సింహాలు మీరు!

అది ఓ కీకారణ్యం. ఎన్నో జంతువులు యథేచ్ఛగా తిరుగాడుతున్నాయి. అందులో నిండు గర్భిణి అయిన సింహం...

Updated : 16 Apr 2020 04:24 IST

ది ఓ కీకారణ్యం. ఎన్నో జంతువులు యథేచ్ఛగా తిరుగాడుతున్నాయి. అందులో నిండు గర్భిణి అయిన సింహం కూడా ఉంది. వేట కోసం గొర్రెల మంద దగ్గరకు వచ్చిన ఆ సింహం బిడ్డను కని చనిపోయింది. అప్పటి నుంచి సింహం పిల్ల గొర్రెల మధ్యే పెరగసాగింది. అచ్చం వాటిలాగే ప్రవర్తించేది.

పెద్దయ్యే కొద్దీ రూపం మినహా అన్నీ గొర్రెలాంటి జీవితమే దానికీ అలవాటైంది. వాటిలాగే ఆకులు, అలములు తింటూ క్రూర మృగాలను చూడగానే భీతిల్లుతూ పరుగెత్తేది.

కొన్నాళ్లకు అడవిలోకి ఓ సింహం వచ్చింది. గొర్రెల గుంపులో ఉండి, వాటిలాగే ఉంటున్న సింహాన్ని చూడగానే దానికి ఆశ్చర్యం వేసింది.

అది ఆ సింహం దగ్గరకు వెళ్లబోతుంటే అది చూసి పారిపోయింది.

ఎలాగో దాన్ని పట్టుకుని, దగ్గరకు తీసుకుని ‘నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావని’ ప్రశ్నించింది కొత్త సింహం.

‘అప్పుడా సింహం... అవును నేను గొర్రెను కదా ఇలాగే ఉండాలి అంది.

‘నువ్వు గొర్రెవు కాదు... సింహానివి’ అంది కొత్త సింహం.

‘అదెట్లా నేను పుట్టినప్పుటి నుంచి ఇలాగే ఉండడం అలవాటు’ అంటూ గొర్రెలాగే భయపడసాగిందది.

కొత్త సింహం ఎంత ప్రయత్నించినా అది అలాగే చెబుతోంది.

ఇక లాభం లేదనుకుని దాన్ని ఒక చెరువు దగ్గరకు తీసుకెళ్లి... అందులో దాని ప్రతిబింబాన్ని చూపింది.

‘చూడు! నువ్వు కూడా నాలాగే సింహానివి. నువ్వు, నేను ఒకేలా ఉన్నాం.’ అని వివరించింది. అప్పటికి ఆ గొర్రె సింహానికి తన అసలు రూపం స్ఫురించింది. ఒక్కసారిగా సింహంలా గర్జించింది.

స్వామి వివేకానంద అమెరికాలో చెప్పిన కథ ఇది. ‘మనం సింహ సదృశమైన ధీర పురుషులం. కానీ గొర్రెల్లా బలహీనులమన్న భ్రమలో ఉన్నాం. అలాగే ప్రవర్తిస్తున్నాం. సద్గురువులు, మహానుభావులు వచ్చి మన నిజ స్వరూపాన్ని తెలిపేవరకు మేల్కొనలేకపోతున్నాం. మన స్వరూపాన్ని గురించి తెలుసుకోలేకపోతున్నాం.’ అని మానవ జాతిని మేల్కొలిపారు.

-సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని