పాపపుణ్యాల లెక్కాపత్రం!

సృష్టిలోని 84 లక్షల జీవరాశుల చావు పుట్టుకలను నిర్దేశించే గ్రంథం చిత్రగుప్తుని చిట్టా అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ పుస్తకంలో ఆయా జీవరాశుల జనన, మరణాల సమయం కూడా ఉంటుందని పౌరాణిక కథనం.

Published : 17 Oct 2019 01:46 IST

ఈ నెల 29 చిత్రగుప్తు జయంతి

సృష్టిలోని 84 లక్షల జీవరాశుల చావు పుట్టుకలను నిర్దేశించే గ్రంథం చిత్రగుప్తుని చిట్టా అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ పుస్తకంలో ఆయా జీవరాశుల జనన, మరణాల సమయం కూడా ఉంటుందని పౌరాణిక కథనం. అసలు ఎవరీ చిత్రగుప్తుడు? ఎక్కడివారీయన?
చిత్రగుప్తుడి జననం, వంశం, విధి నిర్వహణ గురించి పలు పురాణాలు చెబుతున్నాయి. సృష్టి ఆదిలో ఆయువు తీరిన జీవులన్నీ పరలోకం చేరాయి. పాపపుణ్య విచారణలో యముడు తీవ్ర గందరగోళానికి గురయ్యాడు.  బ్రహ్మకు తన బాధను మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ ఆలోచిస్తూ సమాధి స్థితిలోకి వెళ్లిపోవడంతో 11 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు ఆయన శరీరం నుంచి నడుముకు ఒక కత్తి కట్టుకుని, కలం, కాగితాల కట్టను చేతుల్లో పెట్టుకుని ఒక దివ్యపురుషుడు ఉద్భవించాడు. బ్రహ్మ అతన్ని యమలోకంలో పద్దుల నిర్వహకుడిగా నియమించాడు. అతనే చిత్రగుప్తుడు.
ఇంకో కథనం ప్రకారం.. సూర్యవంశానికి చెందిన చిత్రుడు చాలా కాలం పాటు సూర్యుని ఆరాధించాడు. దానికి సంతోషించి సూర్యుడు సర్వజ్ఞత అనుగ్రహించాడు. ఆదిత్యుని అనుగ్రహాన్ని పొందినందున అతనికి చిత్రాదిత్యుడనే పేరు వచ్చింది. ఇలాంటి కార్యదక్షుడు తన దగ్గర ఉంటే బాగుంటుందని యముడు అనుకున్నాడు. చిత్రాదిత్యుడు సముద్ర స్నానానికి వెళ్లినప్పుడు యమదూతలను పంపి అతన్ని సశరీరంగా తనసదనానికి తెప్పించుకున్నాడు. గుప్తంగా తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున చిత్రాదిత్యుడికే చిత్రగుప్తుడనే పేరు వచ్చింది.

కార్తీక శుక్లపక్ష విదియను యమ ద్వితీయ అని స్మృతి కౌస్తుభం చెబుతోంది. ఇదే రోజు చిత్రగుప్త పూజను జరపాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో వ్యాపారులు చిత్రగుప్త పూజను నిర్వహిస్తుంటారు. దీపావళి తర్వాత రెండు రోజులకు వచ్చే భాయ్‌ దూజ్‌ (యమ ద్వితీయ) రోజున తమ ఆదాయ, వ్యయాల రికార్డులను చిత్రగుప్తుని పటం ముందు ఉంచి ప్రార్థిస్తారు. బిహార్‌లో జరిపే ఛత్‌ పూజ కూడా చిత్రగుప్తుడికి సంబంధించిందే. ఎర్రటి వస్త్రంపై కలం, సిరాబుడ్డి, కత్తి, ఖాతా పుస్తకాలను ఉంచి పూజిస్తారు. చిత్రగుప్త పూజలో పసుపు, తేనె, ఆవాలు, అల్లం, బెల్లం, చక్కెర, గంధం, సిందూరం సమర్పిస్తారు. కేతువు అనుగ్రహం కోసం ఓం శ్రీ చిత్రగుప్తే నమః అనే మంత్రాన్ని జపిస్తారు.

న్యాయదేవత...

జీవుల సంస్కారాన్ని అనుసరించి వారి పాపపుణ్యాలను లిఖించాలని, చిత్రగుప్తుని బ్రహ్మ ఆదేశించినట్లు బృహత్‌ బ్రహ్మ ఖండంలో ఉంది. యజ్ఞయాగాదుల్లో హవిర్భాగాలు కూడా చిత్రగుప్తునికి చెందుతాయని పద్మపురాణం పేర్కొంటోంది. న్యాయ దేవతగా కూడా ఆయనను అభివర్ణించారు. యమ సంహితలో అత్యంత బాధ్యతాయుత విధుల్లో యమునికి సహాయం చేస్తుంటాడని ఉంది. జీవుల పుట్టుక నుంచి మరణం దాకా ప్రతి చర్యనూ నిగూఢంగా పరిశీలించి  లిఖిస్తుంటాడు. శారీరక పాపాలతో పాటు మానసిక దోషాలను కూడా సంగ్రహించగలిగే అతీంద్రియ జ్ఞానం ఇతనికి ఉంది. చిత్రగుప్తుడు లెక్కతేల్చిన అనంతరం యమధర్మరాజు ఆ ఆత్మకు తగిన శరీరాన్ని నిర్ణయించి పునర్జన్మను  ప్రసాదిస్తాడు.

- డా.ఐ.సచ్చిదానందం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని