మూడు రాష్ట్రాల మురిపెం!

పోలమాంబ.. శంబరలో కొండదొరల కుటుంబంలో జన్మించిందని చెబుతారు. పుణ్యస్త్రీగా కన్నుమూయాలని భావించేది. అందుకే పెళ్లయిన వెంటనే శంబర సమీపంలో వనం గుడి వద్ద అవతారం చాలించిందని అంటారు....

Published : 23 Jan 2020 00:24 IST

పోలమాంబ.. శంబరలో కొండదొరల కుటుంబంలో జన్మించిందని చెబుతారు. పుణ్యస్త్రీగా కన్నుమూయాలని భావించేది. అందుకే పెళ్లయిన వెంటనే శంబర సమీపంలో వనం గుడి వద్ద అవతారం చాలించిందని అంటారు. ఆ తల్లి కోరిక మేరకు ఏటా జాతర నిర్వహిస్తారు. అమ్మను దర్శించుకుంటే కష్టాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం. శంబర, పరిసర గ్రామాల్లో సంక్రాంతి కన్నా వేడుకగా జాతరనే జరుపుకొంటారు. తోబుట్టువులను, బంధువులను ఇళ్లకు పిలుస్తారు.

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పోలమాంబ. విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో వెలసింది ఆ తల్లి. పల్లెసీమలో అమ్మ పండగ  మొదలైంది. సంక్రాంతి తర్వాత సరిగ్గా వారం రోజులకు పోలమాంబ జాతర ప్రారంభమవుతుంది. వారం పాటు జరిగే గిరిజన ఉత్సవానికి అశేష సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. వేడుకలో భాగంగా సాగే సిరిమానోత్సవాన్ని చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు శంబర తరలి వస్తారు. ఏటికేడు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ జాతరను పదివారాలు నిర్వహించాలని నిర్ణయించారు. శంబర పరిసరాల్లోని కవిరిపల్లి, తోటవలస, ఎస్‌ఆర్‌పురం, సీబిల్లి పెద్దవలస, బట్టి వలస తదితర ఊళ్లల్లో ముత్యాలమ్మ, బంగారమ్మ తదితర గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయా గ్రామాల్లో రెండు వారాలపాటు అమ్మవారి ఘటాలను ఘనంగా ఊరేగిస్తారు. శంబర జాతరలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించే ఉయ్యాల కంబాల, సిరిమానోత్సవం, అంపకోత్సవం అంగరంగ వైభవంగా సాగుతాయి.
- కొట్యాడ శివకృష్ణ

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని