ఆనందానికి అది తోవ...

శివాలయానికి వెళ్ళినప్పుడు లింగరూపంలో ఉన్న పరమ శివుణ్ణి నేరుగా చూడరు. లింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి స్వామిని దర్శిస్తుంటారు.

Updated : 19 Dec 2019 05:01 IST

ధర్మ సందేహం

శివాలయానికి వెళ్లినప్పుడు శివలింగాన్ని నంది కొమ్ముల్లో నుంచి చూడాలంటారు ఎందుకు?

- రఘురాములు, హైదరాబాద్‌

శివాలయానికి వెళ్ళినప్పుడు లింగరూపంలో ఉన్న పరమ శివుణ్ణి నేరుగా చూడరు. లింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి స్వామిని దర్శిస్తుంటారు. ఇలా చూడటంలో గొప్ప అంతరార్థం ఉంది. శివుడి వాహనం నందీశ్వరుడు. నంది అంటే ఆనందించే వాడు, ఆనందం కలిగించే వాడని అర్థం. శివుణ్ణి రాతి ప్రతిమగా కాక, తేజోమయ ఆనందస్వరూపుడిగా దర్శించాలి. అందుకు సంకేతంగా శివుడికి నంది వాహనం ఏర్పడింది. శివుణ్ణి దర్శించటం అంటే ఆనందంగా ఉండటమే! ఇందులో మరో విశేషముంది. నందీశ్వరుడికే ‘వృషభం’ అని మరో పేరు. వృషం అన్నా, వృషభం అన్నా ఒకటే. ఈ పదానికి ‘ధర్మం’ అని అర్థం. నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి మాత్రమే శివలింగాన్ని చూడాలి అంటే నంది అనుమతితో శివ దర్శనం సాధ్యమవుతుందన్నమాట. ఆయన అనుమతి పొందడం అంటే ధర్మాన్ని ఆచరించడమే. ధర్మం తప్పని వారికి శివుడు కనిపిస్తాడని సారాంశం. ధర్మాచరణే శివుని అనుగ్రహప్రాప్తికి అర్హత. ఈ విషయాన్ని నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి చూడాలనే సంకేతం ద్వారా పెద్దలు మనకు తెలియజేస్తున్నారు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని