కాలం చేసే జాలం!

ఏదైనా కష్టం వస్తే ‘కాలదోషం’ అంటాం.  ‘కాలం కలిసిరావట్లేదు’ అని కుమిలిపోతుంటాం.‘కాలం చాలా పాడైపోయింద’ని నిందిస్తుంటాం. మన కర్మలు, ఆలోచనలు కలిసివచ్చి సత్ఫలితం...

Published : 23 Apr 2020 01:01 IST

ఏదైనా కష్టం వస్తే ‘కాలదోషం’ అంటాం.  ‘కాలం కలిసిరావట్లేదు’ అని కుమిలిపోతుంటాం.
‘కాలం చాలా పాడైపోయింద’ని నిందిస్తుంటాం. మన కర్మలు, ఆలోచనలు కలిసివచ్చి సత్ఫలితం అందితే మంచికాలమనీ, కలిసిరాక దుష్ఫలితాలు ఎదుర్కొంటే చెడ్డకాలమనీ అనుకుంటాం.
కానీ ఇదంతా కేవలం అవగాహనారాహిత్యమే. ఎందుకంటే కాలగమనంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇప్పుడున్నది ఎప్పటికీ ఉంటుందనుకోవడం అజ్ఞానమే.
ఈ పరిస్థితి శాశ్వతం కాదు. తర్వాత వచ్చేవీ అలాగే ఉండిపోవు. అందుకే మనిషి చేయాల్సింది కాల మహిమను అర్థం చేసుకోవడం. దానికి అనుగుణంగా తనను తాను మలుచుకోవడం...

కాలమే అన్నిటికీ కర్త. ధనిక, పేద తేడాలు లేవు... రాజు, బంటు పట్టింపు లేదు. సృష్టిలో ప్రతి ప్రాణీ దానికి అనుగుణంగా నడవాల్సిందే. ‘సమయం అశ్వంలా పరుగెడుతుంది’ అని అధర్వణ వేదం అభివర్ణించింది. అండపిండ బ్రహ్మాండమంతా అందులోనే ఉంది.అందులో భాగమైన ప్రతి ఒక్కరూ ఆ గమనంలో జరిగే పరిణామాలను అనుభవించి తీరాల్సిందే.
భారత ఇతివృత్తాన్ని సూచించే ఈ పద్యం కామహిమను ప్రకటిస్తుంది.

రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సం
యోజకుడైన చక్రియట యుగ్ర గదాధరుడైన భీముడ
య్యాజికి దోడువచ్చునట యాపద గల్గుటిదేమి చోద్యమో!

ధర్మరాజు వంటి మహాత్ముడు రాజు కాగా, ఇంద్రుని కుమారుడైన అర్జునుడు తన చేతిలో శత్రు సంహారకమైన గాండీవాన్ని ధరించి ఉన్నాడు. అందరినీ రక్షించే శ్రీకృష్ణుడే వీరి పక్షాన రథసారథిగా ఉండగా, భయంకరమైన  గదను ఆయుధంగా ధరించిన భీముడు ధర్మరాజుకి తోడుగా ఉన్నాడు. అయినా పాండవులకు వరుసపెట్టి కష్టాలు కలగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాలమహిమ కాకపోతే ఈ విధంగా జరుగుతుందా. తామరాకు తటాకంలో ఉన్నా తటస్థంగానే ఉంటుంది. నీటిచుక్క తనపైన పడినా తడవదు. అలాగే కాలం దేనికీ ప్రతిస్పందించదు. కాలానికి ప్రతిస్పందించేది మనిషే. కాలానికి తగినట్లు తనను తాను మలుచుకుని... దానికి అనుకూలంగా స్పందిస్తూ జీవితాన్ని అర్థవంతం చేసుకోవడమే వివేకశీలి క్షణం.
* జీవితం చాలా స్వల్పం. జీవిత కార్యం చాలా విస్తృతం. అందుకే ఎప్పటిపని అప్పుడు చేయాలంటారు పెద్దలు. పనిని వాయిదా వేయడం పిరికివాడి క్షణం. పోయిన ధనం, క్షీణించిన ఆరోగ్యం, మరిచిపోయిన విద్య, పరహస్తగతమైన సామ్రాజ్యం ఇవన్నీ... మళ్లీ కృషిచేస్తే పొందవచ్చేమో కానీ గడిచిన కాలాన్ని మాత్రం తిరిగి పొందలేం.
* మనిషికి కాలం గడవడం లేదన్నా, తగినంత సమయం దొరకటం లేదన్నా అది పూర్తిగా అతడి లోపమే తప్ప మరొకటి కాదు. కావ్యశాస్తాల్రు అధ్యయనం చేస్తూ, ఆధ్యాత్మిక రహస్యాలను అవగతం చేసుకుంటూ సజ్జనులు కాలం గడుపుతుంటారు. దుర్వ్యసనాలు, నిద్ర, కలహాలతో దుర్జనులు కాలాన్ని వ్యర్థం చేస్తారని భర్తృహరి తన సుభాషితాల్లో చెబుతాడు.
* జీవితంలో ప్రతి క్షణమూ అనివార్యమే. ఆ క్షణాన్ని వివేచనలోకి, విచక్షణలోకి అనువదించుకోగలిగే సామర్థ్యం సంపాదించుకోవాలి. అందుకు మహాత్ముల అనుభవాల్ని, ఆశయ ధర్మాలను క్షుణ్ణంగా అవగతం చేసుకోవాలి. సమాజాన్ని చదవాలి. కేవలం ద్రౌపది ‘నవ్వు’కే అవమాన ఆగ్రహావేశాలకు గురైన దుర్యోధనుడు ఏ క్షణంలో పగ, ప్రతీకార జ్వాలలతో మనసును దగ్ధం చేసుకున్నాడో ఆ క్షణం అతడి మరణానికి బీజం పడింది.
* సూర్యుడు ఉదయాస్తమయాల్లో తన అరుణిమను వదలడు. అలాగే సంపదలు ఉన్నా, ఆపదలు సంభవించినా ధీరోదాత్తులు చలించరు. ‘పాదరసం’ లాంటి కాలాన్ని పట్టుకుని తన విజయానికి అనువుగా మచుకోవడంలోనే ఉంది మనిషి తెలివి. విషయభోగాల్లో ఉండేవాడికి కాలమహిమ తెలియదు. జీవితం విలువ తెలియదు. అది కాలవశుడైనవాడి అసమర్థత. కాలాన్ని మన వశంలో ఉంచుకుని, సమయజ్ఞతను ఆరాధించగలిగితే ప్రతికార్యంలో సాఫల్యమే సిద్ధిస్తుంది.
* కాలాన్ని ఎదుర్కోవడమనే పురుష ప్రయత్నాన్ని భగవంతుడే నిర్దేశించాడు. మన మనసుకైన గాయాలు కానీ, తనువుకైన గాయాలు కానీ మానిపోయేలా చేసే శక్తి ఒక్కకాలానికే ఉంది. అందుకే కాలమంత ఆత్మీయబంధువు వేరెవరూ లేరంటారు.  


కాలంనేరుగా కంటికి కనిపించదు. తన ప్రభావాన్ని ప్రకటించదు. కాలం ప్రకృతి ద్వారా తన ప్రభావాన్ని మనిషి మీద చూపిస్తుంది. అంటే కాలానికి ప్రకృతి ఒక ఆయుధంగా పని చేస్తుంది. కాలపురుషుడి ఆదేశం ప్రకారం ప్రకృతి విపరీత సందర్భాలను సృష్టించి మనిషిని ఇక్కట్లకు గురిచేస్తుంది. కాబట్టి, ప్రకృతిని మనిషి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రకృతి నియమాలకు అనుగుణంగా నడుచుకోవాలి. ప్రకృతిని ఆశ్రయించాలి కానీ ఆక్రమించాలని భావించకూడదు.

-కప్పగంతు రామకృష్ఱ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు