అంతశ్శత్రువే లక్ష్యం.. విశ్వశాంతికదే మంత్రం

ప్రపంచ దేశాలింకా కన్ను తెరవక ముందే బ్రహ్మ ముహూర్తంలో ‘శాంతి రేవ శాంతిః’ అంటూ శాంతికి కూడా శాంతి కలగాలని జపించే తత్త్వంతో మన సనాతన ధర్మం నిత్య నూతన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అందుకే ప్రపంచ దేశాల్లో ఎక్కడ శాంతి స్థాపన కావాలన్నా మన ధర్మమే

Updated : 12 May 2022 06:05 IST

యుద్ధం వ్యర్థమని శాంతే జీవన పరమావధి కావాలని నిరంతరం తపించే కర్మభూమి, ధర్మభూమి మన భారతావని. ఎప్పుడు యుద్ధం జరిగినా దాని వల్ల నష్టమే కానీ లాభం నలుసంత ఉండదు. యుద్ధానికి విరుగుడు శాంతిమంత్రమే.

ప్రపంచ దేశాలింకా కన్ను తెరవక ముందే బ్రహ్మ ముహూర్తంలో ‘శాంతి రేవ శాంతిః’ అంటూ శాంతికి కూడా శాంతి కలగాలని జపించే తత్త్వంతో మన సనాతన ధర్మం నిత్య నూతన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అందుకే ప్రపంచ దేశాల్లో ఎక్కడ శాంతి స్థాపన కావాలన్నా మన ధర్మమే గుర్తొస్తుంది. దాన్నే మన ఆధునిక కవులూ ప్రబోధిస్తున్నారు. మార్క్సిజం ప్రభావంతో కవిత్వం రాసిన మహాకవి శ్రీశ్రీ కూడా... 

ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ ఒక జాతిని వేరొక జాతీ పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? 

ఇకపై సాగదు ఏ యుద్ధం ఎందుకు జరిగెనో ఏ రాజ్యం ఎన్నాళ్లుందో తారీఖులు, దస్తావేజులు 

ఇవి కావోయ్‌ చరిత్రకర్థం 

అంటూ ఎలుగెత్తి చాటారు.

కొందరు నాయకులకు చరిత్ర సృష్టించాలన్న తపన ఉంటుంది. కానీ చరిత్ర అంటే యుద్ధాలూ, ఆ తేదీలూ కాదు. శాంతియుతమైన పాలన అందివ్వటమే అసలైన చరిత్ర. మన రుషులు శాంతి దాంతితో కూడి ఉండాలనడం వెనుక నాయకులకు ఇంద్రియ నిగ్రహం ఉండితీరాలన్నదే ఉద్దేశం. 

భారతీయంలో శత్రువులెవరైనా ఉన్నారంటే అది మనలో ఉండే అంతర్గత శత్రువులే. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలే మనకు శత్రువులన్నది వేద కాలం నుంచి ఉన్న సనాతన ధర్మ భావన. అంతే కాదు అహింసా పరమోధర్మః అని ప్రబోధించి చీమకు కూడా హాని తలపెట్టొద్దని మన ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. జైన, బౌద్ధ మతాల సారమూ అదే.

ఇక్కడో విషయాన్ని గమనించాలి. శాంతచిత్తంతో అహింసాధోరణిలో ఉండటమంటే చేతకానితనం కాదు. ‘అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తదైవచ’ అన్నారు. ధర్మాల్లోకెల్లా ఉత్తమం అహింస. అయితే ధర్మోద్ధరణ కోసం చేసే హింస కూడా అంతే ఉత్తమం- అనేది శ్లోక భావం. ఆ ప్రకారమే రామ రావణ యద్ధం, కురుక్షేత్ర సంగ్రామం, ఇంకా ముందుకెళితే జగన్మాత చేసిన రాక్షస సంహారం లాంటివి కనిపిస్తాయి. అసలు మనకు ఆయుధాలు ధరించని దేవుళ్లు లేరు. అంతమాత్రాన వారంతా హింసా వాదులు కాదు కదా! దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నది దైవ లక్షణం. శూర్పణఖను లక్ష్మణుడు ముక్కూ చెవులూ కోసి బుద్ధి చెప్పటం, తాటకి, పూతన లాంటి రాక్షసులను కృష్ణుడు సంహరించి మోక్షం ప్రసాదించటం ధర్మోద్ధరణ నేపథ్యంలో జరిగిన సంస్కరణ పూర్వక హింసలు. సోదరుడని తెలిసి కూడా, ధర్మ రక్షణ కోసం కర్ణుణ్ణి అర్జునుడు  సంహరించాడు. ఇలా ఉంటుంది మన భారతీయ ధర్మం. ధర్మానికి దెబ్బ తగులుతున్నప్పుడు అధర్మాన్ని నిర్మూలించేందుకు కత్తి దూశారే తప్ప అనవసర హింసకు దిగొద్దంటారు.

కలహ మగుట లక్ష్మిఁ గావించుఁ బ్రాణహా 

నియును జేయు నింత నిక్కువంబు 

పలువు రొకని కోడి పాఱుట బల్లిదు 

లనదచేతఁ జెడుటయును ఘటించు 

గెలిచే సత్తా ఉన్నా.. యుద్ధం వద్దంటూ ‘యుద్ధం జరిగితే గెలిచేదెవరో, ఓడేదెవరో ఎవరూ చెప్పలేరు. జరిగేది మాత్రం ప్రాణ హాని, ధన నష్టం’ అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెప్పిన తీరు శాంతి కాముకులందరి మాటగా కనిపిస్తుంది. 

జయమగు నోడుదు మను నిశ్చయ మొక్కఁడు లేదు వినుము! సమరమునఁ బరా 

జయము మరణంబు కంటె హృదయపుట భేదనము సేయుఁ తథ్యం బనఘా! 

యుద్ధంలో ఓడిపోతే ఆ పరాజయం మరణం కంటే బాధాకరమైంది అంటాడు ధర్మరాజు. అందుకే ‘యుద్ధం జోలి మనకొద్దు, విశ్వశాంతిని మరవొద్దు’ అంటుంది భారత ధర్మం. ఈ విషయాన్నే దాశరథి కృష్ణమాచార్యులు 

ఆ చల్లని సముద్ర గర్భం చాచిన బడబానలమెంతో

మానవ కల్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో 

రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో 

కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ..

అంటూ ప్రశ్నలోనే సందేశమిస్తూ యుద్ధంలో గెలిచినా మిగిలేది విషాదమే అనే సందేశాన్ని సూచించి యుద్ధవిముఖతను ప్రకటించారు. భారతీయ సమాజం ఎంత శాంతి కాముకమంటే- తాను మాత్రమే శాంతిని పొందాలన్న స్వార్థం కాక సృష్టిలోని అణువణువూ శాంతి మయం కావాలన్న తపన ఉంటుంది. శాంతి స్థాపన లక్ష్యంగా సాగుతుంది.       

ఓం ద్యౌః శాంతిః అంతరిక్షః శాంతిః పృథివీ శాంతిః ఆపా శాంతిః 

ఔషధయః శాంతిః వనస్పతయః శాంతిః విశ్వే దేవాః శాంతిః 

బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతి రేవః శాంతిః సామాః 

శాంతిరేదిః ఓం శాంతిః శాంతిః శాంతిః

..అన్నది శాంతిమంత్రం. 

స్వర్గలోకం, దేవలోకం, ఆకాశం, అంతరిక్షం, భూమి, జలం, భూమిపై ఉన్న ఓషధులు, వనమూలికలు, అన్ని లోకాలలోని బ్రహ్మాది దేవతలు, సర్వ జనులు శాంతితో ఉండాలన్నది ఈ శాంతి మంత్ర భావన. అంతే కాదు శాంతికే శాంతి కలగాలని కోరుకోవటం ఎంత శాంతి ప్రియత్వమో గమనించవచ్చు. యుద్ధం చెయ్యదలుచుకుంటే అంతశ్శత్రువులూ, అరిషడ్వర్గమూ అయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో యుద్ధం చేసి విజయ చిహ్నంగా శాంతిని పొందమని సూచిస్తారు.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని