి చూడలేం’ అన్నారాయన. అలా శిష్యుల సంశయాలను తేలిగ్గా నివృత్తి చేసేవారు. కానీ ‘మీరే మా గురుదేవులు’ అని ఎవరైనా అంటే రామకృష్ణులు వారించి.. ‘నేను ఎవరికంటే ఎక్కువ కాదు. ఎవరికీ గురువును కాను. భక్తుణ్ణి మాత్రమే’ అనేవారు. ‘బతికినన్నాళ్లూ నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడం ఆగిపోయిందంటే మరణించినట్లే’ అని చెప్పేవారు.

- చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని