ఆత్మకు ఆహారం!

ఒక వ్యక్తి ఉదయం పూట ఒక మహనీయుడిని కలుసుకోవడానికి వెళ్లాడు. అప్పుడాయన ప్రార్థనలో ఉండటంతో ఆ వ్యక్తి అతన్ని కలుసుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోయాడు.

Updated : 12 Mar 2020 01:08 IST

ఇస్లాం సందేశం

క వ్యక్తి ఉదయం పూట ఒక మహనీయుడిని కలుసుకోవడానికి వెళ్లాడు. అప్పుడాయన ప్రార్థనలో ఉండటంతో ఆ వ్యక్తి అతన్ని కలుసుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోయాడు.

కాసేపటి తరువాత తిరిగి రెండోసారి వచ్చాడు. ఆ మహనీయుడు అప్పుడు కూడా దైవాన్ని ప్రార్థిస్తూనే ఉన్నారు. చేసేదేమీలేక తిరిగి వెళ్లిపోయాడా వ్యక్తి.

మూడోసారీ అలాగే జరిగింది. తరువాత వచ్చినప్పుడు ఆ మహనీయుడు ఇంట్లో తీరిగ్గా కూర్చుని ఉండటంతో హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడా వ్యక్తి. మాటల మధ్యలో ‘‘అయ్యా! నేను తమరిని కలవడానికి ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాను. మీరేమో ఎప్పుడూ తీరిక లేకుండా ఉన్నారు. అంతసేపు ప్రార్థన ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చా?’’ అని ఆసక్తిగా అడిగాడు.

దానికా మహనీయుడు ‘‘నేను నా ఆత్మకు ఆహారాన్ని తినిపిస్తున్నాను.’ అని అన్నారు. 

ఆ మహనీయుడు నేను దైవనామ స్మరణ చేస్తున్నానంటే ఒక్క మాటలో పోయేది. కానీ ఆయన అలా అనడానికి బదులు ‘నేను ఆత్మకు ఆహారం తినిపిస్తున్నాను’ అని చెప్పి దైవనామ స్మరణ ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. ఆహారం, నీరు అందకపోతే శరీరం ఎలా అల్లాడిపోతుందో అలాగే దైవనామస్మరణ చేయకపోతే హృదయం కూడా తల్లడిల్లుతుంది. ఇది మనిషి శరీరతత్వం. దైవాన్ని స్మరించని ఆత్మ నీరసపడిపోతుంది. అలాగే మనిషి హృదయానికి దైవనామస్మరణ కూడా అంతే అవసరం. మనం మన శరీర పోషణ, శారీరక ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధపెడతాం. ఎన్నో విలువైన పోషకాలను తీసుకుంటాం. ఆరోగ్యం కాస్తంత చెడిందంటే వైద్యుల దగ్గరకు పరిగెడతాం. అలాగే ఆత్మ వికాసం, మానసిక ఆరోగ్యం కోసం కూడా తపన పడాలంటారు ప్రవక్త. దైవనామ స్మరణతో ఆత్మకు ప్రశాంతత లభిస్తుందని ఖుర్‌ఆన్‌ నొక్కిచెబుతుంది.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు