హృదయం మీద ధ్యానం ఆందోళన దూరం!

చుట్టూ కల్లోలం... ఎటు చూసినా ఆందోళన... ఈ పరిస్థితుల్లో హృదయంతో అనుసంధానమవ్వాలి. అంతర్గత శక్తులను వెలికితీయాలి. అదే అభయం... భయం, ఆందోళన ...

Updated : 06 May 2021 00:24 IST

ఒక ఒరవడిలో సాగిపోతున్న జీవితాల్లోకి ఊహించని కల్లోలం గతేడాది దూసుకొచ్చింది. దీనివల్ల అందరూ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయారు. అకస్మాత్తుగా జీవితంలో పెను మార్పులు సంభవించినప్పుడు ఒత్తిడి, ఆందోళన సహజం. వీటి నుంచి బయటపడేందుకు పలు మార్గాలున్నాయి. అవేంటంటే...

ఉద్యమం, సాహసం ధైర్యం బుద్ధి, శక్తి పరాక్రమం అనే ఆరూ వర్ధిల్లే చోట దేవుడు ప్రకాశిస్తాడు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనందరికీ కావాల్సినవి ఇవే. వందేళ్లలో కనీవినీ ఎరుగని విపత్తు ఇది. ఒక ఒరవడిలో సాగిపోతున్న జీవితాల్లోకి ఊహించని కల్లోలం గతేడాది దూసుకొచ్చింది. దీని వల్ల అందరూ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయారు. అకస్మాత్తుగా జీవితంలో పెను మార్పులు సంభవించినప్పుడు అందరిలో ఒత్తిడి, ఆందోళన సహజం. వీటి వల్ల మనసు సంయమనం తప్పి కోపం, నిరాశ లాంటివి చుట్టుముడతాయి. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటి నుంచి బయటపడేందుకు పలు మార్గాలున్నాయి...

సేదతీరండి

చితి, చింత మధ్య ఒక్క సున్నానే తేడా. చింత సజీవులను దహిస్తే. చితి నిర్జీవులను దహిస్తుంది. అందుకే ప్రస్తుత చీకూ చింతా పక్కన పెట్టి మనస్ఫూర్తిగా కాసేపు సేదతీరదాం. హార్ట్‌ఫుల్‌నెస్‌ రిలాక్సేషన్‌ ద్వారా ఆందోళన, ఒత్తిడి, భయాల నుంచి బయటపడవచ్చు. దీన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. ఒత్తిడికి గురైనప్పుడు నాడీ శ్వాసను కూడా ప్రయత్నించవచ్చు. కుడి వైపు నాసికా పుటాన్ని బొటనవేలుతో మూసి ఎడమ వైపు నాసికా పుటంతో దీర్ఘ శ్వాస తీసుకుని వదలాలి. ఇలా పదిసార్లు చేయాలి. దీనివల్ల ప్రత్యానుకంప నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. మానసిక ప్రశాంతత నిండుతుంది.

ధ్యానం

భౌతిక పరంగా ధ్యానం వల్ల చక్కని నిద్ర సొంతమవుతుంది. అలసట తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి, బాధను ఓర్చుకునే సామర్థ్యం పెరుగుతాయి. మానసిక పరంగా ధ్యానం నాడీ వ్యవస్థను శాంతింపజేస్తుంది. ఆందోళన, మానసిక రుగ్మతలను హరిస్తుంది. జ్ఞాపకశక్తి, స్పష్టత, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, జీవితం పట్ల సమతుల్య దృష్టిని వృద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక పరంగా దీని ప్రయోజనాలు అపారం. ఒకే అంశం మీద దృష్టి కేంద్రీకరించటం ద్వారా ధ్యానం వల్ల మనసుని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అందుకే హార్ట్‌ఫుల్‌నెస్‌ మెడిటేషన్‌ని (హృదయం మీద ధ్యానాన్ని) జీవితంలో భాగం చేసుకోవాలి.

అంతరాత్మతో అనుసంధానం

శోకం ధైర్యాన్ని, ప్రజ్ఞను నశింపజేస్తుంది. శోకం వల్ల సర్వం నాశనమవుతుంది. శోకాన్ని మించిన శత్రువు లేదు. అందుకే అంతటా భయం, శోకం నిండిన ప్రస్తుత తరుణంలో అంతరాత్మతో అనుసంధానం అవుదాం. జీవితంలో ప్రశాంతత, సంతృప్తి చేరువ కావాలంటే ప్రార్థన ద్వారా హృదయంలోని ఉన్నత ఆత్మతో అనుసంధానం కావాలి. ప్రార్థన హృదయంలోని అనంత ప్రపంచంలోకి తీసుకెళుతుంది. తద్వారా మనలోని ప్రేమ, ఆశ, సౌందర్యం, సంతోషం లాంటి వాటిని అనుభూతి చెందే అవకాశం కలుగుతుంది.

మనో ప్రక్షాళన

బాహ్యాంతర భేదాలతో శౌచం రెండు విధాలు. జలంతో కలిగేది బాహ్యశుద్ధి. భావశుద్ధితో కలిగేది అంతర శుద్ధి. శరీరంలాగే మనసు కూడా పరిశుభ్రంగా ఉండాలి. అందుకే, మనసులోని అనవసర అభిప్రాయాలు, భయాలు, భావాలన్నింటినీ కడిగిపారేయాలి. కలతలు, నిరాశలు, నిస్పృహలు లాంటివన్నీ వదిలించుకోవాలి. అప్పుడే అంతర్గత ప్రశాంతత, స్పష్టత, స్థిమితత్వం చేకూరతాయి.

మంచి నిద్ర

చెడు కలలు రాకుండా మంచి నిద్ర కోసం ఈ శ్లోకం పఠించమంటారు పెద్దలు. పగలంతా ఆయా శ్రమలతో అలసిన దేహం నిద్రతో మళ్లీ శక్తిని పుంజుకుంటుంది. సరైన నిద్ర లేకుంటే ఎన్నో జబ్బులు చుట్టుముడతాయి. అందుకే రాత్రి పదింటి కల్లా నిద్రకు ఉపక్రమించి, తగినంత సమయం నిద్రపోవాలి. రాత్రిళ్లు టీవీ, వీడియో గేమ్‌లు లాంటి వాటి వల్ల మెదడు అనవసర ఉత్తేజాలకి లోనై నిద్రకు ఆటంకం కలుగుతుంది.

బ్రాహ్మీ ముహూర్తంలో..

బ్రాహ్మీ ముహూర్తంలో చేసే పనికి తిథి, వార, నక్షత్ర, దుర్ముహూర్తాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది పెద్దల మాట. మెదడు ప్రశాంత స్థితిలో ఉండే ఈ సమయంలో ధ్యానం చేస్తే రోజును తృప్తిగా, ప్రశాంతమయంగా ప్రారంభించవచ్చు. ఈ స్థితిని రోజంతా మీలో ఉంచుకోవటం అలవాటైతే ఎలాంటి సవాలు తలెత్తినా ఎదుర్కొనే స్థైర్యం సొంతమవుతుంది.

ప్రేమపూర్వక భాషణ

‘వాగ్భూషణం భూషణమ్‌’ అన్నాడు భర్తృహరి. మంచి మాటే మనిషికి అలంకారం. అలాంటి చక్కని భాషణతోనే తొలి పరిచయంలోనే శ్రీరామచంద్రుడి అభిమానాన్ని సంపాదించాడు హనుమ. కౌసల్యా తనయుడు కూడా తానే ముందుగా ఎదుటి వ్యక్తిని ప్రేమ పూర్వకంగా పలకరించేవాడట. అందుకే సుగుణాభి రాముడయ్యాడు. శరీరానికి తగిలిన గాయం మానిపోతుంది. కానీ, మాట చేసిన గాయం గుండెల్లో నిలిచిపోతుంది. అందుకే, వీలైనంత మృదువుగా, దయతో, మితంగా మాట్లాడాలి. అనుబంధాలకు దూరమయ్యామనే భావన, ఒత్తిడిని జయించటానికి ఇది సాయపడుతుంది..

ప్రేమతో తినండి

‘అన్నాత్పురుషః’ అంటూ అన్నం నుంచి రకరకాల శరీరాకృతులున్న జీవజాలం ఉద్భవించిందని చెబుతుంది తైత్తిరీయోపనిషత్తు. ఆహారాన్ని సరైన విధానంలో తీసుకుంటే ఔషధంగా పనిచేసి దృఢమైన దేహం, మనోనిబ్బరం, దీర్ఘాయుష్షు సొంతమవుతాయి. అయితే, దురదృష్టవశాత్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే కళకి మనం దూరమయ్యాం. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఆహారాన్ని శ్రద్ధగా, నిదానంగా భుజించాలి. నడుస్తూనో, టీవీ, కంప్యూటర్‌ చూస్తూనో తింటే మన శక్తి ఇతర అంశాల మీద కేంద్రీకృతమై జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. కృతజ్ఞతా పూర్వకంగా, ప్రేమతో ఆహారాన్ని భుజించాలి. ప్రతిదాన్నీ కృతజ్ఞతా పూర్వకంగా చేయటం వల్ల మంచి ఫలితాలుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని