బంధువులను ఆదరిస్తే..!

సిలా రెహ్మీ అంటే బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉండడం. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మరణ భయం... ఇవి మనిషిని నిత్యం వెంటాడుతుంటాయి. ఈ సమస్యలను అధిగమించాలనుకునేవారు బంధువుల హక్కులు నెరవేర్చాలన్నారు

Published : 11 Feb 2021 01:32 IST

ఇస్లాం సందేశం

తమ ఆయుష్షు పెరగాలనుకునేవారు, సంపదను పెంచుకోవాలనుకునేవారు సిలా రెహ్మీ చేయాలని చెప్పారు ప్రవక్త. సిలా రెహ్మీ అంటే ఏంటి? దాని వల్ల ఆయుస్షు ఎలా పెరుగుతుంది?
సిలా రెహ్మీ అంటే బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉండడం. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మరణ భయం... ఇవి మనిషిని నిత్యం వెంటాడుతుంటాయి. ఈ సమస్యలను అధిగమించాలనుకునేవారు బంధువుల హక్కులు నెరవేర్చాలన్నారు ప్రవక్త. కుటుంబ విలువలు పాటించాలన్నది ఆ బోధనల సారాంశం. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఖురాన్‌ మరెన్నో సూచనలు చేసింది. ‘మీ బంధువులతో ప్రేమ, వాత్సల్యాలతో మెలగాలి. నిరుపేద బంధువులపై కారుణ్యం చూపాలి... ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు బంధువులు, అనాథలు, నిరుపేదలు వస్తే, ఆ ఆస్తినుంచి వారికి కూడ కొంత ఇవ్వండి.’ అన్నది ఖురాన్‌ ఉద్బోధ. భార్యాభర్తల బంధంతో ఒక్కటయ్యే సమయంలో అనేక బంధుత్వాలు ఏర్పడతాయి. వారందరినీ హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఆత్మీయంగా ఆదరించాలి. ‘మీకు రెండు చోట్ల నుంచి విందుకు ఆహ్వానం అందితే అందులో రక్తసంబంధీకులెవరో వారింటికి వెళ్లండి’ అని చెప్పారు ప్రవక్త మహనీయులు. మనవల్ల ఏదైనా తప్పు జరిగితే బంధువులను మన్నించమని వేడుకోవడంలో ఆలస్యం చేయవద్దన్నారు.. దీనివల్ల దెబ్బతిన్న బాంధవ్యాలు మెరుగవుతాయి. వైరం వస్తే తమ సోదరుడితో మూడు రోజులకు మించి మాట్లాడకుండా ఉండరాదని చెప్పారు ప్రవక్త. తమ బంధువర్గంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే పరామర్శించడం, దగ్గరి బంధువుల్లో ఎవరైనా చనిపోతే అలాంటి వారి శవయాత్రలో పాల్గొనడం, ఆ కుటుంబం సభ్యులను ఓదార్చడం ప్రతి ఒక్కరి విధి. రక్త సంబంధీకులు, దగ్గరి బంధువులతో సంబంధాలను తెగదెంపులు చేసుకుంటే అల్లాహ్‌ అనుగ్రహం గగనమే అవుతుంది. అలాంటి వారు ఎన్ని దైవారాధనలు, ఉపవాసాలు, హజ్‌ యాత్ర చేసినా ఉపయోగం లేదు. బంధువులపై ప్రేమ, వాత్సల్యంతో ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థ పటిష్టమవుతుంది. దాని వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. సుందర సమాజం ఉనికిలోకి వస్తుంది.

- ఖైరున్నీసాబేగం
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని