పున్నమి పూట పుణ్యాల మూట!

కార్తిక పౌర్ణమి... ఎంతో పవిత్రమైన రోజు. వివిధ పేర్లతో, సంప్రదాయాల్లో ఈ పర్వదినాన్ని చేసుకుంటారు.

Published : 26 Nov 2020 01:02 IST

ఈనెల 30 కార్తిక పౌర్ణమి

కార్తిక పౌర్ణమి... ఎంతో పవిత్రమైన రోజు. వివిధ పేర్లతో, సంప్రదాయాల్లో ఈ పర్వదినాన్ని చేసుకుంటారు.

* పున్నమి వేళలో శివాలయంలో జ్వాలాతోరణం దర్శించడం సంప్రదాయం. కర్రలను తోరణంలా కట్టి, నెయ్యితో తడిపిన గుడ్డ లేదా ఎండుగడ్డిని చుట్టి వెలిగిస్తే అది జ్వాలాతోరణం అవుతుంది. శివపార్వతులను పల్లకిలో ఉంచి దీని కింద నుంచి తిప్పుతారు.


* తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మతి అనే త్రిపురాసురులను పరమశివుడు సంహరించింది కార్తికపౌర్ణమినాడే. అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఆ రోజు జిల్లేడు, మారేడు పూలతో శివార్చన చేయడం మంచిదని చెబుతారు.


* యోగనిద్ర నుంచి మేల్కొన్న మహావిష్ణువు కార్తిక పౌర్ణమినాడు దేవతలందరూ వెంటరాగా బృందావన ప్రవేశం చేస్తాడని చెబుతారు. బృందావనం అంటే తులసికోట. పౌర్ణమినాడు తులసి పూజ చేయడం శ్రేయోదాయకమని చెబుతారు.


* ‘ఏకస్సర్వదానాని దీపదానం తథైకతః’... కార్తిక పౌర్ణమినాడు దీపదానం శ్రేష్ఠమని చెబుతారు. దీపం దానం చేయాలనుకునేవారు పైడి పత్తితో స్వయంగా వత్తులు చేసుకుని గోధుమ పిండితో ప్రమిదను చేసుకుని అందులో ఆవునేతితో దీపాన్ని వెలిగించి పండితుడికి దానం చేయాలి.


* పరమశివుడిని భక్తేశ్వరుడు అనే పేరుతో ఆరాధిస్తారు. పౌర్ణమినాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం భక్తేశ్వరవ్రతం చేసి, స్వామికి నివేదించిన తరువాత ఉపవాసం విరమిస్తారు. పరమేశ్వరుడిని తామరపూలతో పూజించే సంప్రదాయం
కూడా ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని