... తలుపు తీయవాప్రభూ!

జీవితాన్ని తెలిమంచులా, తొలిపొద్దులా తేలికపరుచుకోవడం ఓ అద్భుతమైన కళ. హృదయానికి ఏ బంధనమూ లేక భక్తిపారవశ్యంలో తేలితే....

Published : 07 May 2020 00:20 IST

నేడు రవీంద్రనాథ టాగోర్‌జయంతి

జీవితాన్ని తెలిమంచులా, తొలిపొద్దులా తేలికపరుచుకోవడం ఓ అద్భుతమైన కళ. హృదయానికి ఏ బంధనమూ లేక భక్తిపారవశ్యంలో తేలితే అది ఒక ఆనందహేళ! నడిపేవాడు ఒకడున్నాడని నిశ్చింతగా, నిర్భయంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగిపోయే ప్రయాణికుడు ప్రశాంతంగా గమ్యాన్ని చేరతాడు. అలాకాకుండా ప్రతి కుదుపునీ ప్రమాదమనుకుని కలవరపడేవాడు కంటి కునుకుకీ దూరమవుతాడు. నిరవధిక ప్రయాణానికే కాదు నిత్య జీవన పయనానికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే అందరికీ ఆధారమైన విశ్వశక్తిని విశ్వసిస్తే ఆ విశ్వాసమే చుక్కానిలా మన జీవన నావను తీరానికి చేరుస్తుంది. ఆ శక్తిని విశ్వకవి రవీంద్రుడు సర్వేశ్వరుడిగా, సర్వాధికారిగానే కాదు తనకు సహచరుడిగా భావించుకున్నారు. ఆ స్వేచ్ఛాపూరిత పరమ భక్తికి పదాల చందనమద్ది ఆ అధినేతకు ‘గీతాంజలి’ ఘటించారు. ఇందులో మనిషి జీవనానికి సంబంధించిన అనేక పార్శ్వాలు కనిపిస్తాయి.

ఇది హృదయాంజలి

ప్రభూ! నీకిదే నా ప్రార్థన ఛేదించు నా హృదయ సంకుచితత్త్వాన్ని!ప్రసాదించు బలాన్ని, విశాలత్వాన్ని!అంధవిశ్వాసాల చెర నుంచి నన్ను విడిపించునా సుఖదుఃఖాలను తేలిగ్గా తీసుకునే శక్తినివ్వు!సాటి మనుషుల సేవలో జీవితాన్ని సార్థకం చేసుకోనివ్వు దీనులకు దూరంగా జరగనివ్వుకుధూర్తుల ఎదుట మోకరిల్లనివ్వకు ప్రేమతో నీ సంకల్పం ముందు నా సమస్తం ధారపోయనివ్వు... ఇది రవీంద్రుని ప్రార్థనా గీతం కాదు.. ప్రతి మనిషీ హృదయాంతరంగం.

స్వేచ్ఛ, స్వాతంత్య్రం అనేవి భౌతిక జీవితానికి సంబంధించిన పరిమితార్థంతో కూడిన పదాలు కావు. అవి అంతరంగ ప్రధానమైన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, పవిత్రత, పరిపూర్ణతలతో కలగలిసిన ఉన్నతమైన లక్ష్యాలు. అలా స్వర్గ సమానమైన స్వేచ్ఛాలోకంలోకి మనం ఎప్పుడు ప్రవేశిస్తామో అప్పుడు శాశ్వతమైన శాంతి, సాంత్వన కలుగుతాయి. అదే నిజమైన భక్తిభావన. హృదయంలో సర్వేశ్వరుడి స్థాపన. అలాంటి అనుభూతితోనే గీతాంజలిలో ‘ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తల ఎత్తుకుని తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో... ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి తండ్రీ! మమ్మల్ని మేల్కొలుపు’ అని టాగోర్‌ వేడుకున్నారు.

భయం వల్ల పుట్టేది నిజమైన భక్తికాదు. పరిపూర్ణమైన స్వేచ్ఛ నిండిన హృదయంలో పుట్టే భక్తి సిసలైన భక్తి. దుఃఖం కూడా భగవంతుడిచ్చిన ప్రసాదమే. అది తన దరికి చేర్చుకునే ప్రయత్నమే అంటారు. ‘నీ ఈ చిన్న రెల్లు పిల్లనగ్రోవిని నీ వెంట కొండకోనల్లో తిప్పుకుని నిరంతరం నూతన రాగాల్ని వినిపిస్తావు...’అని సర్వేశ్వరుడిని కీర్తిస్తారు. అన్ని సమయాల్లో ఆ అంతర్యామి మన వెన్నంటే ఉంటాడని, మనల్ని తన వెంటే విహరింపజేసుకుంటాడని నమ్మకంతో సాగిపోవడం ఎంత అపురూపమైన భావన. మనసుకు గొప్ప సాంత్వన విషయమిది. ఇలా జీవితాన్ని సరళం, నిరాడంబరం చేసుకుంటేనే జీవితానికి సార్థకత.

తలుపులన్నీ బిగించి , ఈ గుడి చీకటిమూల ఒంటరిగా ఎవరిని పూజిస్తున్నావు? కళ్లు తెరిచిచూడు... నీ ఎదుట లేడూ ఈశ్వరుడు!..

దృష్టి దేవాలయాన్ని దాటి దయార్ధ్రమైనప్పుడే ఆ దేవదేవుడి దర్శనమవుతుంది. బడుగు జీవుల బాధలకు గుండె బరువెక్కనప్పుడు భగవంతుడి భక్తులెలా అవుతాం... అందుకే గుడి బయటకు వచ్చి గుండెను తడి చేసుకోమంటున్నాడు రవీంద్రుడు.

వ్యక్తిగతమైన జీవితాల్ని దిగజార్చే మరో జాడ్యం ‘ఇరుకుతనం’. సంకుచిత స్వభావం. పక్కవారిని, వారి భావాలను అంగీకరించలేని, ఆమోదించలేని అల్పత్వం. లాభాలు, సుఖాలు, వాడికి వద్ధు.. అన్నీ నాకే ఇవ్వు అనే ధోరణి. మన జీవితాల్ని దుర్భరం చేస్తుందీ సంకుచితత్వం. అందుకే విశ్వకవి ‘ఎక్కడ ప్రపంచం ముక్కలై, ఇరుకైన గోడల మధ్య మగ్గిపోదో... ఎక్కడ మాటలు సత్యాంతరాళం నుంచి వెలువడతాయో అక్కడికి నన్ను తోడ్కొని వెళ్లు’ అంటారు.

మతం పేరుతో వ్యాప్తి చేసే మూఢ నమ్మకాలు మానవత్వానికి మరణ సదృశాలు. అందుకే ‘ఎక్కడ పవిత్రమైన జ్ఞానప్రవాహం మృతాంధకార విశ్వాసపు మరీచికల్లో ఇంకిపోదో, ఎక్కడ మనస్సు నిరంతరం విశాల భావాలవైపు, సత్కార్యాలవైపు పయనిస్తుందో! తండ్రీ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి మమ్మల్ని నడిపించ’మంటారు.

-చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని