ఆచరణే ప్రధానం

శ్రావస్తి నగరంలో సుభద్ర అనే తథాగత భక్తురాలుండేది. పసితనం నుంచి ఆమె బుద్ధుడే సకలం, సమస్తం అన్నట్టుగా ఎదిగింది...

Published : 20 May 2021 00:16 IST

మే 26 బుద్ధ పూర్ణిమ

శ్రావస్తి నగరంలో సుభద్ర అనే తథాగత భక్తురాలుండేది. పసితనం నుంచి ఆమె బుద్ధుడే సకలం, సమస్తం అన్నట్టుగా ఎదిగింది. యుక్త వయసు వచ్చాక వేరే నగరానికి చెందిన ఓ యువకుడితో ఆమెకి వివాహం జరిగింది. అయితే, ఆ ప్రాంతంలో ఎవరికీ బుద్ధుడి బోధనలతో పరిచయమే లేదు. వారి మధ్య తానెలా ఉండాలా అని సుభద్ర మథన పడసాగింది. ఓ రోజు బుద్ధుణ్ని మనసులో తలచుకుంటూ ‘భగవాన్‌! మీ బోధలు వినకుండా నేనెలా జీవించాలి. ఇక్కడి ప్రజలను చూస్తే జాలేస్తోంది. నా ప్రార్థన మన్నించి మీరు తప్పక ఇక్కడికి రావాలి. వీళ్లను కూడా సన్మార్గంలో నడిపించాలి. మీ దర్శనభాగ్యం కలిగే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను’ అని ఒక నిశ్చయానికి వచ్చింది. ఆశ్చర్యంగా మరుసటి రోజు బుద్ధుడు ఇతర భిక్షువులతో కలసి ఆ నగరానికి వచ్చాడు. వీధివీధీ భిక్షాటన చేస్తూ సుభద్ర ఇంటి తలుపు తట్టాడు. తన ఆరాధ్యమూర్తిని చూడగానే పులకించిపోయింది సుభద్ర. అప్పుడు బుద్ధుడు ప్రసన్న దరహాసంతో ‘‘సుభద్రా! లోకమంతా నీ నగరంలా, నీ ఇల్లులా ఉండాలనుకోవటం పొరపాటు. భూమి ఒక చోట సమతలంగా, మరోచోట ఎత్తుపల్లాలతో ఉంటుంది. ఓ చోట పూలుంటే, మరోచోట ముళ్లుంటాయి. కాళ్లకు ముళ్లు గుచ్చుకోకుండా అవి ఉన్న ప్రదేశమంతా తోలు కప్పుతామా, లేదంటే పాదరక్షలు ధరిస్తామా? నీ మనసు ప్రశాంతంగా ఉంటే ఎక్కడున్నా ఒకటే. నన్ను రూప కాయంగా భావించుకొని ఆరాధించటం కాదు, ధర్మ కాయంగా భావించు. నా ధర్మబోధల్ని ఆచరించటం అలవాటు చేసుకో. అప్పుడు నీకెవరూ దుర్జనులుగా అనిపించరు’ అన్నాడు. సుభద్రకు సత్యం బోధపడింది.

- బి.సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని