ఆధ్యాత్మిక తరంగం.. సామాజిక న్యాయం

మన భారతీయం విశ్వ గురువయ్యింది అందుకే. ఆ ఒక్క విషయంతోనే. అది తెలుసుకోగలిగితే దేశంపట్ల భక్తి, ప్రేమ, విశ్వాసాలు ఉప్పొంగుతాయి. మన గురుపరంపర ఆ అంతరంగ సూత్రాన్ని సదా ప్రబోధిస్తూండేది అందుకే. అదే పురాణేతిహాసాల్లో సారం.

Updated : 12 Jun 2022 17:51 IST

మన భారతీయం విశ్వ గురువయ్యింది అందుకే. ఆ ఒక్క విషయంతోనే. అది తెలుసుకోగలిగితే దేశంపట్ల భక్తి, ప్రేమ, విశ్వాసాలు ఉప్పొంగుతాయి. మన గురుపరంపర ఆ అంతరంగ సూత్రాన్ని సదా ప్రబోధిస్తూండేది అందుకే. అదే పురాణేతిహాసాల్లో సారం. అదే ఈనాడు సర్వత్రా వినిపిస్తున్న సామాజిక న్యాయమనే సూత్రం. కాలక్రమంలో స్వార్థం పెచ్చుమీరినప్పుడు, ఆ ఆర్షవాణిలోని వాస్తవాలను తెలియజెబుతూ సమాజాన్ని జాగృతం చెయ్యటాన్ని బాధ్యతగా భావించారు మహర్షులు. ఒక్కసారి ఆ గురుబోధలు ఎలా ఉన్నాయని తేరిపార చూస్తే బుద్ధి తరిస్తుంది. న్యాయం కళ్లముందు ఆవిష్కృతమవుతుంది.

అంతమంది గురువులు, రుషులు మన చెవిన ఇల్లు కట్టుకుని పోరుతున్నా ఆ మాటలను ఆలకించకపోవటమే అవగాహనా రాహిత్యం. వాటిని గనుక తెలుసుకుంటే, సామాజిక న్యాయం గురించి మనవాళ్లెప్పుడో చెప్పారు కదా అనిపించక మానదు. ఆశీర్వచన వేళలోనో, శుభ సమయాల్లోనో కొన్ని శాంతి మంత్రాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి.

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః

సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్‌ దుఃఖమాప్నుయాత్‌

ఓం శాంతిః శాంతిః శాంతిః

అందరూ సంతోషంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. శుభాలనే అనుభవించాలి. ఎవ్వరూ బాధపడకూడదు. ఇదీ శాంతి మంత్ర సారం. సామాజిక న్యాయ సూత్రం.

స్వస్తిప్రజాభ్యః పరిపాలయన్తాం

న్యాయేన్‌ మార్గేణ మహీం మహిశాః

గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం

లోకాః సమస్తాః సుఖినోభవన్తు

ఓం శాంతిః శాంతిః శాంతిః

ప్రజలు క్షేమంగా ఉండాలి. పాలకులు సన్మార్గంలో పరిపాలించాలి. గోవులకు, వేదపండితులకు శుభం కలగాలి. జీవులన్నీ సంతోషంగా ఉండాలి- ఇదీ మంత్ర సారం. ఈ శాంతి కాంక్ష మరేదో కాదు, సామాజిక న్యాయమే.

అంతరాలొద్దు...

మనుషుల మధ్యన అంతరాలొద్దు. అంతా ఒక్కటే. అందరినీ ఒకేలా చూడమన్నదే సామాజిక న్యాయ సూత్రం. దీన్ని జగద్గురువు ఆదిశంకరాచార్యులు మనీషా పంచకంలో వివరించారు. అదొక్కటి చాలు.. మన పెద్దలు సామాజిక న్యాయానికిచ్చిన స్థానం అర్థంకావడానికి. వేదవేదాంగాలను అభ్యసించిన యోగి, సన్యాసి ఆదిశంకరులు ఓసారి గంగానదిలో స్నానం చేసి తిరిగొస్తుండగా.. ఒక వ్యక్తి మురికి బట్టలతో నాలుగు కుక్కలను వెంటబెట్టుకుని ఎదురొస్తున్నాడు. శిష్యులు ‘స్వామివారొస్తున్నారు, పక్కకి తప్పుకో’ అని ఆ వ్యక్తిని హెచ్చరించినా అతడు వినిపించుకోలేదు. శంకరులు ఆశ్చర్యపోయి అడ్డు తప్పుకోమంటే.. ‘తమరు అడ్డు తొలగమన్నది నా దేహాన్నా? నాలోని పరమాత్మనా?’ అనడిగాడు. దాంతో సాక్షాత్తూ పరమశివుడే తన ఎదుట ఉన్నాడని, తనకు జ్ఞానోదయం కలిగించడానికే అలా వచ్చాడని గ్రహించి, ఈశ్వరుని స్తుతిస్తూ చదివిందే మనీషా పంచకం.

ప్రతి జీవిలోనూ పరమాత్ముడున్నాడని, సాధనతో ఎవరైనా ఉన్నతత్వాన్ని, ఉత్తమ గతులను పొందవచ్చని, ప్రతి జీవీ ఆ పరమాత్ముని స్వరూపమేనని చెబుతూ ఆదిశంకరులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. మనుషుల మధ్య అంతరాలు వద్దని అంతరంగ శుద్ధితో చెప్పటం అక్షరం అక్షరంలో నిక్షిప్తమైన సామాజిక న్యాయ సూత్రమే.

గుణమే ప్రధానం

‘న జాతిః కారణం లోకే గుణే కల్యాణ కారకః’ అన్నారు భగవద్రామానుజాచార్యులు. పుట్టుక, కులం కారణంగా లోకానికి ఏ ప్రయోజనమూ చేకూరదు. గుణగణాల వల్లనే లోక కల్యాణం సాధ్యమవుతుందని భావం. గురువు తనకు ఉపదేశించిన అష్టాక్షరీ మంత్రాన్ని గుడి గోపురమెక్కి అందరికీ వినిపించిన మానవతా మూర్తి. నదీ స్నానం తర్వాత నిమ్న కులస్థులు అనబడేవారి భుజాలపై చేతులు వేసుకుని రావడం ద్వారా మత సామరస్యాన్ని చాటిన సమతామూర్తి. కుల, మత, వర్గ భేదాలొద్దని ఔన్నత్యాన్ని చాటిన దివ్యమూర్తి రామానుజులు. అణగారిన వర్గాల్లో వైష్ణవ మత ప్రచారం కోసం వారి నుంచే దాసరులను తయారుచేసి, ధర్మ ప్రచారకులుగా నియమించారాయన.

అంతా ఒక్కటే...

బ్రహ్మ మొకటే.. పర బ్రహ్మ మొకటే..

కందువగు హీనాధికము లిందు లేవు

అందరికి శ్రీహరే అంతరాత్మ

ఇందులో జంతుకుల మంతా ఒకటే

అందరికీ శ్రీహరే అంతరాత్మ

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే

అండనే బంటు నిద్ర - అదియు నొకటే

మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే

చండాలుడుండేటి సరిభూమి యొకటే

దిన మహోరాత్రములు - తెగి ధనాఢ్యున కొకటే

వొనర నిరుపేదకును ఒక్కటే అవియు

కడు పుణ్యులను - పాప కర్ములను సరి గావ

జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే

అంటూ అన్నమయ్య చెప్పిన ఈ కీర్తన ఒక్కటి చాలు.. మనుషుల్లో అంతరాలు, భేదాలు అనవసరమని తెలుసుకోడానికి.

అలాగే సంత్‌ సూరదాస్‌ చెప్పిన

నర్‌ అపనీ కరనీకరే

నరసీ నారాయణ హోయ్‌

గీతంలో కర్తవ్యాన్ని నిర్వహించేవారంతా మాధవులేనంటూ ఉద్బోధించడంలోనూ సామాజిక న్యాయ సంబంధ అంశ ధ్వనిస్తుంది. జీవుల మధ్య అంతరాలకు తావు లేదు. ఎవరూ అధికులు కానీ, అధములు కానీ కాదు. చరాచర సృష్టిలోని సకల జీవరాశి ఆ పరమాత్మ స్వరూపం. భక్తులంతా భగవంతుని దృష్టిలో సమానులే. భగవత్‌ కృపకు అందరూ అర్హులే. జన్మతో, జాతితో ఎవరూ గొప్పవారు కాదు. ఆధ్యాత్మికత ద్వారానే సామాజిక సద్భావన, సమరసత సాధ్యమవుతుంది. ఇలా మన గురుపరంపరలోని మహనీయులు నేటికీ మార్గదర్శకంగా, జీవనయానానికి వెలుగునిచ్చే ఎన్నెన్నో నీతులను వివరించారు. అలా నడచుకుంటే అన్యాయానికీ అవినీతికీ తావే ఉండదు. అప్పుడు సామాజిక న్యాయం దానంతటదే వర్ధిల్లుతుంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని