‘సేవా’ మార్గం...జన్మధన్యం!

సంచార జీవితం గడిపే బంజారాలకు అద్భుత జీవన మార్గాలను బోధించి స్థిర నివాసం ఏర్పరచుకొనేలా చేసింది ఆయన... వారిలో చైతన్యాన్ని ఉద్దీపనం చేసి ఆధ్యాత్మిక చింతనవైపు అడుగులు వేయించిందీ ఆయనే....

Published : 13 Feb 2020 00:23 IST

నేటి నుంచి సంత్‌ సేవాలాల్‌ జయంత్యుత్సవాలు

సంచార జీవితం గడిపే బంజారాలకు అద్భుత జీవన మార్గాలను బోధించి స్థిర నివాసం ఏర్పరచుకొనేలా చేసింది ఆయన... వారిలో చైతన్యాన్ని ఉద్దీపనం చేసి ఆధ్యాత్మిక చింతనవైపు అడుగులు వేయించిందీ ఆయనే. అందుకే ఆయనను బంజారాలు భగవత్‌స్వరూపంగా భావిస్తారు. అవతార పురుషుడిగా, సామాజిక క్రాంతివీరుడిగా, తమ ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ఆయనే సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌. దేశంలోని 12 కోట్ల మంది బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌. ఈయన  అనంతపురం జిల్లా గుత్తి మండలం చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని రాంజీనాయక్‌ తండాలో 1739 ఫిబ్రవరి 15న జన్మించినట్లుగా భావిస్తారు. చెర్లోపల్లి పంచాయతీ పరిధిలో రాంజీనాయక్‌ తండా ఉండేది. అక్కడ భీమానాయక్‌, ధర్మిణిబాయి దంపతులకు సంత్‌ సేవాలాల్‌ మాతా జగదాంబ వరంతో జన్మించినట్లు బంజారాల విశ్వాసం. బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. పశుపోషణ కోసం దేశంలోని పలుప్రాంతాల్లో తిరుగుతూనే తనతో పాటు ఉన్న అందరికీ జీవన సూత్రాలను నేర్పేవారు. అహింసా మార్గాలను వివరించేవారు. ఆదర్శవంతమైన జీవనం గడిపేందుకు తండాలను స్థాపించారు. వ్యవసాయంపై అవగాహన, ధూమ, మద్యపానం వల్ల కలిగే అనర్థాలను సేవాలాల్‌ ప్రజలకు వివరించారు. జీవహింసకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సేవాలాల్‌ మహారాజ్‌ మహారాష్ట్రలోని రూయిగఢ్‌లో 1806 ఏప్రిల్‌ 4న తనువు చాలించారు. సేవాలాల్‌ జన్మస్థలానికి బంజారాలు సేవాగఢ్‌ అని నామకరణం చేసుకుని 2001 నుంచి జయంత్యుత్సవాలను నిర్వహిస్తున్నారు. ఏటా ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీ వరకు మూడ్రోజులపాటు ఇవి జరుగుతాయి.  
గుంతకల్లు, గుత్తి బస్‌స్టేషన్ల నుంచి 19 కి.మీ. దూరంలో సేవాగఢ్‌ ఉంది. ఇక్కడికి గుత్తి, గుంతకల్లు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు. రైల్వేస్టేషన్ల నుంచి కూడా ఆటోలు, బస్సు సౌకర్యం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి బంజారాలు ఇక్కడికి తరలివస్తారు. కొందరు భక్తులు సేవాలాల్‌ మాలలు ధరించి కాలినడకన ఇక్కడికి చేరుకుంటారు.

- పి.విజయ్‌, ఈనాడు, అనంతపురం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని