యశోధీర!

అమ్మా ఆయన జేత వనంలో వేంచేశారట...అవునా... నా స్వామి అక్కడున్నారా?ఇప్పుడెలా ఉన్నారో...

Published : 05 Mar 2020 00:55 IST

అమ్మా ఆయన జేత వనంలో వేంచేశారట...

అవునా... నా స్వామి అక్కడున్నారా?

ఇప్పుడెలా ఉన్నారో...

పదేళ్ల ముందు... సిద్ధార్థుడిితో మనువు కుదిరినప్పటి జ్ఞాపకాలు యశోధరను ముప్పిరిగొన్నాయి.

తన తల్లి పమితా దేవికి మేనల్లుడే అయినా, స్వయానా బావే అయినా సిద్దార్ధుణ్ణి చూసింది చాలా తక్కువసార్లే...

‘అమ్మా! నీ బావ మహా అందగాడమ్మా... నీ అందానికి పోటీ వాడేనమ్మా... ఎంత సుకుమారుడో, అంత స్ఫురద్రూపి కూడా’...

పరిచారికలు చెబుతుంటే సిగ్గులమొగ్గే అయ్యేదాన్ని...

పెళ్లయ్యాక ఎంత బాగా చూసుకునేవాడనీ...

ఎంత ఆలించేవాడు... ఎంతలా పాలించేవాడు...

దుఃఖమయమైన ప్రపంచం కలవరపెడుతున్నా... వైరాగ్యభావనలు మనసును తొలిచేస్తున్నా తనకు తెలియనివ్వలేదు..

నా మనసు కష్టపడుతుందని తనను తాను సముదాయించుకునేవాడు తప్ప నా కంట నీరు రానివ్వలేదు.

కానీ కారణజన్ముడు కదా... ప్రపంచంలోని అజ్ఞానాంధకారాలను పటాపంచలు చేయడానికి ఉద్భవించిన తేజోమూర్తి కదా...

ఆ నిశిరాత్రి నన్ను వదిలి మౌనంగా సాగిపోయాడు...

ఇదిగో ఇన్నాళ్ల తర్వాత ఆయన గురించిన సమాచారం అందింది. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడంట...

నిర్నిద్రలో ఉన్న ప్రపంచాన్ని మేల్కొలుపుతున్నాడంట... కొత్త వెలుగులు పంచుతున్నాడంట...

..................................

ఒక్కసారి ఆయన దర్శనం చేసుకోవాలి...

ఆయనకు రాహులుణ్ణి చూపించాలి. ఇదిగో స్వామీ నీ వారసుడు అని చెప్పాలి. ముమ్మూర్తులా మీ పోలికలతో ఎదుగుతున్న ఆ బిడ్డను అప్పగించాలి.

అయినా... ఇప్పుడాయన నా స్వామేనా...బుద్ధుడయ్యాక అందరివాడు కదా...

ఇన్నాళ్ల తర్వాత చూస్తే నన్ను ఆదరిస్తాడా?

కన్నీళ్లతో కాళ్లు కడిగితే అనునయిస్తాడా?

బిడ్డను ప్రేమగా పలకరిస్తాడా?...

................................

జేతవనం...అక్కడ వందలాది మంది ఉన్నారు. కొందరు మామూలు వస్త్రాల్లో, మరికొందరు కాషాయ దుస్తుల్లో...

వారి మధ్యలో సన్నని దారి...

యశోధర అడుగులు వడివడిగా పడుతున్నాయ్‌...

అదిగో ఆ మామిడి చెట్టుకింద... ఆ స్వామే... నా స్వామే...

ఓ కాంతి గోళంలా... అఖండ మౌనంలా...

అనంత జ్ఞానానికి భౌతిక రూపంలా...

ఎదురుగా నిలుచుని తదేకంగా చూస్తున్న ఆమెను ‘చెప్పు యశోధరా...’ మృదువుగా అడిగారాయన.

వివశత్వంతో ఒక్క పెట్టున దుఃఖం తన్నుకువచ్చిందామెకు.

రాహులుడు మౌనంగా చూస్తున్నాడు...

బుద్ధుడిలో మాత్రం ఎలాంటి స్పందనా లేదు. ఘనీభవించిన మంచు శిల్పంలా....

ప్రభూ! ఆ రాత్రి అలా వెళ్లిపోయారు. మీమీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను... ఇప్పుడు నేనేం చేయాలి... అంది యశోధర.

కాసేపు మౌనంగా ఉన్న బుద్దుడు చిన్నగా గొంతు సవరించుకున్నాడు...

‘ఇప్పుడు నీ ముందున్నవాడు తథాగతుడు. సర్వ దుఃఖాలకు పరిష్కారం కనుక్కున్న బుద్దుడు. తథాగతుణ్ణి ఈ దేహంలో చూడకు. ఎందుకంటే ఈ దేహం అశాశ్వతం. శాశ్వతమైన సత్యపథానికి దూరంగా మనిషి బతుకున్నాడు. అతనికి సరైన మార్గం చూపించడానికి తథాగతుడు వచ్చాడు. నేనా కర్తవ్యానికి బద్ధుణ్ణి’...

యశోధరకు అర్థమవుతోంది...

తనముందుంది సత్యదర్శనం చేసిన భగవత్‌స్వరూపుడు.

యశోధరకు తెలుస్తోంది...

తన కర్తవ్యం తన స్వామి కర్తవ్యానికి సహకరించడం...

అనంతమైన ఆ తేజోమూర్తికి ప్రణమిల్లింది... రాహులుణ్ణి తీసుకుని మౌనంగా సాగిపోయింది.

తన త్యాగంతో విశ్వశాంతికి కొత్తతేజాన్ని తెచ్చింది.

-కె.రాఘవేంద్రబాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని