ఆ లోకంలో దాచుకోండి!

మదీనాలో అన్సారీ సహాబీకి చెందిన ఖర్జూరపు తోట అది. పండ్లతో నిండుగా ఉంది. అన్సారీ తన తోటలో ఒకసారి నమాజ్‌లో లీనమై ఉన్నారు. ఇంతలో యాదృచ్ఛికంగా ఆయన దృష్టి ఖర్జూర పండ్లపై పడింది..

Published : 27 Feb 2020 00:24 IST

ఇస్లాం సందేశం

మదీనాలో అన్సారీ సహాబీకి చెందిన ఖర్జూరపు తోట అది. పండ్లతో నిండుగా ఉంది. అన్సారీ తన తోటలో ఒకసారి నమాజ్‌లో లీనమై ఉన్నారు. ఇంతలో యాదృచ్ఛికంగా ఆయన దృష్టి ఖర్జూర పండ్లపై పడింది. దైవారాధనలో ప్రాపంచిక ఆలోచనలు ఆయనను ఉక్కిరిబిక్కిరిచేశాయి. ఆ ఆలోచనలతో నమాజ్‌ ఎంతవరకు చదివిందీ మర్చిపోయాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన అన్సారీ ఇక ఈ తోట తన దగ్గర ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అప్పటి ఖలీఫా హజ్రత్‌ ఉస్మాన్‌ (రజి) దగ్గరికెళ్లారు. ‘‘ఈ తోటను  నేను అల్లాహ్‌ మార్గంలో దానం చేస్తున్నాను. దీన్ని అమ్మగా వచ్చిన సొమ్మును మీరు కోరిన చోట వెచ్చించండి’ అని ప్రకటించాడు. హజ్రత్‌ ఉస్మాన్‌ (రజి) ఆ తోటను అమ్మగా వచ్చిన సొమ్మును పేదలకు పంపిణీ చేశారు.
పూర్వం ప్రవక్త సహచరులకు పరలోక జీవితంపై, దేవుని ప్రసన్నతపై ఉన్న శ్రద్ధ, చింతనను ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. వారు పరలోక జీవిత సాఫల్యమే శ్వాసగా బతికేవారు. ఇహ లోకంలో ఎన్ని కష్టాలనైనా సహించడానికి వెనకాడేవారు కాదు. ఎందుకంటే ఈ జీవితం తాత్కాలికమైంది, పరలోక జీవితం శాశ్వతమైందని వారి ప్రగాఢ విశ్వాసం.  వారిని నిత్యం పాపపుణ్యాల చింతన వెంటాడేది. దైనందిన జీవితాన్ని అనుక్షణం జవాబుదారీతనంతో గడిపేవారు. లౌకిక ప్రపంచంలో ఒక  బాటసారిలా జీవితాన్ని గడపమన్నారు ప్రవక్త మహనీయులు. ఈ ప్రాపంచిక జీవితం కార్యరంగం. పరలోకంలో కర్మలకు తావుండదు. అక్కడ ఎలాంటి భయాందోళనలు ఉండవు. ‘‘చిన్న ఖర్జూరపు ముక్కనైనా సరే  దానమిచ్చి మిమ్మల్ని మీరు నరకాగ్నినుంచి కాపాడుకోండి’ అని ప్రవక్త ప్రబోధించారు.
‘ఎవరి కర్మలకు వారే బాధ్యులు. దేవుడి వద్ద ఎవరూ సిఫారసు చేయలేరు. స్వయంగా నేను కూడా.’ అని ప్రవక్త (స) తన కుటుంబ సభ్యులను హెచ్చరించేవారు. పరలోక సాఫల్యమే పరమావధిగా బతకడమే నిజమైన విశ్వాసి లక్షణం.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు