మట్టి మాటున బంగారం!

20వ శతాబ్ధి ప్రారంభంలో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ నగరంలో ‘వాట్‌ త్రాయ్‌ మిత్‌’ అనే బౌద్ధ విహారంలో బుద్ధుడి ప్రతిమకు...

Updated : 28 May 2020 00:20 IST

బోధివృక్షం

20వ శతాబ్ధి ప్రారంభంలో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ నగరంలో ‘వాట్‌ త్రాయ్‌ మిత్‌’ అనే బౌద్ధ విహారంలో బుద్ధుడి ప్రతిమకు ఆరాధన జరుగుతోంది. పదమూడో శతాబ్దానికి చెందిన పదహారు అడుగుల మట్టి విగ్రహమది. భక్తి ప్రపత్తులతో బౌద్ధ భిక్షువులు ప్రతిమను ఊరేగింపుగా తీసుకెళుతున్నారు. ఆ విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ఇంతలో ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా అందరి ముఖాల్లో ఆందోళన. వర్షంలో మట్టి విగ్రహం ఎక్కడ కరిగిపోతుందోనని... తమ ఆరాధ్యమూర్తి ఎక్కడ అదృశ్యమైపోతాడోనని అందరూ బాధపడుతున్నారు. పరదాలతో కప్పి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సంఘటన మనిషికి జీవితానికి సంబంధించిన అపురూప సందేశాన్నిస్తుంది. నశించిపోయే దేహంలాంటిదే మట్టి పూత. ఏగాలికో, వానకో కరిగిపోతుంది. మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆ చర్మచక్షువుల మాటున ఉన్న అనంతమైన ఆత్మను అందరం విస్మరిస్తున్నాం. గుర్తించలేకపోతున్నాం. దాన్ని గుర్తించగలిననాడు మనిషి మహనీయుడవుతాడు.
భీకరంగా వాన కురవడంతోవారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.గాలుల వేగం కూడా పెరగడంతో అందరూ నిస్సహాయులై చూస్తున్నారు. చాలామంది తలోదిక్కుకు పరుగులెత్తారు. విగ్రహం మాత్రం వానలో తడుస్తోంది. అందరూ ఊహించినట్టే ఏడు శతాబ్ధాలనాటి ఆ అపురూప విగ్రహం కరగడం మొదలైంది. భిక్షవుల కళ్లు చెమ్మగిల్లాయి. అప్పుడు జరగిందో అద్భుతం. బుద్ధ భగవానుడి విగ్రహం బంగారంలా ప్రకాశిస్తోంది. మట్టి విగ్రహం మాటున ఉన్న బంగారు భగవానుడు బయటపడ్డాడు. అది మృణ్మయమూర్తి కాదు స్వర్ణరూపమని అందరికీ తెలియవచ్చింది. విదేశీయుల దాడుల నుంచి రక్షించుకునేందుకు వారి పూర్వీకులు ఇలా బంగారు విగ్రహానికి మట్టి పూత పూశారని బౌద్ధభిక్షువులు తెలుసుకున్నారు.

- చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు