తహారత్‌ మరవద్దు!

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా మన ధార్మిక విధేనని చెప్పారు ప్రవక్త (స). ఆరోగ్యం ....

Published : 26 Mar 2020 00:36 IST

ఇస్లాం సందేశం

రోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా మన ధార్మిక విధేనని చెప్పారు ప్రవక్త (స). ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలన్నీ దైవారాధనలేనని వివరించారు. స్వయంగా ప్రవక్త (స) ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన శుచి, శుభ్రతలకు ప్రవక్త (స) ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ‘శుచి, శుభ్రతలు ధర్మంలో సగభాగం’ అన్నది ప్రవక్త బోధన. నమాజుకు ముందు కాళ్లూ, మోచేతుల చేతుల వరకూ కడుక్కోవడం, ముఖాన్ని, నోటిని శుభ్రం చేసుకోవడం షరతుగా పెట్టారు. దీన్నే ఇస్లాం పరిభాషలో వుజూ అంటారు. ఎవరైతే వుజూ చేయలేదో వారి నమాజ్‌ ఆరాధన నెరవేరదన్న నిబంధన పెట్టారు. నమాజుకు ‘వుజూ’ తాళం చెవిలాంటిదన్నారు. అందుకే మసీదులో ప్రత్యేకంగా వుజూశాల ఉంటుంది. ఇది ప్రవక్త సంప్రదాయం. నమాజుకు ముందే కాకుండా ఇంట్లో ప్రవేశించాక, నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ప్రవక్త (స) వుజూ చేసుకునేవారు. మిస్వాక్‌ పుల్లతో నమాజుకు ముందు దంతధావనం చేసేవారు. శుక్రవారం తలంటి స్నానం చేయడం కూడా ముఖ్య సందప్రదాయంగా ఆచరించేవారు. ఈ ప్రక్రియను గుస్ల్‌ అంటారు. వీటన్నిటినీ కలిపి ఖుర్‌ఆన్‌ గ్రంథం ‘తహారత్‌ ’గా పేర్కొంటోంది. ప్రవక్త బోధనల గ్రంథమైన సహీహ్‌ బుఖారి గ్రంథంలో ‘తహారత్‌’ అనే అధ్యాయంలో పరిశుభ్రతకు సంబంధించిన వందలాది బోధనలున్నాయి. పరిశుద్ధత ప్రాధాన్యం గురించి ఖుర్‌ఆన్‌ గ్రంథం కూడా నొక్కి చెబుతుంది. ‘పరిశుభ్రత పాటించేవారినే అల్లాహ్‌ ఇష్టపడతారు’ అని ఖుర్‌ఆన్‌ ఉద్భోధిస్తోంది.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని