ఆదివాసీల.ఆరాధ్య దీపం!

ప్రకృతి ఓ పాఠశాల. నాగరికత పుట్టుక, ఆచార, వ్యవహారాలు, సంప్రదాయాలు... అన్నీ అందులో అంతర్లీనమే...

Published : 09 Jan 2020 00:16 IST

జనవరి 22 వరకు జంగూబాయి జాతర

ప్రకృతి ఓ పాఠశాల. నాగరికత పుట్టుక, ఆచార, వ్యవహారాలు, సంప్రదాయాలు... అన్నీ అందులో అంతర్లీనమే. బతుకు, మెతుకు పోరాటంలో ప్రకృతినే దైవంగా భావించే ఆదివాసీల ఇంటి దీపం జంగూబాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ తెగలకు ఈ దేవతే ఆరాధ్యదైవం.

మ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం పాట పరందోళి- మహారాజ్‌గూడ అటవీ ప్రాంతంలో ఓ గుహలో జంగూబాయి ఓ దీపం రూపంలో కొలువై ఉంటుంది. సాక్షాత్తు శంకరుడే ఈ దేవతకు ఇక్కడి పెద్ద కొండలో జీవం పోశాడని నమ్ముతారు. ఆ దేవతను గురించి బయటి ప్రపంచానికి తెలియజేసిన పాండికుపార్‌ లింగో అనే భక్తుడి పేరును కూడా కలిపి ఈ దేవతను జై జంగో -జై లింగో అని పిలుస్తారు.

ఏటా ఫుష్యమాసంలో జంగూబాయికి జాతర జరుగుతుంది. పుష్య మాసంలో వచ్చే అమావాస్య మొదలుకొని మాఘమాస అమవాస్య వరకు ఈ జాతర కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా జరిగే గిరిజన జాతరలన్నిటికీ ఈ సంబరంతోనే అంకురార్పణ జరుగుతుంది. దాదాపు 750 రకాల తెగలకు సంబంధించిన పండగలకు, వేడుకలకు ఈ జాతర దిక్సూచి అవుతుంది. తుడుం మోతలు, సన్నాయి స్వరాలు, కట్టుబాట్ల మధ్య జరిగే ఈ జాతరలో నవీనపోకడలకు అస్సలు తావుండదు. అమ్మవారికి సమర్పించే... నైవేద్యం కూడా శాకాహారమే.

నెల రోజుల పాటు జరిగే ఈ జాతర దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగుతుంది. నియమ, నిష్టలతో ఎన్నో కష్టాలను ఓర్చుకుని ఇక్కడకు చేరుకునే భక్తులు దీపం రూపంలో ఉన్న అమ్మను శరణువేడి అక్కడి నుంచి బయల్దేరతారు.

- ఎం.మణికేశ్వర్‌, ఆదిలాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని