ఆరు రుచులు ఆరు చక్రాలు!

ఉగాదిపచ్చడి షడ్రుచుల సమ్మేళనం. సంవత్సర కాలపరిమితిలో ఆరు రుతువులకు సంకేతంగా, మానవజీవితంలో వచ్చే అన్నిరకాల అనుభవాలకూ

Published : 19 Mar 2020 00:21 IST

ఉగాదిపచ్చడి షడ్రుచుల సమ్మేళనం. సంవత్సర కాలపరిమితిలో ఆరు రుతువులకు సంకేతంగా, మానవజీవితంలో వచ్చే అన్నిరకాల అనుభవాలకూ ప్రతీకగా ఉగాది ప్రసాదాన్ని భావిస్తారు. చేదు, తీపి, ఉప్పు, పులుపు, కారం, వగరు అనే ఆరు రుచులూ ఈ పచ్చడిలో ఉంటాయి. వేపపువ్వు, కొత్తబెల్లం, ఉప్పు, చింతపండు, మిరియాలు, లేతమామిడిముక్కలు కలిపి చేసిన ఈ ఉగాది ప్రసాదం ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలకు సంకేతమని చెబుతారు.

య ద్వర్షాదౌ నింబ సుమం

శర్క రామ్ల ఘృతైర్యుతంః

భక్షితం పూర్వయామే స్యాత్‌

త ద్వర్షం సౌఖ్యదాయకంః

అని శాస్త్ర వచనం. ఏడాదిపొడవునా శరీరదారుఢ్యం కలిగించే లక్షణం, సంపూర్ణ ఆరోగ్య రక్షణం ఈ ప్రసాదానికి ఉన్నాయని పెద్దలమాట.

యోగశాస్త్రపరంగా ప్రతి మనిషిలో ఆరు చక్రాలు ఉంటాయి. వీటినే షట్చక్రాలు అంటారు. అవి మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు. ఈ షట్చక్రాల్లోనే ప్రాణవాయువు సంచారం చేస్తుంటుంది. ఈ ఆరు చక్రాలు మనం తీసుకునే ఉగాది పచ్చడిలోని ఆరు రుచులకు ప్రతీకలుగా నిలుస్తాయి. మనం వివిధ రకాలైన ఆహారపదార్థాలు తీసుకున్నప్పుడు ఆయా రుచులకు అనుగుణంగా ఆయా చక్రాలు చైతన్యవంతం అవుతాయి.

ప్రాణవాయువు మనలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే అయిదు రకాలుగా ఉంటుంది. ఇవన్నీ వివిధ రుచులతో అనుసంధానమై ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఏ రుచి ఎక్కువగా ఉందో అందుకు అనుగుణంగా ఆ రకమైన ప్రాణవాయువు ఉత్తేజితమవుతుంది. షట్చక్రాలు, పంచప్రాణాలను యోగశాస్త్ర పద్ధతుల ప్రకారం అదుపులో ఉంచుకోవడానికి కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. అన్ని రకాల రుచుల మేళవింపుగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలా రుచులన్నీ సమపాళ్లలో అందినప్పుడే శరీరం మనిషి స్వాధీనంలో ఉంటుంది. ఉగాది పచ్చడిలో ఆరు రుచులను కలిపి మేళవించడంలో ఉన్న మరో అర్థం ఇదే. మొత్తంగా ఉగాది పచ్చడి మనిషి పరిపూర్ణుడుగా మారేందుకు ప్రేరేపిస్తుంది.

ప్రాణ - వగరు,

అపాన - తీపి,

వ్యాన - పులుపు,

ఉదాన - కారం,

సమాన - చేదు

మూలాధారం - తీపి,

స్వాధిష్ఠానం - వగరు,

మణిపూరకం - చేదు,

అనాహతం- పులుపు,

విశుద్ధ- కారం,

ఆజ్ఞ - ఉప్పు

ఈ చక్రాలు రుచులకు ఆలంబనగా ఉంటూ, మనిషి జీవక్రియల నిర్వహణలో తోడ్పడుతుంటాయి.

- కప్పగంతు రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని