చెట్టు పుట్ట గట్టు మట్టికి మొక్కుదాం 

జ్యేష్ఠమాసం శుద్ధ షష్ఠినాడు మహిళలు మాంగల్యసిద్ధి కోసం ‘వనగౌరీ దేవతా వ్రతం’ చేసే ...

Updated : 06 Jun 2019 00:04 IST

మీ కోసం 
ఈనెల 8 వనగౌరీ వ్రతం

జ్యేష్ఠమాసం శుద్ధ షష్ఠినాడు మహిళలు మాంగల్యసిద్ధి కోసం ‘వనగౌరీ దేవతా వ్రతం’ చేసే సంప్రదాయం ఉంది. ఈ వ్రతం ఇళ్లలో కాకుండా.. వనాలలో, పంట పొలాలలో, ఊరి చెరువుగట్టున చేయటం ఆచారంగా వస్తోంది. వృక్షాలను, వనాలను దేవతామూర్తులుగా భావించి పూజించటం ఇందులోని ఆంతర్యం. 
ఆనాడు మహిళలు వ్రతం ఆచరించాడనికి తమ భర్త, పిల్లలతో కలిసి తోటకో, వ్యవసాయ క్షేత్రానికో, సరోవరతీరానికో వెళ్తారు. అక్కడ ఒక చెట్టు నీడలో వేదిక ఏర్పాటు చేసి, దానిపై పసుపుతో చేసిన గౌరీ దేవతను ప్రతిష్ఠించి ఆవాహనం చేస్తారు. ఏదైనా చెట్టుకొమ్మను కూడా అక్కడ ఉంచి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరిస్తారు. అక్కడే పొంగళ్లు వండి వనదేవతకు పూజానంతరం నివేదన చేస్తారు. ప్రసాదాన్ని కుటుంబసభ్యులంతా కలిసి స్వీకరిస్తారు. ధాన్యాలమ్మ, పోలాలమ్మ, కుంకుళ్లమ్మ, నూకాలమ్మ మొదలైన పేర్లతో ఈ వనదేవతను వ్యవహరిస్తారు. ఆమెను సస్యదేవత అని, కేదారదేవత అని కూడా పిలుస్తారు. అలా ఆ వనదేవతలను వనగౌరిగా భావించి చేసేది ‘వనగౌరీ వ్రతం’. 
తొలకరి ప్రారంభంలో సకాలంలో వర్షాలు కురిపించి, సస్యసమృద్ధిని ప్రసాదించవలసిందిగా వనగౌరిని ప్రార్థిస్తారు. అమ్మవారికి చీర, సారె, పసుపుకుంకుమలు, గాజులు, పువ్వులు, కాటుక, అద్దం, దువ్వెన సమర్పించే ఆచారం కూడ కొన్ని  ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ ‘వనగౌరీ వ్రత’ ఫలంగా వనదేవతల అనుగ్రహంతో ఆ ఇంట ధాన్యసమృద్ధి పుష్కలంగా ఉంటుందని, ఏడాది పొడవునా అతిథి అభ్యాగతులకు చక్కగా సేవ చేయగలుగుతారని, వ్రతం ఆచరించిన ఇల్లాలికి సౌభాగ్యం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని