అతిథిని ఎలా చూడాలి?

ఒక గృహిణి ప్రవక్త (స) దగ్గరకొచ్చి ‘నా భర్త రోజూ ఎవరో ఒక అతిథిని ఇంటికి తీసుకొస్తారు. రోజూ వారికి వంటలు వండి, అతిథి మర్యాదలు చేసి అలసిపోతున్నాను.’ అని గోడు వెళ్లబోసుకుంది. ఈ మాటలకు ప్రవక్త (స) ఏమి చెప్పకుండా మౌనంగా ఉండిపోవడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Published : 28 Jan 2021 00:11 IST

ఇస్లాం సందేశం

ఒక గృహిణి ప్రవక్త (స) దగ్గరకొచ్చి ‘నా భర్త రోజూ ఎవరో ఒక అతిథిని ఇంటికి తీసుకొస్తారు. రోజూ వారికి వంటలు వండి, అతిథి మర్యాదలు చేసి అలసిపోతున్నాను.’ అని గోడు వెళ్లబోసుకుంది. ఈ మాటలకు ప్రవక్త (స) ఏమి చెప్పకుండా మౌనంగా ఉండిపోవడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. తరువాత ఆమె భర్తను పిలిచి ‘నేను ఈ రోజు మీ ఇంటికి అతిథిగా వస్తున్నాను’ అని ప్రవక్త చెప్పడంతో అతను సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఇంటికెళ్లి ప్రవక్త (స) మన ఇంటికి అతిథిగా రాబోతున్నారని తన భార్యతో చెప్పాడు. ఆలూమగలిద్దరూ సంతోషించారు. ఆ ఇంటి ఆవిడ ప్రవక్త (స)కోసం ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసింది. ప్రవక్త (స) వచ్చారు. ఆ దంపతులు చక్కని అతిథి మర్యాదలు చేశారు. భోజనం చేసి ప్రవక్త (స) సెలవు తీసుకున్నారు. వెళుతూ వెళుతూ ఆ ఇంటి యజమానితో ‘‘నేను వెళ్లే ద్వారం వైపు చూడమని నీ భార్యతో చెప్పు’ అన్నారు. చెప్పినట్లుగానే ఆమె ప్రవక్త (స) వెళ్లే ద్వారం వైపు కళ్లార్పకుండా చూడసాగింది. ఆయన వెనకాలే హానికారక కీటకాలైన పాములు, తేళ్లూ ఇంటినుంచి బయటికి వెళ్లిపోతున్నాయి. ఇది చూసి ఆమెకు స్పృహ కోల్పోయినంత పనయింది. ఎందుకిలా జరిగిందో తెలుసుకునేందుకు ప్రవక్త దగ్గరకు వచ్చి అడిగింది. ‘ఎవరైనా అతిథి ఇంటికి వచ్చి వెళ్లిపోతే అతను వెళుతూ వెళుతూ ఆ ఇంటివారి విపత్తులు, ఆపదలు, కష్టనష్టాలన్నీ తీసుకుని వెళ్లిపోతాడు. ఆ అతిథికి వండి పెట్టేందుకు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇది’ అని చెప్పారు. ఇంటికి వచ్చిన అతిథిని ఆపదగా భావించకూడదు. ఇంటికి శుభంగా భావించాలి. వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేయాలంటే కొంత కష్టపడాల్సి ఉంటుంది. ‘అల్లాహ్‌ను, పరలోక జీవితాన్ని నమ్మేవారు అతిథి మర్యాదలు చేయాలి’ అని ప్రవక్త (స) నొక్కి చెప్పారు.           

- ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని