పంచుకునే పండుగ ఈదుల్‌ ఫిత్ర్‌

రంజాన్‌ నెలంతా దైవచింతనతో గడిపినవారికి అల్లాహ్‌ అందించే గొప్ప కానుక ఈదుల్‌ ఫిత్ర్‌! ఈదుల్‌ ఫిత్ర్‌ ముస్లిములకు సంతోషకరమైన దినం.   రంజాన్‌ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న దైవదాసుల హృదయాలు అల్లాహ్‌కు ఆ కృతజ్ఞతను వెలిబుచ్చుకోవడానికే ఈద్‌ నమాజు. పండుగ నమాజుకంటే ముందే చేసే దానాన్ని ఇస్లామీ పరిభాషలో ఫిత్రా అంటారు. రంజాన్‌ పండుగను ఈదుల్‌ ఫిత్ర్‌ అంటారు. ఫిత్రా నుంచి వచ్చిందే ఈదుల్‌ ఫిత్ర్‌. ఇది పేదల హక్కుగా ప్రవక్త నిర్ణయించారు. స్తోమ....

Updated : 28 Apr 2022 04:33 IST

రంజాన్‌ నెలంతా దైవచింతనతో గడిపినవారికి అల్లాహ్‌ అందించే గొప్ప కానుక ఈదుల్‌ ఫిత్ర్‌! ఈదుల్‌ ఫిత్ర్‌ ముస్లిములకు సంతోషకరమైన దినం. రంజాన్‌ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న దైవదాసుల హృదయాలు అల్లాహ్‌కు ఆ కృతజ్ఞతను వెలిబుచ్చుకోవడానికే ఈద్‌ నమాజు. పండుగ నమాజుకంటే ముందే చేసే దానాన్ని ఇస్లామీ పరిభాషలో ఫిత్రా అంటారు. రంజాన్‌ పండుగను ఈదుల్‌ ఫిత్ర్‌ అంటారు. ఫిత్రా నుంచి వచ్చిందే ఈదుల్‌ ఫిత్ర్‌. ఇది పేదల హక్కుగా ప్రవక్త నిర్ణయించారు. స్తోమత గల ప్రతీ ఒక్కరూ దానం చేయాలంటారు ప్రవక్త (స). 

పండుగనాడు ఇలా...
* వేకువనే లేచి మిస్వాక్‌ పుల్లతో దంతధావనం చేయాలి.
* తలంటుకుని అత్తరు జల్లుకోవాలి.
* ఈద్‌ నమాజుకు ముందు తీపి పదార్థం లేదా బేసి సంఖ్యలో ఖర్జూరాలు తినాలి.
* రెండున్నర కిలోల గోధుమల విలువను లెక్కగట్టి ఆ డబ్బును నిరుపేదలకు దానం చేయాలి.

పవాసవ్రతంలో తెలిసో తెలియకో చేసిన తప్పిదాలకు పరిహారమే ఫిత్రా దానం. తమ అవసరాలకు పోనూ ఎవరిదగ్గరైతే డబ్బు నిలువ ఉంటుందో వారంతా సదఖే ఫిత్ర్‌ చెల్లించాలని ఉలమాలు చెబుతున్నారు. ఉపవాసాలు చేసినా, చేయకున్నా ఫిత్ర్‌ చెల్లించాలి. అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముదుసలి వరకూ అందరి పేరునా లెక్కగట్టి ఇంటి యజమాని ఫిత్ర్‌ దానం చేయాలి. పండుగ కంటే రెండు రోజుల ముందే ఇచ్చేస్తే పేదసాదలు కూడా పండుగకు అవసరమైనవి కొనుక్కుని సంతోషంగా నమాజులో పాల్గొనగలుగుతారు. మరీ ముందే ఇస్తే ఆ డబ్బు ఖర్చయి పండుగ చేసుకోలేరు.

ఫిత్రా ఎవరికివ్వాలి?

రెండున్నర కిలోల గోధుమలు లేదా బియ్యం, ఖర్జూరాలు లేదా దాని విలువకు సరిపడా డబ్బును అందించాలని ప్రవక్త (స) చెప్పారు. ఇలా ఇంట్లో ఎందరుంటే అంత లెక్కగట్టి దానం చేయాలి. ఫిత్రా ఒకే కుటుంబానికైనా లేదా ఎందరికైనా దానం చేయొచ్చు. వితంతువులు, అభాగ్యులు, నిరుపేదలు ఫిత్రా దానానికి అర్హులు. తమ దగ్గరి బంధువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటుంది ఖురాన్‌. ఫిత్రా సొమ్ము సంక్షేమ కార్యక్రమాల కోసం కాదని చెబుతారు ఉలమాలు.

ప్రవక్త ఔదార్యం

ముహమ్మద్‌ ప్రవక్త ఈద్గాహ్‌కు బయల్దేరారు. దారిలో ఏడుస్తున్న పిల్లాణ్ణి చూసి ‘పండుగపూట ఎందుకేడుస్తున్నావయ్యా?’ అనడిగారు. ‘నాకు అమ్మానాన్నా లేరు. పండుగ పూట తొడుక్కోవడానికి కొత్త బట్టలు లేవు’ రోదిస్తూనే చెప్పాడు. ప్రవక్త ‘అమ్మానాన్న లేరని బాధపడకు, నీకు నేనున్నాను’ అనగానే పిల్లాడు చిరునవ్వు చిందించాడు. కొత్తబట్టలు కొనిచ్చి, నమాజ్‌కు తీసుకెళ్లారు. తర్వాత ఇంటికి తీసుకెళ్లి ‘ఇక నుంచి ఆయెషాను అమ్మగా, నన్ను నాన్నగా భావించు’ అన్నారు. పిల్లాడిలో దుఃఖాన్ని పోగొట్టి నవ్వులు పూయించారు. అంటే మనకు చేతనైనంతలో అభాగ్యుల కన్నీళ్లు తుడవాలని ప్రవక్త ఇలా ఆచరించి చూపారు.

- ఖైరున్నీసాబేగం


కారుణ్యం కోసమే కఠోర శిక్షణ

సహర్‌, ఇఫ్తార్‌, నమాజ్‌, జకాత్‌... రంజాన్‌ మాసంలో వినిపించే ఈ నియమావళి జీవన సార్థకతకు ఉపకరించే ఆధ్యాత్మిక సంపద.

స్లాం ఆధ్యాత్మిక సందేశం ప్రకారం- పేదలు, అనాథలు, వితంతువులు, వికలాంగుల పట్ల సానుభూతి చూపాలి. వారికి సహాయం చేయాలి. ఈ ధర్మాచరణకు రంజాన్‌ మాసం గొప్ప అవకాశం కల్పిస్తుంది. జీవితంలో ఏది సాధించాలన్నా క్రమశిక్షణ అవసరం. అందుకు దోహదం చేస్తుందీ పర్వదినం.

రంజాన్‌ నెలలో పాటించే కఠోర ఉపవాస దీక్షల వలన ఆకలి/ఆహారాల ప్రాధాన్యత అందరికీ అర్థమవుతుంది. ప్రతిరోజు జరిగే ఖురాన్‌ ప్రత్యేక పఠనం ద్వారా ఇస్లాం ప్రతిపాదించే విలువల పునశ్చరణ జరుగుతుంది. చెడు చూడకు, వినకు, చేయకు- అనే నైతికత అబ్బుతుంది.

రంజాన్‌ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో ఖర్చులు పోను మిగిలిన ఆదాయంలో 2.5 శాతం జకాత్‌ పేరుతో దానం చేస్తారు. దీని వలన సమాజం పట్ల బాధ్యత అలవడుతుంది. రంజాన్‌ మాసంలో సూర్యోదయం కాకముందే తిని, సూర్యాస్తమయం వరకు ఉపవసించడం, శారీరక వాంఛలు, రాగద్వేషాలకు దూరంగా ఉండటం- వీటితో క్రమశిక్షణ, నిగ్రహశక్తి, శాంతియుత జీవనం అలవడతాయి. ఈ కఠోర దీక్షలు కరుణ, మానవతా విలువలను పెంచే శిక్షణగా ఉపకరిస్తాయి. రంజాన్‌ మాసం ముగిసిన తర్వాత వచ్చే షవ్వాల్‌ మాసం మొదటి రోజున ముస్లింలు ‘ఈద్‌-ఉల్‌-ఫిత్ర్‌’ జరుపుకుంటారు. పండుగ రోజున చేసే ప్రత్యేక ప్రార్థన సాధారణంగా పెద్ద మైదానంలో (ఈద్‌గా) జరుగుతుంది. ఇక్కడ పిల్లలు, పెద్దలు, పేద, ధనిక, జాతి, రంగు- అనే తేడా లేకుండా అందరూ వరుసలలో పరస్పరం భుజం భుజం కలిసేంత దగ్గరగా ఉండి నమాజు చేస్తారు. ప్రార్థన తర్వాత ఒకర్నొకరు ప్రేమగా ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆనక ఇంటికెళ్లి తియ్యటి షీర్కూర్మ సేవిస్తారు.  ఇలా పర్వదినాన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పాయసంతో ఆతిథ్యమిచ్చి ఆనందాలు పంచుకుంటారు. ఇలా సమతామమతలను పంచే పండుగ రంజాన్‌.

- డాక్టర్‌ ఎం.ఎ.మాలిక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని