పంచుకున్నదే పెరుగుతుంది!

సర్వాంభూతీ భగవంత... సర్వజీవుల్లోనూ భగవంతుడున్నాడు అని బోధించడమే కాదు, ఆచరించి చూపాడు శిరిడీ సాయిబాబా నవ విధ భక్తి మార్గాలతో పాటు సమానత్వాన్ని, సామాజిక బాధ్యతలనూ ఆయన చాటారు....

Published : 03 Oct 2019 00:32 IST

సమర్ద సద్గురు


సర్వాంభూతీ భగవంత... సర్వజీవుల్లోనూ భగవంతుడున్నాడు అని బోధించడమే కాదు, ఆచరించి చూపాడు శిరిడీ సాయిబాబా నవ విధ భక్తి మార్గాలతో పాటు సమానత్వాన్ని, సామాజిక బాధ్యతలనూ ఆయన చాటారు.


బోధించడానికి ప్రతివారికీ వేర్వేరు పద్ధతులుంటాయి. సాయినాథులు భక్తులకు శిక్షణనిచ్చే తీరు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. వారి అర్హతలనుబట్టి, పారమార్థిక చింతనా స్థాయిని బట్టి ఆయన వారికి బోధించేవారు.


ప్రతి ఆదివారం శిరిడీలో పెద్ద సంత జరుగుతుంది. పెద్ద ఎత్తున నిత్యావసరాల క్రయవిక్రయాలు జరుగుతుండేవి.
ఓ ఆదివారం సంత జరిగే సమయంలో బాబా దగ్గరకు వందలాది మంది భక్తులు వచ్చారు. మాధవరావు, వామనరావు, గోపాలరావు బుట్టీ తదితరులు ఆయన పక్కనే నుంచుని ఉన్నారు. ఇంతలో ఓ భక్తుడి కోటు మడతల్లోంచి కొన్ని శనగ గింజలు గలగలా రాలి కింద పడ్డాయి.
దీంతో అందరి దృష్టీ ఆ భక్తుడిపై పడింది. వెంటనే బాబా నవ్వుతూ ‘ఇతనికి ఒక్కడే తినడం అలవాటు. ఈ రోజు సంత రోజవడం వల్ల శనగలు తిని వచ్చాడు. కానీ ఎవ్వరికీ పంచకుండా తినడం అనే అలవాటు ఎప్పుడూ మంచిది కాదు..’ అన్నారు. వెంటనే ఆ భక్తుడు కన్నీటి పర్యంతమవుతూ ‘అయ్యో! బాబా నేను తినే సమయంలో నా పక్కన ఎవ్వరూ లేరు... ఏం చేసేది’ అని అన్నాడు.
బాబా అతన్ని అనునయిస్తూ...‘నీ చుట్టూ ఎవరూ లేకున్నా ఇంద్రియాధిష్ఠాన దేవత, పంచ ప్రాణాలు, గార్హపత్యాది పంచాగ్నులు గమనిస్తూనే ఉంటాయి. పంచ భూతాత్మకమైన ఈ చరాచర విశ్వంలో ప్రతిదీ అందరిదీ. నలుగురితో పంచుకోవడంలోనే ఉన్నతి ఉంటుంది. అతిథులను వదిలి భోజనం చేసేవారికి అన్నదోషం తగులుతుంది’. అంటూ ఓ శాశ్వత తత్త్వాన్ని వెల్లడించారు.
దీన్ని వివరించేందుకు ఓ భాగవత కథను ఉదహరించారు బాబా ‘శ్రీకృష్ణుడు, సుదాముడు విద్యాభ్యాసం కోసం సాందీపని మహర్షి ఆశ్రమంలో ఉన్న రోజులవి. ఓ రోజు గురుపత్ని ఆజ్ఞతో అడవిలో దర్భల కోసం బయల్దేరారు. సుదాముడికి ఆమె కొన్ని శనగలిచ్చి ‘అరణ్యంలో తిరుగుతుంటే ఆకలేస్తుంది. అప్పుడివి తినండి’ అని చెప్పింది. కానీ ఈ విషయం సుదాముడు శ్రీకృష్ణుడికి చెప్పలేదు. అడవిలో ఆకలి, దాహంతో ఉన్న శ్రీకృష్ణుడు సుదాముడి తొడపై విశ్రాంతి కోసం ఒరిగాడు. ఆయన నిద్రపోతుండడం చూసి సుదాముడు రుషి పత్ని ఇచ్చిన శనగలను తినడం మొదలుపెట్టాడు.  
మెలకువ వచ్చిన కృష్ణుడు ‘సుదామా! ఏంటి తింటున్నావు?’ అని ప్రశ్నించాడు. అప్పుడు సుదాముడు ‘ఇక్కడ తింటానికి ఏముంది? చలికి పళ్లు టకటకమంటున్నాయి’ అన్నాడు. అప్పుడు సర్వానికి సాక్షి అయిన పరాత్పరుడు ఇలా అన్నాడు. ‘అవును నిజమే నాక్కూడా అలాంటి కలే వచ్చింది. అందులో ఒకరి వస్తువు మరొకరు తింటున్నాడు. అతన్ని మొదటి వాడు ఏమిట్రా తింటున్నావు? అని అడిగాడు. దానికతడు తినడానికేముంది? మట్టి! అన్నాడు. అదే సమయంలో వాగ్దేవత తథాస్తు అంది. దీంతో అతడు తినేదంతా మట్టయింది.’ సుదామా...ఇంతకు మునుపు నిన్ను నేను కలలో ఉండే అడిగాను... అన్నాడు. పరంధాముడి మాట ఊరికే పోదు కదా... సుదాముడు తీవ్రమైన దారిద్య్రాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన పిడికెడు అటుకులను తన స్నేహితుడైన శ్రీకృష్ణుడికి ప్రేమతో అర్పించి దారిద్య్రాన్ని పోగొట్టుకున్నాడు.
ఉన్నదేదైనా పంచినప్పుడే అది పెరుగుతుందని బాబా బోధ. 

 - జియో లక్ష్మణ్‌
(సాయిబాబా మహా సమాధి సందర్భంగా)

 


అవి రెండూ కావాలి..!

శ్రద్ధ ఉండే ఓర్పు నిలబడుతుంది. ఓర్పు ఉంటే పని శ్రద్ధగా జరుగుతుంది. అందుకే శిరిడీ సాయిబాబా ప్రతి ఒక్కరినీ శ్రద్ధ, ఓర్పు (సబూరి)తో ఉండాలని చెప్పేవారు. అవి రెండూ ఎక్కడుంటే తానక్కడ ఉంటాననేవారు. వాటిని బోధించడమే కాదు, ఆచరించి చూపేవారు. బాబా శ్రద్ధతో ఏర్పడిందే శిరిడీలోని లెండీ వనం. ఎంతో శ్రద్ధతో పచ్చి మట్టి కుండలను నింపి, తన భుజాలపై వాటిని మోసుకెళ్లి వనంలోని ప్రతి మొక్క పాదుకీ నీరందించేవారు.
అప్పుడు నన్నే ఆశ్రయించండి!  
ఇంద్రియాలు విషయ సుఖాల కోసం ఉబలాటపడినప్పుడు భక్తులు మొదట నన్ను స్మరించాలి. అప్పుడా విషయాలు మెల్లిగా నాకే అర్పణమైపోతాయి.  గురుచరణాలను ఆశ్రయించడమొక్కటే ఇంద్రియాలను జయించే మార్గం.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని