విర్రవీగొద్దు!

గర్వాతిశయంతో విర్రవీగేవారు స్వర్గానికి అనర్హులు అని ప్రవక్త (స) బోధించారు. సాధారణంగా కేవలం...

Published : 30 Jan 2020 00:45 IST

ఇస్లాం సందేశం

‘గర్వం తలకెక్కితే ఖననవాటికవైపు ఒకసారి చూడు. అక్కడ నీలాంటి ఎంతోమంది మట్టిలో కలిసిపోయారు.’...

ర్వాతిశయంతో విర్రవీగేవారు స్వర్గానికి అనర్హులు అని ప్రవక్త (స) బోధించారు. సాధారణంగా కేవలం డబ్బున్న వారే గర్వాహంకారాన్ని ప్రదర్శిస్తారనే అపోహ ఒకటి ఉంది. మనిషిలో ఈ గర్వానికి పలు కారణాలను చెప్పారు. విద్య, దైవారాధన, ధనం, అధికారం, అందం, శారీరక దృఢత్వం గర్వానికి కారణమని చెబుతారు. విద్యాజ్ఞానాలు సాధించి ఎదుటి వారిని హీనంగా భావించడం గర్వానికి చిహ్నం. అందరికీ అందించడానికే విద్యను నేర్చుకోవాలని ఉలేమాలు చెబుతారు. చాలామంది దైవారాధన చేసేవారు కూడా తమంతటి గొప్పవారు లేరని గర్వపడతారు. విధిగా ఐదు పూటలా నమాజులు చేసి, ఖుర్‌ఆన్‌ చదివేవారిలోనూ ఈ గర్వం పొడసూపుతుంది. మనం చేసే ఆరాధనలు అల్లాహ్‌ మెప్పు పొందకపోతే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. ఒకసారి సుఫియాన్‌ సౌరీ (రహ్మాలై) తన కుమారుడితోపాటు పయన బృందంతో కలిసి ప్రయాణంలో ఉన్నారు. చీకటి పడింది. ప్రయాణబృందంలో అంతా నిద్రలోకి జారుకున్నారు. తండ్రీకొడుకులిద్దరూ తెల్లవారుఝామున లేచి నమాజు పూర్తిచేసుకున్నారు. అప్పుడు కుమారుడు ‘‘నాన్నా! వీళ్లను చూడండి ఎంత ఆదమరిచి నిద్రపోతున్నారో. ఒక్కడంటే ఒక్కడు కూడా లేచి నమాజు చదవలేదు’ అని కాస్తంత గర్వంతో చెప్పాడు. అప్పుడు తండ్రి ‘‘బిడ్డా! నమాజు చదవగానే అందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నావా? అయ్యో! నువ్వూ నిద్రలేవకుండా ఉంటే ఎంతబావుండేది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నెన్ని నమాజులు, మరెన్ని ఉపవాసాలు పాటించినా ఇతరులను తక్కువచేసి మాట్లాడకూడదు. మనం చేసే ఆరాధనలు, మంచి పనులు అల్లాహ్‌ స్వీకృతి పొందాలనే కోరిక మన మనస్సులో ఉండాలేగానీ విర్రవీగకూడదు.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని