మనస్సుకు  ఆ  బలముంది!

ఓ వానాకాలం...బుద్ధ భగవానుడు జేతవనంలో విడిది చేశాడు. ఆ రుతువులో విపరీతమైన వానలు...

Updated : 16 Apr 2020 00:51 IST

బోధివృక్షం

ఓ వానాకాలం...

బుద్ధ భగవానుడు జేతవనంలో విడిది చేశాడు. ఆ రుతువులో విపరీతమైన వానలు. గాలులు, ఉరుములు, మెరుపులతో ప్రకృతి బీభత్సంగా ఉంది. జన సంచారం పూర్తిగా స్తంభించిపోయింది. బుద్ధ భగవానుడికి, శిష్యులకు భిక్ష సమర్పించే వారే లేకపోయారు.

ఆ జల్లుల్లో తడిచిన బుద్ధుడికి బాగా జలుబు చేసింది. ఆయన శిష్యుల పరిస్థితీ అలాగే ఉంది. ఎక్కడికీ కదిలే అవకాశం లేనందువల్ల మూలికలు తేవడానికి, ఔషధం తయారు చేసుకోడానికి కూడా వీలులేకపోయింది. ఓ వైపు ఆకాశానికి చిల్లులు పడ్డట్టు వానలు. మరోవైపు ఆకలిదప్పులు.

బుద్ధుడి శిష్యులకు ఏం చేయాలో తోచడం లేదు.

చీకట్లు ముసిరిన వాతావరణంలో రేయింబవళ్లు తేడా తెలియడం లేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంకట స్థితి ఎదురుకాలేదు. శిష్యులందరూ కర్తవ్యం తెలియక బుద్ధుడి దగ్గరకు వెళ్లారు. బుద్ధుడు అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానంలో ఉన్నాడు. అలౌకిక స్థితిలో ఉన్న ఆయన చుట్టూ ఓ దివ్య తేజస్సు వ్యాపించి ఉంది. ఆయన దర్శనంతో శిష్యుల శరీర బాధలు తగ్గినట్లు అనిపించాయి. వారంతా బుద్ధుని ఎదుట పరమ భక్తితో ప్రణమిల్లారు.

కొద్ది సమయం తర్వాత బుద్ధుడు కళ్లు తెరిచి వాళ్లవంక చూశాడు. అందరూ వినమ్రంగా చేతులు జోడించారు. ‘దేవా గతంలో ఎన్నడూలేని విధంగా కుటీరాల్లో బందీలుగా ఉండాల్సి వస్తోంది. ఆహారం, ఔషధాలు కూడా దొరకట్లేదు. పరిస్థితి దయనీయంగా ఉంది. కానీ మీ సమక్షంలో ఆ బాధలు లేవు.. ఎలా?’ అని ప్రశ్నించారు.

బుద్ధుడు మందహాసం చేశాడు.

‘నాయనలారా! ఆ శక్తి ఆత్మది. సాధనకు, ఆత్మశోధనకు ఇదో గొప్ప అవకాశం. ప్రతికూల వాతావరణంలో ఎవరికి వారు మనోమౌనం పాటించడం వల్ల మనస్సు శక్తిమంతమవుతుంది. ఆత్మ తేజరిల్లుతుంది. అది అనేక సమస్యలను ఎదుర్కొనే శక్తినిస్తుంది. దేహస్మృతిలో నుంచి బయటపడి ఆత్మస్థితి కోసం గట్టిగా ప్రయత్నించండి. ఏ పరిస్థితీ శాశ్వతం కాదు. మళ్లీ పూర్వస్థితి వస్తుంది. భయపడొద్ధు.’ శిష్యులకు అభయమిచ్చాడు తథాగతుడు.

-కె.రాఘవేంద్రబాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని