భక్తి గాన తరంగం

‘ఎవరూ నన్ను ఆదరించని సమయంలో ఒక చేయి నన్ను స్పృశించి దగ్గరికి తీసుకుంది. గుండెకు హత్తుకుంది. నా కష్టాలు వింది. కన్నీళ్లు తుడిచింది. నేనున్నా దిగులెందుకు అనే ధైర్యాన్నిచ్చింది.

Published : 13 May 2021 00:19 IST

‘ఎవరూ నన్ను ఆదరించని సమయంలో ఒక చేయి నన్ను స్పృశించి దగ్గరికి తీసుకుంది. గుండెకు హత్తుకుంది. నా కష్టాలు వింది. కన్నీళ్లు తుడిచింది. నేనున్నా దిగులెందుకు అనే ధైర్యాన్నిచ్చింది. చూపులేని నా కళ్లకు చుక్కానిలా మారింది’ అంటూ భక్తికి ఎల్లలు లేవని, వైకల్యం అడ్డుకాదని, అంతటా ఉన్న ఆ పరమాత్మ ప్రేమకు వశుడని చాటిచెప్పిన గొప్పభక్తుడు సూరదాస్‌. మే 17 ఆయన జయంతి. భక్తి ఉద్యమం గంగా ప్రవాహంలా ఉవ్వెత్తున ఎగసేలా చేసి తన పాటలతో మానవాళి మనో మాలిన్యాన్ని కడిగిన మహనీయుడాయన. గుడిలో, గుడిసెలో, ప్రతి హృదిలో ఆ గోవిందుడు ఉన్నాడని నిరూపించారు. అంధుడైన సూరదాస్‌ 16వ శతాబ్దానికి చెందిన వారు. ఆయన జన్మస్థలం, తల్లిదండ్రులు తదితర విషయాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. అంధుడని కుటుంబ సభ్యులు, బంధువులు దూరం పెడితే భక్తితో భగవంతుడికి దగ్గరయ్యారు. అవమానాలను భరించలేక చిన్న వయసులో కొందరు యాత్రికులతో కలిసి బృందావనం చేరుకున్నారు. అక్కడే ఆయనలో అలౌకిక భగవదానుభూతి కలిగింది. హృదయంలోని ప్రేమ పాటగా మారింది. కృష్ణ నామస్మరణతో పూర్ణభక్తుడిగా మారారు. ఒకరోజు తన దీనత్వాన్ని ఆ కృష్ణుడితో వెళ్లబోసుకుంటుంటే అటుగా వెళ్తున్న వల్లభాచార్యులు చూసి... భక్తుడి పలుకుల్లో దీనత్వం, నిస్సహాయతా ఉండకూడదు.. ఒక తండ్రిని బిడ్డ అడిగినట్టు ఉండాలని జ్ఞాన బోధ చేశారు. అప్పటి నుంచి వల్లభాచార్యులనే తన గురువుగా భావించి సేవించారు. ఆయనే సూరదాసుకు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి భాగవతాన్ని వినిపించారు. బృందావనంలో కృష్ణుని ముందు కూర్చొని గోపాలుడి బాల్యక్రీడలు, గోపికలతో ఆయన రాసకేళిని బ్రజ్‌ భాషలో గానం చేసేవారు సూరదాస్‌. పాటల్లో భావగాంభీర్యం, అనురాగం ఉట్టిపడేవి. అవే సూరసాగర్‌గా ప్రసిద్ధి చెందాయి. ‘నర్‌ అపనీ కరనీకరే నరసీ నారాయణ హోయ్‌ -  నరుడు తన కర్తవ్య నిర్వహణ ద్వారా నారాయణుడు అవుతాడు’ అని బోధించారు. సుమారు వందేళ్లు జీవించిన సూరదాస్‌ బృందావన కృష్ణుడిలోనే లీనమయ్యారు.

- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని