ఆధ్యాత్మిక జ్ఞాన నిధి

భగవత్తత్వం తెలుసుకొని, ఆయనలో లయించటమే తన కర్తవ్యమని చెబుతారు తరిగొండ వెంగమాంబ. తిరుమల శ్రీనివాసుణ్ని మది నిండా ...

Published : 20 May 2021 00:14 IST

భగవత్తత్వం తెలుసుకొని, ఆయనలో లయించటమే తన కర్తవ్యమని చెబుతారు తరిగొండ వెంగమాంబ. తిరుమల శ్రీనివాసుణ్ని మది నిండా నింపుకుని భక్తి, నిగూఢ వేదాంత రచనలు చేశారామె. ఈ నెల 25న వెంగమాంబ జయంతి. ఆమె రాసిన తరిగొండ నృసింహ శతకం లోతైన ఆధ్యాత్మిక విశేషాలకు నెలవు.

‘‘నీ పదాబ్జముల సారములెల్ల మిళింద భాతిగన్‌ గ్రోలుచునుందునయ్య’’ అంటారు వెంగమాంబ నృసింహ శతకంలో. మకరందాన్ని తుమ్మెద తాగినట్లు పరమార్థ జ్ఞానాన్ని స్వీకరిస్తానన్న భావం ఇందులో కనిపిస్తుంది. భగవంతుని పట్ల భక్తుడికి ఉండాల్సిన ‘శరణాగతి’ని సూచిస్తుందిది. ‘‘నేడును నింట నుండు నటు నిక్కముగా మరునాడు జూచినన్‌ కాడును జేరి వేగ లయకారుని చెట్టనుబట్టి, క్రమ్మరన్‌ గూడును జేరు జీవి’’ పద్యంలో జనన మరణ చక్రాన్ని వర్ణించారు వెంగమాంబ. అలాగే జీవుణ్ని దేవుడిలో చేర్చటంలో గురువు పాత్ర గురించి చక్కగా వివరిస్తారు. మాయలో చిక్కిన వ్యక్తి గురువు చెప్పిన మాటలు మరచి, తన అసలు లక్ష్యాన్ని వదిలిపెట్టినా, గురువు అతణ్ని ఈడ్చి తెచ్చి త్రిగుణాలతో తాడు పేని, ఆ పగ్గంతో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు చేసే పనులను ఒక్కటిగా చేర్చి గట్టిగా బిగిస్తాడని అంటారు. ‘ఈ ఘటాన్ని నమ్మవద్దు. నిన్ను చూసి అఖండాన్ని చూడాలని ఎన్ని విధాలుగా బోధ చేసినా మనిషి ఎప్పుడూ ఆ ఘటాన్నే అభిమానిస్తూ కుటిలం మానడాయె’ అంటూ దేహం మీద ప్రేమతో మనుషులు దారుణకృత్యాలకు పాల్పడటాన్ని ఆక్షేపిస్తారు. ‘ఎన్నో దేహాలు ధరించి, చివరికి నీ పాద పద్మాలు శరణుజొచ్చాను. ఓ తరిగొండ నృసింహా! నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించటంలో ఇబ్బందులు పెట్టవద్దు’ అని వేడుకుంటారు. ఇలా ఈ శతకం నిండా ఆధ్యాత్మిక భక్తి సౌరభాలే.

- పాణ్యం దత్తశర్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని