ఆ మట్టి ఎక్కడదొరుకుతుంది?

ఒకానొక నిరుపేద పల్లెటూరి వ్యక్తి మట్టితో ఇంటిని కట్టుకున్నాడు. తన ఆరుగురు సంతానంతో కలిసి ఇంట్లోనే ...

Published : 07 Jan 2021 01:21 IST

ఇస్లాం సందేశం

కానొక నిరుపేద పల్లెటూరి వ్యక్తి మట్టితో ఇంటిని కట్టుకున్నాడు. తన ఆరుగురు సంతానంతో కలిసి ఇంట్లోనే నమాజు చేసుకునేందుకు మసీదునూ నిర్మించాలనుకున్నాడు. ఆ నిర్మాణంలో స్వర్గపు మట్టిని వినియోగించాలనుకున్నాడు. తన కొడుకులను పిలిచి స్వర్గపు మట్టి ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని తీసుకురావాలని చెప్పడంతో, కొడుకులంతా తలా ఒక దిక్కుకు వెళ్లిపోయారు. వారిలో చిన్న కొడుకు మాత్రం ఇంటిపట్టునే ఉండిపోయాడు. అన్నదమ్ములంతా రోజంతా స్వర్గం మట్టి కోసం తిరిగి తిరిగి అలసిపోయి సాయంత్రానికి ఒట్టి చేతులతోనే ఇంటిముఖం పట్టారు. కానీ చిన్న తమ్ముడు మాత్రం ఓ మట్టి సంచిని తండ్రి ముందుంచాడు. తండ్రి ఆశ్చర్యపోయాడు.
‘బిడ్డా! రోజంతా ఇంట్లోనే ఉన్నావు, స్వర్గం మట్టి నీకెక్కడ దొరికింది’ అని అడిగాడు.
‘రోజంతా అమ్మ వెనకాలే తిరిగాను. అమ్మ ఎక్కడెక్కడ అడుగులు వేసిందో ఆ మట్టిని నా సంచిలో నింపుకున్నాను. ఇంతకు మించిన మట్టి మనకెక్కడా దొరకదు’ అని జవాబిచ్చాడు. తల్లి పాదాల చెంత స్వర్గం ఉందన్నది ముహమ్మద్‌ ప్రవక్త ప్రవచనం. ఈ ప్రపంచంలో సంబంధాలన్నీ మనం పుట్టాకే ఏర్పడతాయి. కానీ మనం ఈ లోకంలోకి రావడానికి తొమ్మిది నెలల ముందే మాతృమూర్తితో అనుబంధం ఏర్పడుతుంది. మనల్ని కడుపులో పెట్టుకుని మనకోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను, నిద్రను త్యాగం చేస్తుంది. మనోవేదనను అనుభవిస్తుంది.  మనమెలా ఉంటామో కూడా తెలియకుండా మనల్ని ప్రేమించేది ఈ సృష్టిలో ఒక్క అమ్మ మాత్రమే. . పుట్టించిన తరువాత మన లోపాలను కప్పిపెట్టే ఒకేఒక్క వ్యక్తి ఆమె. అందుకే అల్లాహ్‌ స్వర్గసీమను తల్లిపాదాల చెంత పెట్టాడు. అందుకే అమ్మ సేవచేసి స్వర్గానికి అర్హత సాధించాలని చెప్పారు ప్రవక్త.      

- ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని