ఇలా సాగు.. జయం కలుగు

ఎలా జీవిస్తే మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు.  ఏం చేస్తే జీవితం ఆదర్శవంతం, ప్రశాంతమయం అవుతాయి. ఆదిశంకర విరచిత ‘జ్ఞానపంచకం’లో వీటికి సమాధానాలు లభిస్తాయి.

Published : 13 May 2021 00:19 IST

మే 17 శ్రీ శంకర జయంతి

ఎలా జీవిస్తే మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు.  ఏం చేస్తే జీవితం ఆదర్శవంతం, ప్రశాంతమయం అవుతాయి. ఆదిశంకర విరచిత ‘జ్ఞానపంచకం’లో వీటికి సమాధానాలు లభిస్తాయి. దీన్నే ఉపదేశ పంచకం, పంచ రత్నమాల అనీ అంటారు. మారిన కాలానికి అన్వయించుకుంటూ ఒకసారి వాటి అంతరార్థాల్లోకి వెళితే...
* నీకు నిర్దేశించిన అధ్యయనం (పని) శ్రద్ధగా చెయ్యి. ఇతరులకు హాని చేసి పాపాలను సంపాదించుకోకు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించటానికి కృషి చెయ్యి. ఇంటి నుంచి త్వరగా (సరైన సమయానికి) పనికి వెళ్లటం అలవాటు చేసుకో.
* మంచి వారితో కలిసి ఉండు. భగవంతుడి మీద దృఢ భక్తి కలిగి ఉండు. తొందరపాటుతో పని చేయకు. నీకంటే ఎక్కువ జ్ఞానవంతులను గౌరవించు. పనిని మెరుగుపరచుకునే స్ఫూర్తిదాయక వాక్యాలు విను, చదువు. ఏకాగ్రతతో పనిచేసే వ్యక్తి శరీరం తనకు తెలియకుండానే ఓంకార శబ్ద సాధనలో లీనమవుతుంది.
* శ్రద్ధగా పని చేసినప్పుడు మెచ్చుకోళ్లు, బహుమతులు వస్తుంటాయి. వాటిని చూసి గర్వం తెచ్చుకోవద్దు. అధికారులు, పెద్దవారు, జ్ఞాన సంపన్నులతో వాదనకు దిగవద్దు. నీ వాదనే సరైందని ఎదుటివారిని ఒప్పించటానికి కుతర్కం ఉపయోగించకు. నువ్వే బ్రహ్మ అని, నీలో బ్రహ్మ ఉన్నాడని భావించినప్పుడు మంచి వేదాంత జ్ఞానం అలవడుతుంది. దీనివల్ల అహంకారం పెరగకుండా ఉంటుంది. రోజులో ఒక్కసారైనా నువ్వు - బ్రహ్మ ఒక్కరేనని భావించుకోవటం మరచిపోకు.  
* పనిలో లేకున్నా ఆకలి దప్పికలు వేయక మానవు. అలాంటి సమయాల్లో సాధ్యమైనంత మృదు ఆహారం తినటం అలవాటు చేసుకో. దొరికిన ఆహారంతో తృప్తిపడు. చలి, ఎండలను ఒకే రకంగా చూడు. అనవసరంగా ఎవరితో మాట్లాడకు. అలాగని ఎవరైనా సమాధానం, వివరణల కోసం అడిగినప్పుడు ఉదాసీనంగా ఉండకు.
* ఎక్కడ ఉన్నా ఒక్కడివే (ఏకాంతంగా) కూర్చో. దీని వల్ల సమస్యకు కొత్త పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఆ స్థితిలో మౌనం, ఏకాంతాలే నీతో మాట్లాడతాయి. అంతా బ్రహ్మమయమే అనేభావన సిద్ధిస్తుంది. దీనివల్ల నీకు రాసి పెట్టిన కష్టమైన ఫలితం కూడా దూది పింజలా అనిపిస్తుంది.

- చల్లా జయదేవ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని