...నీదే యోగం!

అమెరికాలోని బోస్టన్‌ నగరం...అక్కడున్న అశేష జన సమూహాన్ని ఉద్దేశించి స్వామి వివేకానంద ప్రసంగిస్తున్నారు...

Published : 09 Jan 2020 00:22 IST

ఈనెల 12 స్వామి వివేకానంద జయంతి

అమెరికాలోని బోస్టన్‌ నగరం...

అక్కడున్న అశేష జన సమూహాన్ని ఉద్దేశించి స్వామి వివేకానంద ప్రసంగిస్తున్నారు. వారంతా శ్రద్ధాసక్తులతో వింటున్నారు.

ఇంతలో వారిలో ఒకరు లేచి ‘స్వామీ మీరు మీ ప్రసంగాలతో మమ్మల్ని హిప్నటైజ్‌ చేస్తున్నారు. ఏదో అవాస్తపు ప్రపంచంలోకి తీసుకెళుతున్నారనిపిస్తోంది.’ అన్నారు. అప్పుడు వివేకానంద వెంటనే ‘కాదు మిత్రమా! మిమ్మల్ని డీ హిప్నటైజ్‌ చేస్తున్నాను. ఈ పరిమితమైన సుఖాలే శాశ్వతమనే భ్రమలో మీరున్నారు. ఆ స్థితి నుంచి మిమ్మల్ని బయట పడేసేందుకు, సుఖ,దుఃఖాలకు అతీతమైన ఓ శాశ్వత సత్యాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాను.’ అన్నారు.

నిజం..

వివేకానంద భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేయడమే కాదు, గొప్ప ఆధ్యాత్మిక ఆచార్యునిగా మనిషిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారు. శ్రీకృష్ణుడు బోధించిన యోగాలను తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రతి మనిషిలో దివ్యత్వం ఉంది. దాన్ని అనుభూతిచెంది, అనుసరించడమే జీవిత పరమావధి. ఈ లక్ష్యసాధనకు భక్తి, కర్మ, జ్ఞాన, రాజ యోగ మార్గాల్లో కనీసం ఒక్కదాన్నయినా అనుసరించాలని అంటారు వివేకానంద.

భక్తి యోగం

గవంతుడి కోసం నిష్కల్మషమైన హృదయంతో చేసే అన్వేషణే భక్తి. ఒకసారి ఆ దివ్యశక్తిని ప్రేమించండి. ఆ శక్తికి శరణాగతులు కండి. ఇలాంటి భక్తి ఉన్నవారి హృదయం ప్రేమ మయం అవుతుంది. వారి మనసు ఎవరినీ ద్వేషించదు. నిత్యానందం, సంతృప్తి వారి సొంతం. ఇలాంటి భక్తిలో నిరంతరం ఉన్నవారిలో పరిపక్వత వస్తుంది. అహంకారం అడుగంటి పోతుంది. అప్పుడది పరమోన్నతమైన పరాభక్తిగా మారుతుంది. ఆ స్థితిలో ఉన్న భక్తుడు భగవంతుడికి అతి సన్నిహితుడు.

కర్మ యోగం

నం చేయాల్సిన పనులను వందశాతం నిమగ్నతతో చేయడమే కర్మయోగం. చేసిన పనిని బట్టి కాకుండా, పనిని చేసే తీరునుబట్టి దానికి, దాన్ని చేసిన వాళ్లకు ప్రాధాన్యం పెరుగుతుంది. కర్మను నిర్వర్తించి దాని ఫలితాన్ని పట్టించుకోకపోవడం ధీరుల లక్షణం. గుర్తిస్తేనో, గౌరవిస్తేనో సక్రమంగా పనిచేయడం బలహీనుల లక్షణం. యోగులు అనంతమైన కర్మను నిర్వర్తిస్తూ కూడా హృదయాంతరాళంలో అఖండమౌనాన్ని అనుభూతి చెందుతుంటారు.

జ్ఞాన యోగం

జ్ఞానం కోసం మనిషి స్తబ్దత నుంచి చైతన్య స్థితికి రావాలి. ఆ తర్వాత నిశ్చలత్వాన్ని సాధించాలి. అలాంటి నిశ్చల స్థితిలో బుద్ధి, ఇంద్రియాలను నియంత్రిస్తుంది. మనిషిలోని మానసిక శక్తులన్నీ ఏకాగ్రమవుతాయి. తద్వారా ప్రపంచంలోని విజ్ఞానమంతా ఆర్జించగలుగుతాడు. ఇలాంటి జ్ఞానం మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భయాన్ని పోగొడుతుంది. అలాంటి ఆత్మవిశ్వాసం ఉన్న కొద్దిమంది చరిత్రే ప్రపంచ చరిత్ర. ఇదే జ్ఞానయోగం.

రాజ యోగం

వివేకానంద వద్దకు ఓసారి ఓ యువకుడు వచ్చాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. స్వామి ఎదురుగా నుంచుని ‘నేను అన్నీ వదిలేసి సన్యాసం తీసుకుందామనుకుంటున్నాను. మీ సంఘంలో చేర్చుకోండి’ అన్నాడు.

అప్పుడు వివేకానంద ‘నాయనా! అసలు నీ దగ్గర ఏముంది వదిలేయడానికి? ముందు వాటిని ఆర్జించు. బలంగా తయారై, ఏదైనా సాధించి, చూపించు’ అన్నారు.

జీవితాన్ని సార్థకం చేసుకునే క్రమంలో దేహాన్ని, మనసును ఉపకరణాలుగా వినియోగించుకోవాలి. సక్రమమైన నియమాలతో వాటిని పటుత్వంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి. దిగులు కలిగించే ఆలోచనలకు తావివ్వ కూడదు. ఆహారం విషయంలో అతివృష్టి, అనావృష్టి పనికిరావు. మితిమీరి తినొద్ధు కఠిన ఉపవాసాలూ వద్ధు ఆహారం, నిద్ర, విహారాదుల్లో మధ్యే మార్గాన్ని అనుసరించాలి. తరచూ వచ్చే ఆలోచనలను నిరోధించడం ద్వారా మనసు బలోపేతం అవుతుంది. దీని వల్ల నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తి జాగృతమవుతుంది. ఇదే రాజయోగం.

-సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని