కాలమేవ జయతే!

కొత్త సంవత్సరం వచ్చేసింది...‘ఏం చేస్తావో చూస్తాను’ అని అశరీరవాణి ప్రతిధ్వనిస్తోంది.‘కాలాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను... ..

Updated : 02 Jan 2020 00:38 IST

కొత్త సంవత్సరం వచ్చేసింది...

‘ఏం చేస్తావో చూస్తాను’ అని అశరీరవాణి ప్రతిధ్వనిస్తోంది.

‘కాలాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను... జాగ్రత్త’ అని ఎవరో వాత్సల్యంతో తల నిమిరి చెబుతున్నట్లు అనిపిస్తోంది.

ఈ రెండు భావనలూ మన రెండు చేతులూ పట్టుకుని ముందడుగు వేయిస్తున్నాయి...

ఇది మన జీవితంలోకి వచ్చిన కొత్త సంవత్సరం కాదు... ఏడాది పాటు మన జీవితం.

దాన్ని సానుకూలంగా స్వాగతించాలి.

మంచో... చెడో...

నడకో... పరుగో...

స్పష్టమైన దర్శనంతో జీవితాన్ని గడపడం మొదలు పెట్టడానికి ఈ క్షణాలకు మించిన సమయం లేదు...


‘ఓ కొత్త ఆరంభం ప్రసరించే ప్రకంపనలు ఏడాదంతా చేతనంగా ఉండేలా చూసుకోవడమే విజయం’

ఇప్పుడేం చేయాలంటే...

 కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు... అన్నిటినీ మూటాముల్లే సర్దేసి, సరిహద్దు రేఖకు ఆవల వదిలేసి ముందడుగు వేయాలి.  


ప్రతిక్షణం, ప్రతి నిమిషం మనం అనుకున్నట్లుగా మలుచుకునే సాధనమవ్వాలి. మనం చేయాలనుకున్న పోరాటానికి ఆయుధమవ్వాలి.


 ఆగామి కాలం గొప్ప సంఘటనల సమాహారానికి వేదికవ్వాలి. మరిచిపోలేని వేడుకవ్వాలి. 


ఆగిపోయిన ఆలోచనల్ని ముందుకు సాగేలా చేయడానికి తరుణమిదే. కలల బూజు దులపాల్సిన సందర్భమిదే.


 బద్దకాన్ని నిర్దాక్షిణ్యంగా కొక్కేనికి తగలించాలి. గాయపడ్డ లక్ష్యాలకు మందురాసి ముందుకు తీసుకెళ్లాలి. 


నీరసపడిపోయిన నిర్ణయాలకు కొత్త ఉత్సాహానివ్వాలి. తీర్మానాల్ని తిరగరాయాలి.


ఒట్టి చేతులైనా గట్టి ఆయుధాలుగా మలుచుకుంటే ... సరైన సమయంలో, సరైన అవసరంలో ఓ చెయ్యి అందించడానికి కాలం సిద్ధంగా ఉంటుంది.

- గోపరాజు రాధాకృష్ణ

సమయం... శరణం...  గచ్ఛామి

బుద్ధుడి దగ్గరకు వచ్చే సాధకులు ఆయనను అనేక సందేహాలు అడిగేవారు. అన్నిటికీ ఆయన సంతృప్తికరమైన సమాధానాలు చెబుతుండేవారు.

‘భగవాన్‌! కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి?’ అనే ప్రశ్నకు బుద్ధుడు ఇలా సమాధానమిచ్చాడు.

మనిషి కాల చక్రభ్రమణాన్ని గమనించాలి. ప్రపంచంలో కాలంతో సమానమైన సంపద లేదు. మిగిలినవన్నీ స్వప్నంతో సమానం. అవన్నీ జ్ఞానోదయం కాగానే భ్రమలుగా అర్థమవుతాయి. తన స్వార్థం కోసమే జీవించే మనిషిని కాలం పట్టించుకోదు. క్రిమికీటకాల్లా ఎలాంటి గుర్తింపు లేకుండా మరణం అనే అగ్నిలో స్వార్థపరుడు దహించుకుపోతాడు. అందుకే మనిషి ఏది సత్యమో అర్థం చేసుకోవాలి. గొప్ప పనులతో జీవితాన్ని ధన్యం చేసుకోవాలి.


కాలానుగుణంగా వచ్చే అనేక మార్పులకు శరీరమే కాదు మనసు, బుద్ధి కూడా సిద్ధంగా ఉండాలి. ఒకప్పుడు శిరోధార్యమైంది... మరోకాలంలో వదిలేయాల్సిందవుతుంది. ప్రవాహంలాంటి ఈ మార్పులను తట్టుకుని నిలబడాలంటే ఆత్మస్థైర్యం ఉండాలి. ప్రపంచమనే నటనాలయంలో మనం పాత్రగా ప్రవర్తించాలి. అంతే తప్ప పాత్రగా మారిపోకూడదు.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని