భక్తి తోవ... జీవ సేవ

ఆరోజు చంద్రగ్రహణం. రోజుల పసిబాలుడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. బిడ్డ తల్లిదండ్రులతో సహా గ్రామ ప్రజలంతా ఆ రాత్రి హరినామ సంకీర్తనలో నిమగ్నమవుదామని సంకల్పించారు. భగవంతుణ్ణి స్మరించుకుంటే గ్రహణ దుష్పరిణామాలు తమపై పడవనేది వాళ్ల నమ్మకం.

Updated : 17 Mar 2022 02:46 IST

మార్చి 18 చైతన్య మహాప్రభువు జయంతి

ఆరోజు చంద్రగ్రహణం. రోజుల పసిబాలుడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. బిడ్డ తల్లిదండ్రులతో సహా గ్రామ ప్రజలంతా ఆ రాత్రి హరినామ సంకీర్తనలో నిమగ్నమవుదామని సంకల్పించారు. భగవంతుణ్ణి స్మరించుకుంటే గ్రహణ దుష్పరిణామాలు తమపై పడవనేది వాళ్ల నమ్మకం. అందుకే ‘హరిబోల్‌.. హరిబోల్‌’ అంటూ సంకీర్తన ఆరంభించారు. అంతే.. ఆ నామాన్ని వినగానే పిల్లాడు ఏడుపు మానేసి కేరింతలు కొట్టసాగాడు. అలా ప్రారంభమైన శ్రీహరి నామామృతపానం ఆ బాలుణ్ణి భక్తాగ్రేసరుడిగా మార్చింది. నామసంకీర్తనకు మూలపురుషుడు, ఎందరో భాగవతోత్తములకు మార్గదర్శకుడు అయ్యాడు. అలా భక్తి ఉద్యమాన్ని ఉధృతం చేసిన శ్రీకృష్ణ సంకీర్తనాచార్యుడే చైతన్య మహాప్రభువు. పరమాత్మను స్మరించటమే కాదు, ఆయన పుట్టించిన జీవులకు సేవ చేసుకున్నప్పుడే జన్మ ధన్యమవుతుందని ప్రబోధించిన వైతాళికుడాయన. చైతన్యుల ప్రధాన బోధ- నామే రుచి, జీవే దయ, వైష్ణవ సేవ. అంటే భగవన్నామాన్ని గ్రోలటం, సర్వభూత దయ, భగవత్‌ భక్తుల సేవ. ఈ నినాదం తదనంతర ఆధ్యాత్మికవేత్తలకు దారిదీపమై వెలిగింది.

చైతన్య మహాప్రభువుకు జన్మనిచ్చి వంగభూమి ధన్యమైంది. వారు 1486లో పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లా మాయాపూర్‌లో జన్మించారు. తండ్రి జగన్నాథ మిశ్రా పేద వైదిక బ్రాహ్మణుడు. తల్లి శచీదేవి ఆదర్శగృహిణి. ఆయన అసలు పేరు విశ్వంభరుడు. వేపచెట్టు కింద పుట్టడం వల్ల చిన్నతనంలో నిమాయ్‌ అని పిలిచేవారు. పదేళ్ల వయసులోనే చైతన్యుడు వ్యాకరణ, న్యాయ, తర్క, అలంకారాది శాస్త్రాల్లో గణనీయ పాండిత్యం గడించారు. పదిహేడో ఏట గయలో వైష్ణవ సన్యాసి నుంచి మంత్రోపదేశం పొందారు. కొన్నాళ్లకు సంస్కృత పాఠశాలను ప్రారంభించారు. ‘శాస్త్రాలు వాదానికి కాదు, వినయాన్ని పెంచి అంతర్ముఖులను చేయాలి. ఆత్మానందాన్ని కలిగించాలి’ అనేవారు. పెళ్లి చేసుకొని ఆదర్శగృహస్థుగానూ నిలిచారు. తదనంతరం కేశవ భారతి వద్ద సన్యాసం స్వీకరించి శ్రీకృష్ణ నామ సంకీర్తన ఉద్యమానికి శ్రీకారం చుట్టి చైతన్య పరచటంతో ఆయన్ను ‘చైతన్య మహాప్రభువు’గా కీర్తించారు.

దక్షిణభారత పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం, మంగళగిరి ప్రాంతాల్లో పాదం మోపి తెలుగు నేలనూ పావనం చేశారు. సంకీర్తన, భజన సంప్రదాయాలను ఉద్యమంలా సాగించిన మహానుభావుడు చైతన్యుడే! కలియుగంలో ఆధ్యాత్మికోన్నతికి భక్తిమార్గమే సులువైన తోవ అన్నారు. మధురభక్తికి ప్రతీక అయిన రాధాదేవిలా కృష్ణభావ పరవశంతో సంచరించేవారు. కీకారణ్యాల్లోనూ కృష్ణనామ సంకీర్తనతో నృత్యం చేస్తుంటే క్రూరమృగాలు ఆనందపారవశ్యంతో నర్తించేవట. నిర్మల భక్తితో మనసులోని కాఠిన్యం, క్రూరత్వం తొలగిపోతాయని నిరూపించారు. విగ్రహపూజ, భగవంతుడి సేవ, సత్సంగం, భాగవత శ్రవణం, పుణ్యక్షేత్ర సందర్శనం.. ఈ నియమాలను అనుసరించినప్పుడే భజనకు బలమొస్తుంది, సంకీర్తన సాఫల్యతనిస్తుంది అనేవారు. భజన, నామసంకీర్తనలు బాహ్య పటాటోపాలు కాకూడదు. భావంలోనూ అవి ప్రతిఫలించాలనేవారు. దేవుని స్మరించినపుడు తనువూ, మనసూ పులకించాలన్నారు.

నయనం గలదశ్రు ధారయావదనం
గద్గద రుద్ధయా గిరా?
పులకై ర్నిచితం వపుః కదాతవ
నామ గ్రహణే భవిష్యతి?

‘హే గిరిధారీ! నీ నామస్మరణ చేస్తున్నప్పుడు నా నేత్రాలు అశ్రుధారతో నిండి స్వరం గద్గదంగా మారటం, శరీరం పులకించటం ఎప్పటికి సాధ్యమో!’ అంటూ శ్రీకృష్ణుని వేడుకున్నారు.

వినయం.. సహనం.. ఆధ్యాత్మికత

అహంకారాన్ని మించిన అథోగతి లేదు, అణకువే భక్తికి నిదర్శనం అంటూ ఉద్బోధించారాయన.

తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా?

అమానినా మానదేన కీర్తనీయః సదా హరిః?

తాను గడ్డిపోచ కన్నా తక్కువ అనేంత అణకువ, చెట్టుకున్నంత ఓర్పు ఉండి కపటం, ఆడంబరం లేనివాళ్లకే శ్రీహరిని భజించే అర్హత ఉంటుందన్నారు. వినయం, సహనం- ఇవే పారమార్థిక ప్రగతికి ప్రతీకలన్న చైతన్యులు అలాగే ఉండేవారు.

కర్తవ్య నిర్వహణా భక్తే

చైతన్యులు పూరీలో ఉన్న కాలంలో ఒడిశాను ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు. ఆయన పాలనాదక్షుడు, శాస్త్ర మర్మజ్ఞుడు, విద్వాంసుడు. చైతన్యులకు పరమ భక్తుడు. ఒక రోజు ‘మహాత్మా! నా సామ్రాజ్యం, సిరిసంపదలు మీ నుంచి దూరం చేస్తాయంటే వాటినిప్పుడే వదులుకుంటాను’ అన్నాడు. చైతన్యులు నవ్వి ‘రాజా! బాధ్యతల నుంచి తప్పించుకోవటం సరికాదు. కర్తవ్య నిర్వహణ కూడా భక్తిలో భాగమే’ అన్నారు.

చైతన్యుల పరంపరలో పరమహంస...

చైతన్యులు శ్రీకారం చుట్టిన సంకీర్తన సంప్రదాయాన్ని రామకృష్ణ పరమహంస పునరుజ్జీవింపచేశారు. వారు చెప్పినట్లు జీవులపై దయ, భక్తుల సేవ, నామ సంకీర్తనం అనుసరణీయమన్నారు. ఆయన జన్మించిన నవద్వీప్‌ను సందర్శించి, ‘చైతన్యులవారి జ్ఞానం సూర్యతేజస్సు అయితే, ఆయన భక్తి చల్లటివెన్నెల’ అన్నారు. పరమహంస సత్సంగం కోసం ఎవరింటికి వెళ్లినా చైతన్యుల సంకీర్తనలను పాడించుకునేవారు! ఇక వివేకానంద ‘గోపికలకు మల్లేనే వారి కృష్ణప్రేమ అపారం. ఆ భక్తి ప్రవాహంలో పండితులు, పామరులు, ధనికులు, దీనులు, హిందువులు, ముస్లింలు- అనే భేదం లేకుండా అందరూ తరించారు’ అంటూ చైతన్యులను ప్రశంసించారు.

- బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని